బ్రహ్మపురాణంలో అడుగడుగునా విశేషాలే!

ఓం సద్గురవే నమః

పద్మజాయ పవిత్రాయ పద్మనాభసుతాయ చ | పద్మపుష్పైః సుపూజ్యాయ నమః పద్మధరాయ చ ||

బ్రహ్మపురాణం

ఈ పురాణాన్ని బ్రహ్మ మరిచీ మహామునికి బోధించాడు.

అష్టాదశ పురాణాలలో బ్రహ్మపురాణం మొదటిది . ‘ బ్రహ్మం మూర్థా హరేరేవ ‘ అన్న మాట ప్రకారం ఈ బ్రహ్మపురాణం శ్రీమహావిష్ణువు శిరస్సుగా చెప్పబడింది . “ నానాఖ్యానేతిహాసాడ్యం దశ సాహస్రముచ్యతే ” అనగా ఈ పురాణంలో మొత్తం పదివేల (10,000) శ్లోకాలున్నాయి . ఇది పూర్వభాగం ఉత్తరభాగం అని రెండు భాగాలుగా విభజించబడింది . ఈ పురాణంలో మొత్తం 246 అధ్యాయాలున్నాయి . పేరుకి ఈ పురాణం బ్రహ్మపురాణం అనివున్నా ఇందులో బ్రహ్మదేవుడికి సంబంధించిన అంశాలు వుండవు . అత్యధికంగా శ్రీమహావిష్ణువు గురించిన విశేషాలు , కథనాలే ఈ పురాణంలో చెప్పబడ్డాయి . అందుకే ఈ పురాణాన్ని వైష్ణవ పురాణంగానే కీర్తిస్తారు . ఆద్యం సర్వపురాణానాం పురాణం బ్రహ్మముచ్యతే | అష్టాదశ పురాణాని పురాణజ్ఞాః ప్రచక్ష్యతే || అని విష్ణు పురాణంలోని శ్లోకం బ్రహ్మపురాణాన్ని ఆదిపురాణంగా పేర్కొంటుంది . “ రాజ సేషుచ మాహాత్మ్య మధికం బ్రహ్మణోవిదుః ” అన్న మత్స్య పురాణంలోని శ్లోకం ప్రకారం బ్రహ్మపురాణం రాజసపురాణంగా చెప్పబడింది.

బ్రహ్మ పురాణంలో వర్ణించబడ్డ విషయాలు మొదటగా వ్యాస స్తుతితో మొదలై, సృష్టి కథనం, ఆదిత్యుని జననం, శమంతకోపాఖ్యానం, జంభుద్విపవర్ణనం, ఇందులో సర్వతీర్థ మహత్యం రుద్రాఖ్యానం, మన్మథ దహనం దక్షయజ్ఞ విద్వాంసం, పంచతీర్థ మహత్యం, నృసింహ మహత్యం, ద్వాదశ యాత్రలు, విష్ణులోక వైభవం, సముద్ర స్నాన విధి కృష్ణనది స్నాన విధి, 70 – 175 అధ్యాయాలల్లో గౌతమి మహత్యం వర్ణించబడినది.

నరకాసుర వధ, రుక్మిణి కళ్యాణం, హరి అంశ అవతారాలు , యమలోక మార్గం , నరకం లోని దుఃఖాలు , ద్వాపర యుగాంతం , మానవులకు ఉత్తమగతి ప్రాప్తించే మార్గాలు , విద్యా అవిద్యా స్వరూపం అన్నదాన ప్రశంస , యోగాభ్యాసం , జ్ఞాన యోగం, మోక్షప్రాప్తి తదితర విషయాలు ఈ పురాణంలో వర్ణించబడ్డయి. బ్రహ్మపురాణ ఫలశృతి దివ్యపురాణాన్ని బ్రహ్మచారులు , గృహస్థులు , శ్రవణం చేయవచ్చు . బ్రహ్మతత్త్వాన్ని తెలుసుకోవటానికి , ఈ పురాణ శ్రవణం చేయాలి.

శ్రావయే బ్రాహ్మణోయస్తు సదా సర్వసుసంయుతః | ఏకాదశ్యాం ద్వాదశ్యాం చ విష్ణులోకం సగచ్ఛతి || ( శ్లో 28 , అధ్యా -246 ) వేదంతో సమానమైన ఈ బ్రహ్మపురాణాన్ని పఠించినా విన్నా అతడు విష్ణులోకానికి చేరుకుంటాడు. ఏకాదశి, ద్వాదశి లాంటి పుణ్యదినాల్లో పండితుడైన బ్రాహ్మణుడిచేత ఈ పురాణాన్ని చెప్పించుకుని శ్రద్ధగా విన్నవారు కూడా విష్ణుపదానికి చేరుకుంటారు.

సర్వం ఈశ్వరార్పణం అస్తు

– బండి చాణుక్యచంద్రగుప్త, యం.ఎ పురాణేతిహాసా విభాగము, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*