ధరణి ఇలా పని చేస్తుంది

★ ధరణి ఇలా పని చేస్తుంది

 

★ సులభంగా స్లాట్‌ బుకింగ్‌..

 

★ కూర్చున్న చోటే

అన్ని వివరాల నమోదు

 

★ వెరిఫికేషన్‌ నుంచి

రిజిస్ట్రేషన్‌ దాకా అంతా ఆన్‌లైన్‌..

 

★ సామాన్యులకూ అర్థమయ్యేలా

వెబ్‌సైట్‌ రూపకల్పన

 

★ ఫొటోలు, బయోమెట్రిక్‌

వేలిముద్రలతో పక్కామార్పిడి..

 

★ రాష్ట్రంలోని ప్రతి అంగుళం

ధరణిలో నిక్షిప్తం

 

యావత్తు రాష్ట్ర ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్‌ పారదర్శకత అనే అత్యున్నత లక్ష్యానికి అనుగుణంగా రూపుదిద్దుకున్నది. రాష్ట్ర చరిత్రలోనే విప్లవాత్మక అడుగు వేస్తూ ఈ నెల 25న దసరా పండుగనాడు ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సాంకేతికంగా ధరణి పోర్టల్‌ పూర్తిస్థాయిలో రెడీ అయ్యింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. వాటి ఫలితాలను బట్టి అవసరమైతే చిన్న చిన్న మార్పులు చేసుకొని దసరా నుంచి ప్రజలకు ధరణి అందుబాటులోకి రానున్నది. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌లో ఏమేం ఉంటాయి? స్లాట్‌ ఎలా బుక్‌ చేసుకోవాలి? తాసిల్దార్‌ కార్యాలయంలో లావాదేవీలు ఎలా పూర్తవుతాయి? ఏయే పత్రాలు అవసరం అవుతాయి? వంటి పూర్తి వివరాలతో

 

*****

 

: పోర్టల్‌లో మూడు భాగాలు :

1. డాటా పోర్టల్‌

2. పిటిషనర్‌ పోర్టల్‌

3. డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌

———————————————————

1. డాటా పోర్టల్‌

ఇందులో రాష్ట్రంలోని అన్ని రకాల భూముల వివరాలు ఉంటాయి. వ్యవసాయ, వ్యవసాయేతర, అటవీ భూముల సమగ్ర సమాచారం ఇందులో లభిస్తుంది. ఈ పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తారని సమాచారం. తద్వారా ప్రపంచంలో ఏ మూలన ఉన్నా భూమి వివరాలను తెలసుకొనే అవకాశం కలుగనున్నది.

2. పిటిషనర్‌ పోర్టల్‌

భూ యజమాని లేదా అమ్మకందారు, కొనుగోలుదారులు, వారసులు భూ లావాదేవీకోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మొత్తం ఈ పోర్టల్‌లో ఉంటుంది. ఈ విభాగంలో స్లాట్‌ బుకింగ్‌ నుంచి చలాన్‌ చెల్లించేవరకు ఆప్షన్లు ఉంటాయి.

3. డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌

తాసిల్దార్లు, ధరణి ఆపరేటర్లు, ఇతర అధికారులకు మాత్రమే కనిపించే విభాగం ఇది. పిటిషన్‌దారు చలాన్‌ చెల్లించిన తర్వాత దరఖాస్తు తాసిల్దార్‌ కార్యాలయానికి చేరినప్పటి నుంచి హక్కు పత్రాలు కొనుగోలుదారు లేదా వారసుల చేతికి వచ్చే వరకు ప్రక్రియ అంతా డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌లో జరుగుతుంది.

 

స్లాట్‌ బుక్‌ చేసుకోండిలా …

———————————————————

ధరణి పోర్టల్‌ను ఓపెన్‌ చేయగానే అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ‘అగ్రికల్చర్‌’పై క్లిక్‌ చేయాలి.

