వాయుపురాణం ఫలశ్రుతి తెలుసా?

ఓం సద్గురవే నమః వాయుపురాణం నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణమ్ | ప్రప్రద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ||

మొదటిగా శ్వేత కల్పంలో శివుడు వాయువునకు బోధించారు.. పురాణాలల్లో నాలుగవ పురాణం… వాయుపురాణం పేరెందుకు ?

వాయుదేవుడు వక్తగా ఉన్న కారణంగా ఈ పురాణానికి వాయుపురాణం అని పేరు… ఈ వాయుపురాణం లో శివలీలలు వర్ణింపబడ్డాయి.. చతుర్విOశతి సాహస్రం పురాణం తదోహోచ్యతే అన్న వచనం ప్రకారం ఈ పురాణంలో 24,000 శ్లోకాలున్నాయి..

వాయుర్వామో మహేశితు: ఈ పురాణం శ్రీమహావిష్ణువు శరీరంలో ఎడమభుజంగా కీర్తించారు.

వాయుపురాణంలో ప్రస్తుతం 11,000 వేల శ్లోకాలు మాత్రమే లభ్యమవుతున్నాయి….

(1)క్రియపాదం
(2) అనుషంగా పాదం:
(3)ఉపోద్ఘాతపాదం
(4) ఉపసంహర పాదం అను 4 భాగాలుగా విభజింపబడింది.

భారతదేశంలో సుప్రసిద్ధ దివ్యక్షేత్రమైన గయా క్షేత్రం గురించి ఈ పురాణం వర్ణిస్తుంది. వాయుపురాణంలో వర్ణింపబడ్డ విషయాలు కుబేర నగరం, దేవకూట పర్వతం, నీలకంఠ వృత్తాంతం, ఋషుల వృత్తాంతాలు, వేదాలు విభాగాలు, విశ్వపురుషుడు, పాతాళ యోగం, మహేశ్వర యోగం, 28 ద్వాపర యుగాలల్లో శివుని అవతారాలు, శివ కేశవ ప్రాశస్త్యం, ఋతువులు, దక్షుని వృత్తాంతం, యుగధర్మ నిరూపణం, బ్రహ్మ చేసిన లింగోద్భావం స్తవం, నారాయణ అవతారాలు, శివలోకప్రాప్తి, అష్టాదశ పురణలల్లో శ్లోకాలు, గయాతీర్థ మహిమ, శివపురం వైభవం, కైలాస వర్ణన, గంగ అవతరణం, శుక్రాచార్య వృత్తాంతం, శుక్రాచార్య చేసిన శంకర త్రిషతీ స్తోత్రం, బ్రహ్మ నుండి వచ్చిన అక్షరాల ఆవిర్భావం, తదితర విషయాలు వర్ణింపబడ్డయి.

శివకేశవ ప్రాశస్త్యం మహావిష్ణువు కోరిక విన్న పరమేశ్వరుడు ఎంతో సంతోషించి “ విష్ణూ నీ దివ్య స్తుతికి, నీ నిశ్చలమైన భక్తికి నేనెంతో ఆనందించాను. అసలు నీవూ నేనూ వేరే కాదు మనిద్దరం ఒక్కటే.

శ్లో) ప్రకాశం చాప్రాకాశం చ జంగమం స్థావరం చ యత్| విశ్వరూప మిదం సర్వం రుద్రనారాయణాత్మకమ్ || అహమగ్నిర్భగవాన్ సోమో భవాన్ రాత్రిరహం దినమ్ | భవానృతమహం సత్యం భవాన్ క్రతురహం ఫలమ్ || భావాన్ జ్ఞానమహం ప్లేయం యజ్ఞపిత్వా సదా జనాః | మాం విశని త్వయి ప్రీతే జనాః సుకృత కారిణః || ఆవాభ్యాం సహితా చైవ గతిర్నాన్యా యుగక్షయే | ఆత్మానాం ప్రకృతిం విద్ధి మాం ద్ధి పురుషం శివమ్ || భవానర్ధశరీరం మే త్వహం తవ యథైవ చ | వామపార్శ్వమహం మహ్యం శ్యామం శ్రీవత్సలక్షణమ్ || త్వం చ వామేతరం పార్శ్వం త్వహం వై నీలలోహితః | త్వం చ మే హృదయం విష్ణో తవ చాహం హృది స్థితః || భవాన్ సర్వస్స కార్యస్య కర్తాహమధిదైవతమ్ | తదేహి స్వస్తితే వత్స గమిష్యామ్యంబుదప్రభ || ఏవముక్త్వా గతో విష్ణోర్దేవో 2 వర్థానమీశ్వరః || ( శ్లో 20-26 , అధ్యా -25 )

కేశవా ఈ కనపడే స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా రుద్రనారాయణాత్మకం. నేను అగ్నినైతే నీవు సోముడివి. నేను ఉదయమైతే నీవు రాత్రివి. నీవు ఋతమైతే నేను సత్యాన్ని, నీవు క్రతుస్వరూపుడవైతే నేను దాని ఫలాన్ని, నీవు జ్ఞానానివైతే నేను బ్లేయాన్ని. నిన్ను ధ్యానించినవారు నీ నామాన్ని జపించినవారు నన్ను చేరుకుంటారు. నా అనుగ్రహాన్ని పొందుతారు. నీవు సంతోషిస్తే ప్రజలంతా మంచి కార్యాలు చేసే ఆసక్తిని పెంపొందించుకుంటారు. యుగాంతకాలంలో మన ఇద్దరితో కూడినదే మార్గం. మరో మార్గం లేదు. నన్ను నీవు ప్రకృతిగా -పురుషుడిగా గ్రహించు. నేను నీకు సగం శరీరాన్ని, అలాగే నీవు కూడా నాకు సగశరీరానివి. ఓ విష్ణూ నీవు నా హృదయానివి. అలాగే నీ హృదయంలో కూడా నేనున్నాను. నీవు సకల కార్యాలకీ కర్తవి. దానికి నేను దైవతాన్ని అని విష్ణువుతో పలికిన పరమేశ్వరుడు. బ్రహ్మని, విష్ణువుని ఆశీర్వదించి అక్కణ్ణుంచి అంతర్థానమయ్యాడు.

వాయుపురాణం ఫలశ్రుతి

ధనంయశస్య మాయుష్యం పుణ్యం పాపప్రణాశనమ్ | కీర్తనం శ్రవణం చాస్య ధారణం చ విశేషతః ||

వాయుపురాణాన్ని విన్నవాళ్ళు, శ్రద్ధగా పఠించినవాళ్ళు ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్ఠల్ని ఆయురారోగ్యాల్నీ పొంది సకల పాపాల నుంచి విముక్తులై పుణ్యఫలాల్ని పొందుతారు.

సర్వం ఈశ్వరార్పణం అస్తు.

-బండి చాణుక్యచంద్రగుప్త యం.ఎ పురాణేతిహాసా విభాగము, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*