
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో బంగారు నాణేల కలకలం రేగింది. తమిళనాడు రాష్ట్రం, కృష్ణగిరి జిల్లా, హోసూర్ సమీపంలో రోడ్డుపక్కనే వున్న మట్టిదిబ్బలో వందల ఏళ్ల క్రితం నాటి పురాతన బంగారు నాణేలు దొరకడంతో ఒక్కసారిగా భారీగా జనం ఎగబడ్డారు. దీంతో హోసూరు- బాగలూర్ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతగా అంటే పోలీసులు వచ్చి జనాన్ని అదుపు చేయాల్సి వచ్చింది.
హోసూర్ రోడ్డు పక్కనే ఉన్న మట్టి దిబ్బలో బంగారు నాణేలు మెరుస్తుండటం గమనించిన స్థానికులు తవ్వకాలు చేపట్టారు. దొరికిన బంగారు నాణేలను బంగారు దుకాణాల్లో చూపిస్తే స్వచ్ఛమైన మేలిమి బంగారం అని తేలింది. వార్త దావాలనంలా వ్యాపించడంతో ఒక్కసారిగా రహదారిపైకి వచ్చి తవ్వకాలు మొదలుపెట్టారు. చాలామందికి ఆభరణాలు దొరికాయి. బంగారు నాణేలపై అరబిక్ లిపి ఉండడంతో ఇవి వందల ఏళ్ల క్రితం నాటివని తేల్చారు.
హోసూరు పోలీసులు విచారణ చేపట్టారు. బంగారు నాణేలు మట్టి దిబ్బలోకి ఎలా వచ్చాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఎవరైనా గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టి దొరికిన వాటిని తెచ్చి దాచి పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Be the first to comment