 

తర్వాత వచ్చే పేజీలో ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మొదటి ఆప్షన్‌ ‘స్లాట్‌ బుకింగ్‌ ఫర్‌ సిటిజన్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

 

సిటిజన్‌ లాగిన్‌ పేజీలో మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే ఫోన్‌కు ఒక పాస్‌వర్డ్‌ వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత కింద గడుల్లో ఉన్న అంకెలు/అక్షరాలను (క్యాప్చా)ను ఎంటర్‌ చేయాలి. తర్వాత ‘గెట్‌ ఓటీపీ’ బటన్‌ క్లిక్‌ చేయాలి. వచ్చిన ఓటీపీని కింద ఇచ్చిన గడిలో నమోదు చేయాలి.

 

ఓటీపీని నమోదు చేయగానే ‘సిటిజన్‌ డ్యాష్‌బోర్డ్‌’ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇందులో ఏడు ఆప్షన్లు కనిపిస్తాయి. రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునేవారు మొదటి ఆప్షన్‌ ‘అప్లికేషన్‌ ఫర్‌ రిజిస్ట్రేషన్‌ (సేల్‌/గిఫ్ట్‌)’ను ఎంపిక చేసుకోవాలి. వెంటనే పక్కన వచ్చే యువర్‌ అప్లికేషన్‌లో ‘ప్రీ రిజిస్ట్రేషన్‌’ను ఎంచుకోవాలి.

 

ప్రీ రిజిస్ట్రేషన్‌లో ‘నేచర్‌ ఆఫ్‌ డీడ్‌, నేచర్‌ ఆఫ్‌ సబ్‌డీడ్‌’లలో మన లావాదేవీ ఏ రకమో (సేల్‌/గిఫ్ట్‌/పార్టిషన్‌) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. చివరగా పట్టాదార్‌ పాస్‌బుక్‌ (పీపీబీ) నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత ‘ఫెచ్‌’ బటన్‌ క్లిక్‌ చేయాలి.

పీపీబీ నంబర్‌పై ఉన్న ఆస్తి వివరాలు కనిపిస్తాయి. జిల్లా, మండలం, గ్రామం, ఖాతా నంబర్‌, యజమాని పేరు, తండ్రి పేరు వంటి వివరాలు వస్తాయి. ఆ తర్వాత సదరు సర్వే నంబర్‌లో ఉన్న సబ్‌ సర్వే నంబర్లు, వాటి కింద ఎంత విస్తీర్ణంలో భూములు ఉన్నాయో వివరాలు కనిపిస్తాయి. ఈ భూముల్లో ఎంతమేర బదలాయించాలనుకుంటున్నారో వివరాలు ఎంటర్‌ చేయాలి. ఒకేసారి ఒకటికి మించి సర్వే నంబర్లను ఎంపిక చేసుకోవచ్చు. చివరగా ‘ప్రొసీడ్‌’ను క్లిక్‌ చేయాలి.

 

తర్వాత వచ్చే ‘ఫోర్‌ బౌండరీ డీటెయిల్స్‌’లో అమ్మాల్సిన భూమికి నాలుగు దిక్కులా ఉన్న హద్దుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో విద్యాసంస్థ, అదర్స్‌, రైల్వే, రోడ్‌, సర్వే నంబర్‌, టెంపుల్‌ తదితర ఆప్షన్లు ఉంటాయి. ఒక్కో దిక్కు ఏ హద్దు ఉన్నదో వివరాలను చేర్చాలి.

 

సెల్లర్‌ డీటెయిల్స్‌ పేజీలో పట్టాదార్‌ పాస్‌బుక్‌ ఆధారంగా అప్పటికే నమోదైన యజమాని ఆధార్‌ నంబర్‌, పేరు(తెలుగులో), లింగం, కులం వంటి వివరాలు కనిపిస్తాయి. అనంతరం ఆధార్‌కార్డులో ఉన్న పేరు (ఇంగ్లిష్‌లో), రిలేషన్‌ టైప్‌, వయసు, వృత్తి, ఫారం 60/61ను సబ్‌మిట్‌ చేశారా? అని అడుగుతుంది. ఒకవేళ చేయకపోతే పాన్‌కార్డు నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత భూ యజమాని ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి పూర్తి చిరునామాను నమోదు చేయాలి. చివరగా సేవ్‌ అండ్‌ కంటిన్యూ బటన్‌ను క్లిక్‌ చేయాలి.

