త్వరలో తెలంగాణకు ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి: కిషన్ రెడ్డి

హైదరాబాద్: భువనగిరి జిల్లా బీబీనగర్‌లో కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిమ్స్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి శనివారం సందర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డైరెక్టర్ భాటియా, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి ఎయిమ్స్ ఆవరణలో మొక్కను నాటిన తర్వాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఎయిమ్స్ నిర్మాణ పనుల పురోగతి వివరాలను తెలుసుకున్నారు.

కోవిడ్ పై వైద్యులు, వైద్య పారిశుధ్య సిబ్బంది చేస్తున్న పోరాటానికి చిహ్నంగా వారిని కరోనా వారియార్స్ గా గుర్తిస్తూ డాక్టర్లకు నరేంద్రమోదీ ప్రభుత్వం, వారికి యాభై లక్షల రూపాయల భీమా సదుపాయం అందుబాటులోకి తెచ్చిందని, ఇంకా వారి సేవలకు గుర్తుగా, పూల వర్షం కురిపించి,వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మంజూరు అయిన ఎయిమ్స్ కు స్థలం అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత జాప్యం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో స్థలం ఇవ్వడం జరిగిందని, నిర్మాణ పనులను పూర్తి చేసిన భవనాలను అధికారికంగా ఎయిమ్స్ కు అందచేయకపోవడంతో కలెక్టర్ త్వరగా ప్రక్రియ పూర్తి చేసి అప్పగించాలని సూచించారు. ఈ ప్రాంతంలో పది ఎకరాల అదనపు భూమిని అప్పగిస్తే రూరల్ హెల్త్ కేర్ యూనిట్ ను ప్రారంభిస్తామని, అది కూడా ఎయిమ్స్ పర్యవేక్షణలో పనిచేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.

ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ భాటియా మాట్లాడుతూ మెడికల్ కళాశాల విద్యార్థులు రెండవ బ్యాచ్ వచ్చేలోపు హాస్టల్ వసతి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు అలాగే కరోనా కారణంగా నిలిపివేసిన ఓ పి డి సేవలను మూడు వారాల్లో పునరుద్ధరిస్తామని, అందుకు గాను డాక్టర్లు, నర్సుల ఇంటర్వ్యూలు నిర్వహించామని తెలిపారు.

ఎయిమ్స్ నిర్మాణాలు త్వరలోనే పూర్తి చేస్తామని మరో రెండు మూడు సంవత్సరాలలో ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఎయిమ్స్ హాస్పిటల్స్ సేవలను ఇతర రాష్ట్రాలలో కూడా అందించాలన్న ప్రధానమంత్రి ఆశయంలో భాగంగా తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎయిమ్స్ ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.

రానున్న పండుగ కాలంలో ప్రధానమంత్రి పిలుపు మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు “ప్రజా ఉద్యమం” లో భాగస్వాములుగా, భౌతిక దూరం పాటిస్తూ, చేతులను శుభ్రంగా కడుక్కుంటూ,ముఖానికి మాస్కులు ధరించి కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎయిమ్స్ లో అన్ని రకాల సౌకర్యాలు కల్పనకు కేంద్రం సిద్ధంగా ఉందని ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ అధికారిక వెబ్ సైట్‌ను కిషన్ రెడ్డి ప్రారంభించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*