శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో గాన గంధర్వునికి ఘననివాళి

సింగపూర్: “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ వారి ఆధ్వర్యంలో తెలుగువారి అభిమాన గాయకులు పద్మభూషణ్ ఎస్ పి బాలసుబ్రమణ్యం సంస్మరణలో “గాన గంధర్వునికి ఘననివాళి” కార్యక్రమం అంతర్జాలం వేదికగా జరిగింది. భారత్ నుండి పలువురు సినీ ప్రముఖులు, సింగపూర్ లో నివసించే బాలు గారి అభిమానులు  కలసి బాలు గారి పాటలను, వారి మాటలను, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని తలచుకుంటూ, వారు పెంచుకున్న అభిమానాన్ని, పంచుకున్న అనుబంధాన్ని గూర్చి మాట్లాడుతూ నివాళులు అర్పించడం  ఈ కార్యక్రమం ప్రత్యేకత.


ప్రముఖ నేపథ్య గాయని గిన్నిస్ బుక్ రికార్డ్ విజేత గానకోకిల పి సుశీల మాట్లాడుతూ… బాలు గారితో కలిసి తాను ఎన్నో వేల పాటలు పాడానని బాలుగారి లేని లోటు సినీ ప్రపంచానికి తీరదని అన్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. తాను 400కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాను అంటే కారణం బాలు వంటి అద్భుత గాయకులు ఉండడం వల్లనే సాధ్యమైంది అన్నారు.

 

సీనియర్ చలనచిత్ర ఛాయాగ్రహకులు ఎస్ గోపాల్ రెడ్డి  మాట్లాడుతూ.. బాలు గారు నటించిన ‘పక్కింటి అమ్మాయి’ వంటి చిత్రాలకు తాను ఛాయాగ్రహకులుగా పని చేశానని తెలిపి వారి అనుబంధాన్ని తలచుకున్నారు.

ప్రముఖ నేపథ్య గాయకులు మనో…  బాలు పాటలను పాడి అందరిని మైమరపింపజేశారు.

ప్రముఖ సినీ గేయరచయిత భువనచంద్ర మాట్లాడుతూ.. బాలు వంటి గాయకులు మరణానికి అతీతులని వారి పాటలతో ప్రేక్షకులందరి మనసులలో ఎన్నటికీ చిరంజీవులుగా ఉంటారని అన్నారు.

మ్యూజికాలజిస్ట్ రాజా మాట్లాడుతూ.. బాలు తన వ్యక్తిగత జీవితంలో ఎంత సరదాగా అందరితో కలసి నవ్వుతూ నవ్విస్తూ ఉంటారో చెబుతూ బాలుకు రఫీ పాటలపై ఉన్న ప్రత్యేక అభిమానాన్ని గురించి వెల్లడించారు.

అమెరికా నుంచి వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ.. బాలు  అమెరికా పర్యటనలో వారి ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించి తమ కుటుంబ సభ్యులలో ఒకరిగా కలిసిపోయిన వైనాన్ని తలచుకున్నారు.

 

ప్రముఖ సినీ నటులు హర్షవర్ధన్ మాట్లాడుతూ బాలుపై తన మనసులో ఉన్న ఎనలేని అభిమానాన్ని వెల్లడించి ఒక టీవీ ధారావాహిక కోసం తాను రచించిన పాటను బాలు పాడడం తన అదృష్టమన్నారు.

 

వంశీ రామరాజు మాట్లాడుతూ.. బాలు చేసినటువంటి సాంఘిక సేవా కార్యక్రమాలను గూర్చి  కొనియాడారు. బాలుకు భారతరత్న ఇవ్వాలని, అందుకోసం ప్రపంచ వ్యాప్తంగా వున్నా బాలు అభిమానులు ప్రయత్నించాలని ఆకాంక్షించారు.

 

ప్రముఖ గాయని సంధ్య జయకృష్ణ చక్కని పాటలను వినిపించడమే కాకుండా, ఈ కార్యక్రమంలోనికి సుశీలమ్మ గారిని తీసుకువచ్చి  బాలుతో ఉన్న అనుబంధాన్ని పంచుకునేటట్లుగా చేయడంతో నిర్వాహకులు ఆమెకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

అమెరికా నుంచి ఆధ్యాత్మికవేత్త మధు ప్రాఖ్య కూడా తమ అనుభవాలను పంచుకుంటూ కవితాపూర్వక నివాళులర్పించారు.

సింగపూర్ నుండి విశ్వాత్ముల రవి బాలు పాటలను ఆలపించగా, సుబ్బు వి పాలకుర్తి కవితా గానం చేశారు.

పద్మజా నాయుడు, రవి కిరణ్, రాపోలు నందు, కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు రత్న కుమార్, బాలు సింగపూర్ పర్యటనలలో తమ అనుభవాలను, అలాగే ముత్యాలముగ్గు నిర్మాత MVLతో, నూజివీడుకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్నారు. MVL గారి అమ్మాయి అనురాధ, బాలుతో వారి నాన్నకు ఉన్న అనుబంధాన్ని ఆడియో రూపంలో పంచుకున్నారు.

రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా సమన్వయపరుస్తూ కార్యక్రమం నిర్వహించగా, గణేశ్న రాధాకృష్ణ ముఖ్య సాంకేతిక నిర్వాహకులుగా, రామాంజనేయులు, సుధాకర్ సాంకేతిక సహాయకులుగా కార్యక్రమాన్ని నిరాటంకంగా నడిపించారు.

<iframe src=”https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fradhika.mangipudi.5%2Fposts%2F10208104037394899&width=500″ width=”500″ height=”624″ style=”border:none;overflow:hidden” scrolling=”no” frameborder=”0″ allowTransparency=”true” allow=”encrypted-media”></iframe>

‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ అధ్యక్షులు రత్న కుమార్ మాట్లాడుతూ.. “బాలు పాటకు మరణం లేదు. వారు ఎప్పటికీ సజీవులే. ఇది ఒక సంతాపసభ వలే కాకుండా బాలు పాటకు,  వ్యక్తిత్వానికి పట్టం కడుతూ వారి సంస్మరణలో ఒక సాయంకాలం వారికి నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించాము. మా కోర్కె మన్నించి బాలుపై అభిమానంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుశీల, కోటి, మనో , భువనచంద్ర వంటి ప్రముఖులకు అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలియజేశారు.


సుమారు నాలుగు గంటల పాటు నిర్వహించబడిన ఈ కార్యక్రమాన్ని ఫేస్‌బుక్, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. వివిధ దేశాలలోని వేలాది మంది బాలు అభిమానులు కార్యక్రమాన్ని వీక్షించారు.

https://youtu.be/NPRY9j2Wzb4

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*