
హైదరాబాద్: కీలకమైన నాలుగు బిల్లులను తెలంగాణ శాసనసభ ఆమోదించింది.
1) ఇండియన్ స్టాంప్ బిల్ (తెలంగాణ) 2020
2) తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్ (కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ) 2020
3) జిహెచ్ఎంసి సవరణ బిల్లు 2020 ప్రవేశ పెట్టనున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
4) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్ 2020
బిల్ నెంబర్ ( 1) : భూముల ప్రాథమిక విలువ నిర్ధరణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు 47ఏ కింద విచక్షణాధికారాలను తొలగిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేశారు.
బిల్ నెంబర్ (2) : వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా బదలాయించేందుకు అధికారులకు విచక్షణాధికారాలు రద్దు చేయడం. ధరణి ద్వారానే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేలా నాలా చట్టాన్ని సవరించారు. వ్యవసాయేతర ఆస్తులకు కూడా గుర్తింపు సంఖ్య ఇచ్చేలా చట్టానికి సవరణలు సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు.
బిల్ నెంబర్ (3) : జిహెచ్ఎంసి చట్ట సవరణ లో కీలక అంశాలు : ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు పూర్తి జవాబుదారీతనం, బాధ్యతలు చట్టంలో నిబంధనలు చేర్చనున్నారు. విధులు సక్రమంగా నిర్వహించని ప్రజాప్రతినిధులు, అధికారులను తొలగించేలా కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత. పదిశాతం హరితకు బడ్జెట్, వార్డు కమిటీల ఏర్పాటు వాటి పనివిధానంలో మార్పులు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి, రెండు సార్లు ఒకే రిజర్వేషన్ అమలు సహా జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలను మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు.
బిల్ నెంబర్ (4) : హైకోర్టు సూచన మేరకు నిందితులకు పూచీకత్తు అంశానికి సంబంధించిన సీఆర్పీసీ చట్టాన్ని సవరించారు. ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ చట్టసవరణ బిల్లులపై శాసనసభలో చర్చించి అనంతరం ఆమోదించారు. ఇదే బిల్లులపై చర్చించడానికి బుధవారం నాడు శాసన మండలి ప్రత్యేకంగా సమావేశం కానుంది.
రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ ఒక మహానగరంగా, విశ్వనగరంగా ఎదగడానికి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనసభలో జీహెచ్ఎంసీ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరానికి 429 సంవత్సరాల కిందట బీజం పడింది. 1869లో హైదరాబాద్ మున్సిపాలిటీగా, 1933లో చాదర్‌ఘాట్ అనే మరో మున్సిపాలిటీ, 1937 జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ, 1945లో సికింద్రాబాద్ అనే మున్సిపాలిటీ ఏర్పడింది. 1948-56 మధ్య కాలంలో హైదరాబాద్ స్టేట్‌గా ఉన్నప్పుడే 1955లోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. హెచ్ఎంసీ యాక్ట్ కింద నాడు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వాలు సంకల్పించలేదు. కొత్త చట్టం తీసుకురావాలనే ఆలోచన వారికి లేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమైన ఐదు సవరణలు చేసుకుందని కేటీఆర్ తెలిపారు.
2015లో ఒక జీవో ద్వారా కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు 50 శాతం స్థానాలను మహిళలకే ఆమోదించుకున్నాం. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో మహిళా రిజర్వేషన్లకు ఇవాళ చట్టం చేసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు.
Be the first to comment