మూసీ గతం ఎంతో ఘనం.. పూర్వ వైభవం ఎందుకు సాధ్యం కాదు?

హైదరాబాద్: చరిత్రను చూస్తే ఎన్నో నాగరికతలు, నగరాలు నదుల తీరంలోనే పుట్టాయి.. హైదరాబాద్ నగర చరిత్ర అంతా మూసీనదితో ముడిపడిందే.. కులీకుతుబ్ షా-భాగమతి, కిర్క్ పాట్రిక్-ఖైరున్నిసాల ప్రేమ కథలకు మూసీతో సంబంధం ఉంది. వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది నల్లగొండ వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. ఈసీతో సహా కొన్ని వాగులు మూసీలో కలుస్తాయి. ఈ నదికి 12 సార్లు భయంకర వరదలు వచ్చాయి. మూసీ జలాలలో వేలాది ఎకరాలు పంటపొలాలు సాగవుతున్నాయి. అప్పట్లో నిండుగా ఉండే ఈ నదిలో పడవలు తిరిగేవి. ఎంతో మంది మత్స్యకారులు ఉపాధి పొందేవారు. నా పరిశోధనలో కనిపించిన కొన్ని సంక్షిప్త చారిత్రిక ఘట్టాలను చూడిండి..

1578 సం: గోల్కొండ కోట నుంచి 12 కిలో మీటర్ల దూరంలో చంచలం (చంచల్ గూడ) అనే గ్రామముండేది.. అక్కడికి వెళ్లాలంటే మూసీ (ముచికుంద) నది దాటాలి.. నిండుగా పారే ఈ నది వర్షాకాలంలో బీభత్సంగా ప్రవహించేది.. రాకుమారుడు కులీ కుతుబ్ షా తరచూ గుర్రం మీద ఈ నదిని దాటి భాగమతిని కలవడానికి వెళుతున్న విషయం సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షాకు తెలిసింది. వెంటనే ఒక వంతెన కట్టించాలని ఆదేశించాడు.. అలా కట్టిందే పురాణాపూల్ వంతెన.. మూసీపై తొలి వంతెన ఇది..

1590 సం: గోల్కొండ జనాభా పెరిగిపోయింది.. సరికొత్త నగరం అవసరం అని భావించారు సుల్తాన్ కులీ కుతుబ్ షా.. మూసీ నది ఒడ్డున కట్టిన ఈ నగరానికి తన భార్య భాగమతి పేరిట భాగ్ నగర్ (ఉద్యాన నగరం) అనే పేరు పెట్టారు.. ఆ తర్వాత హైదరాబాద్ గా మారిపోయింది.

1631 సం. హైదరాబాద్ కట్టిన తర్వాత తొలిసారి మూసీ నదికి భారీ వరద వచ్చింది. పురానాపూల్ సహా పలు నివాస ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఆరోజుల్లో అపార నష్టం జరగింది.

1677సం: గోల్కొండకు వచ్చిన చత్రపతి శివాజీ మహరాజ్ పురానాపూల్ వంతెన మీదుగా మూసీ నది దాటి చంద్రాయణ గుట్ట మీదుగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లారు.

1803సం: సుందర మూసీ నది ఒడ్డున 60 ఎకరాల విస్తార్ణంలో బ్రిటీషు రెసిడెంట్ జేమ్స్ ఆచిల్లెస్ కిర్క్ పాట్రిక్ అద్భుతమైన బిట్రిష్ రెసిడెన్సీ (నేడు కోఠి ఉమెన్స్ కాలేజీ) నిర్మించారు.. ఖైరున్నిసాను విహాహం చేసుకున్న కిర్క్ పాట్రిక్ మూసీలో తరచూ పడవలో విహరించేవాడు.