 

కొనుగోలు చేసే వ్యక్తి వివరాలను నింపాలి. ఇప్పటికే పట్టాదార్‌ పాస్‌బుక్‌ ఉంటే ఆ వివరాలు నమోదు చేయాలి. దీంతో ఆ వ్యక్తి పూర్తి వివరాలు ప్రత్యక్షం అవుతాయి. ఆ తర్వాత అన్ని వివరాలు నింపాలి. ఒకవేళ పట్టాదార్‌ పాస్‌బుక్‌ లేదని ఎంపిక చేసుకుంటే అక్కడ కనిపించే అన్ని రకాల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

 

పేమెంట్‌ అండ్‌ ట్రాన్సాక్షన్‌ సమ్మరీ పేజీలో ట్రాన్సాక్షన్‌ సమ్మరీ రిసిప్ట్‌ను క్లిక్‌ చేస్తే ఇప్పటి వరకు మనం నమోదు చేసిన అన్ని రకాల వివరాలు అందులో ప్రత్యక్షం అవుతాయి. భూ లావాదేవీకి సంబంధించి ఎంత చెల్లించాలో కూడా కనిపిస్తుంది. వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత ‘యెస్‌’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి ‘ప్రొసీడ్‌ టు పేమెంట్‌’ను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ తప్పుగా నమోదైతే వెనక్కి వెళ్లి మరోసారి వివరాలు నమోదు చేయాలి.

 

చలాన్‌ పేజీలో డబ్బు ఎవరు కడుతున్నారు? సెల్లర్‌, బయ్యర్‌, ఇతరులు ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. వెంటనే అప్పటికే మనం ఎంటర్‌ చేసిన సెల్లర్‌/బయ్యర్‌ వివరాలు కనిపిస్తాయి. ఎంత మొత్తం చెల్లించాలో అందులో వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకసారి సరిచూసుకొని జనరేట్‌ చలాన్‌ ఆప్షన్‌ ఎంపిక చేయాలి.

 

పేమెంట్‌ డీటెయిల్స్‌లో.. వివరాలన్నీ సరిచూసుకొని ‘ప్రొసీడ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అప్పుడు పేమెంట్‌ ‘గేట్‌ వే’ తెరుచుకుంటుంది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో లేదా చలాన్‌ ప్రింట్‌ తీసుకొని వెళ్లి ఎస్‌బీఐ బ్యాంకులో నేరుగా కట్టుకోవచ్చు.

పేమెంట్‌ అయిపోయిన తర్వాత మళ్లీ ‘ప్రీ రిజిస్ట్రేషన్‌’ పేజీకి వెళ్లి అక్కడ ‘విట్‌నెస్‌ డీటెయిల్స్‌’ (సాక్షుల వివరాలు) నమోదు చేయాలి. సాక్షి పేరు, ఆధార్‌ నంబర్‌, ఫోన్‌ నంబర్‌, అడ్రస్‌ ఎంటర్‌ చేయాలి. కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలి.

 

ఆ తర్వాత డాక్యుమెంట్‌ డీటెయిల్స్‌లో అఫిడవిట్‌-1, అఫిడవిట్‌-2, ఫారం 60/61ను అప్‌లోడ్‌ చేయాలి. కావాలంటే నమూనా డాక్యుమెంట్లు పక్కనే ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని, నింపి, అప్‌లోడ్‌ చేయవచ్చు. తర్వాత కనిపించే ‘జనరేట్‌ డాక్యుమెంట్‌, కన్ఫర్మ్‌ డాక్యుమెంట్‌, ప్రొసీడ్‌ ఫర్‌ స్లాట్‌ బుకింగ్‌’ ఆప్షన్లను వరుసగా ఎంపిక చేసుకోవాలి. ఈ సందర్భంగా కనిపించే వివరాలన్నింటినీ సరిచూసుకోవాలి.

