కలాం.. నిరంతర స్ఫూర్తి.. భవిష్యత్ భారతానికి మార్గదర్శి..

న్యూఢిల్లీ: భరతమాత ముద్దుబిడ్డ, భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది.

భారత రక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించి మిసైల్ మ్యాన్‌గా, అధ్యాపకుడిగా, మేధావిగా, స్ఫూర్తిదాయక రచయితగా. భవిష్యత్ భారతానికి కలాం చేసిన మార్గదర్శనం చిరస్మరణీయమంటూ ఉప రాష్ట్రపతి వెంకయ్య ట్వీట్ చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కలాంకు నివాళులర్పిస్తూ ట్విటర్‌లో ఓ వీడియో జత చేశారు. రాష్ట్రపతి పదవీకాలం ముగియగానే ఆయన అధ్యాపకుడిలా మారి భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేశారని మోదీ శ్లాంఘించారు.

 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విటర్ ద్వారా మాజీ రాష్ట్రపతికి నివాళులర్పించారు.

వాజ్‌పేయి హయాంలో పోఖ్రాన్ అణుపరీక్షలతో భారత సత్తాను ప్రపంచానికి తెలియజేసిన కలాం శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ముఖ్యంగా రక్షణ, అంతరిక్ష రంగాల్లో భారత్‌ను అగ్రపథాన నిలిపేందుకు ఆజన్మాంతం కృషి చేశారు. నాడు పోఖ్రాన్‌లో అత్యంత రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించి అమెరికాతో సహా ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురిచేశారు. భారత అణుపితామహుడుగా పేరు తెచ్చుకున్నారు.

చిన్నారులను, విద్యార్ధులను, యువతను ఎంతో అభిమానించే కలాం తుది శ్వాస కూడా వారి మధ్యే విడిచారు. ఉన్నతమైన కలలు కనకపోవడం నేరమనేవారు కలాం. కలలు నిద్రలో వచ్చేవి కావని, నిద్రరాకుండా శ్రమించి సాధించాల్సినవని చెప్పేవారు. లక్ష్యం లేని జీవితం వ్యర్ధమని, లక్ష్యాత్మకంగా జీవించాలని ఉద్బోధించారాయన.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*