1831సం: మూసీ నది ఉగ్రరూపం దాల్చి అపార ప్రాణ ఆస్తి నష్టం కలిగించింది. అప్పుడు హైదరాబాద్ వచ్చిన ఏనుగుల వీరాస్వామయ్య ఈ విషయాన్ని తన ‘కాశీయాత్ర చరిత్ర’లో ఉల్లేఖించాడు.. కొత్తగా నిర్మిస్తున్న చాదర్ ఘాట్ వంతెన కూడా నాటి వరదలో దెబ్బతిన్నది.

1903సం: మరోసారి మూసీకి ఒక మోస్తారు వరద వచ్చింది. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి.. నది ఒడ్డున నివాసాలు ఉండకుండా అప్పటి ప్రభుత్వం కాస్త కట్టడి చేసింది.

1908సం: హైదరాబాద్ చరిత్రలో మరో విషాదం..

మూసీ నది వరదల్లో మూడొంతుల నగరం మునిగింది. 15 వేల మందికి పైగా తుడుచుకు పోయారు.. 80 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ స్థితిని చూసి చలించిపోయిన నవాబు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పట్టుచీర, కుంకుమ, పుసుపు, ప్రమిదలతో మూసీకి హారతి ఇచ్చారు. మూసీకి భవిష్యత్తులో ఇలాంటి వరదలు రావద్దని మహబూబ్ అలీఖాన్.. ప్రఖ్యాత ఇంజినీరు మోక్షగుండం విశ్వేశరయ్యను హైదరాబాద్ రప్పించారు.. ఆయన సలహా మేరకు మూసీనది, దాని ఉపనది ఈసీపై ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ ఆనకట్టలను కట్టించారు.. మూసీ నది తీరం వెంట పెద్ద ఎత్తున గోడలు నిర్మించారు.. ఈ పనులు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో పూర్తయ్యాయి..

ఇంతటి చరిత్ర ఉన్న మూసీ నది గత 50 ఏళ్లలో మురికి కూపంగా ఎందుకు మారింది? 20 ఏళ్ల క్రితం వరకూ ఈ మురికి హైదరాబాద్ వరకే ఉండేది. నేడు గ్రామీణ ప్రాంతాల మీదుగా పారే మూసీ కూడా కాలుష్యం కాటున పడింది. సూర్యాపేటలోని మూసీ ప్రాజెక్టుకూ ఇది పాకింది.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మూసీని ప్రక్షాళన చేస్తామని, పూర్వ వైభవం తెస్తామని కల్లిబొల్లి కబుర్లు చెబుతాయి. కోట్లాది రూపాయల బడ్జెట్ అంటాయి.. నామమాత్రం, తూతూమంత్రం పనులలో మభ్య పెడుతారు.. ఆ తర్వాత పనులు అటకెత్తిస్తారు..

మూసీకి పూర్వ వైభవాన్ని మన జీవిత కాలంలో చూడగలమా? భారీ వర్షాలు పడ్డప్పుడు ఆనకట్టల గేట్లు తెరిచినప్పుడే ఈ నది నిండుగా కనిపించాలా? సాధారణ రోజులలో నదిలోని జలాలను స్థిరీకరిస్తే ఈ నదని పర్యాటక ప్రాంతంగా మార్చలేమా? ప్రతి రోజూ రెండుసార్లయినా మూసీ నది దాటుతూ ప్రయాణం చేసే నేను దాదాపుగా రోజూ మనసులో అనుకుంటూనే ఉంటాను.. పాలకులు నిజంగా తలచుకుంచే ఇది సాధ్యమే.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోదీ శబరిమతిని ప్రక్షాళన చేసి సుందర నదీ తీరంగా మార్చలేదా? ఇప్పుడు దేశ ప్రధాని హోదాలో గంగామహానదిని ప్రక్షాళన చేయడం లేదా? వాటి ముందు మూసీ నామమాత్రమే కదా? మోదీలాంటి సంకల్పం ఉంటే తప్పక సాధ్యమే అని కచ్చితంగా చెప్పగలను..

– క్రాంతి దేవ్ మిత్ర, జర్నలిస్ట్, హైదరాబాద్. ( 90000 01607 )

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*