 

చివరగా స్లాట్‌ బుకింగ్‌ ఆప్షన్‌కు వెళ్తుంది. ఇక్కడ అప్లికేషన్‌ టైప్‌, టీఎక్స్‌ఎన్‌ నంబర్‌, తాసిల్దార్‌ ఆఫీస్‌ వంటి వివరాలన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. పక్కన ఉన్న క్యాలెండర్‌లో ఏ తేదీన, ఏ సమయానికి స్లాట్‌ ఖాళీగా ఉన్నదో కనిపిస్తుంది. మనకు అనువైన సమయం ఎంపిక చేసుకొని ‘బుక్‌ స్లాట్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. వెంటనే స్లాట్‌ బుక్‌ అవుతుంది. కింద కనిపించే ‘ప్రింట్‌ రిసిప్ట్‌’ను క్లిక్‌ చేసి ప్రింటవుట్‌ తీసుకోవచ్చు.

 

ఏ డాక్యుమెంట్లు ఇస్తారు ?

———————————————————

అమ్మకందారుకు..

l అప్‌డేట్‌ అయిన పాస్‌ బుక్‌ (అమ్మిన భూమిని డిలీట్‌ చేసి) ఇస్తారు.

l మ్యుటేషన్‌ ఆర్డర్‌

l లావాదేవీ సారాంశం రిజిస్ట్రేషన్‌ అండ్‌ మ్యుటేషన్‌ డాక్యుమెంట్‌

 

కొనుగోలుదారుకు

———————————————————

l అప్‌డేట్‌ అయిన పాస్‌బుక్‌ (కొనుగోలు చేసిన భూమిని కలిపి) ఇస్తారు.

l కొన్నవ్యక్తికి ఆ గ్రామంలో పాస్‌బుక్‌ లేకపోతే కొత్త పాస్‌బుక్‌ ప్రింట్‌ చేసి ఇస్తారు. దీనిని కొరియర్‌ ద్వారా కొనుగోలుదారుకు పంపిస్తారు.

l రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌

l ఈ-పీపీబీ

l లావాదేవీ సారాంశం- రిజిస్ట్రేషన్‌ అండ్‌ మ్యుటేషన్‌ డాక్యుమెంట్‌ పాస్‌బుక్‌లో ఏముంటాయి?

 

అమ్మకందారు..

———————————————————

లావాదేవీకి ముందు

l ఏ సర్వేనంబరు భూమి.. అది ఎన్ని ఎకరాలు ఉంది

లావాదేవీ తరువాత

l ఏ సర్వే నంబరు భూమి.. అది ఎన్ని ఎకరాలు ఉంది

l ఏ తేదీన విక్రయించారు

l ఇతర వివరాలు

 

కొనుగోలుదారు..

———————————————————

లావాదేవీకి ముందు

l పాస్‌ బుక్‌లో గతంలో ఉన్న భూమి సర్వే నంబరు, ఎన్ని ఎకరాలు ఉంది.

లావాదేవీ తరువాత

l పాస్‌ బుక్‌లో గతంలో ఉన్న భూమి సర్వే నంబరు, ఎకరాలు

l ఇప్పుడు కొనుగోలు చేసిన భూమి సర్వే నంబరు, ఎకరాలు

l ఏ తేదీన కొనుగోలు చేశారు.

 

భూముల వివరాలన్నీ ఒకేచోట

———————————————————

హోం పేజీలో అగ్రికల్చర్‌ ఆప్షన్‌ను ఎంచుకున్నాక మొత్తం ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో మొదటి ఆప్షన్‌ స్లాట్‌ బుకింగ్‌ కాగా, మిగతావి రాష్ట్రంలోని భూముల వివరాలు తెలియజేస్తాయి.

స్టేట్‌ ల్యాండ్స్‌ డీటెయిల్స్‌ రాష్ట్రంలోని మొత్తం భూముల విస్తీర్ణం వివరాలు ఉంటాయి. ఏయే రకం భూములు ఎంతమేర ఉన్నాయో కనిపిస్తుంది.

 

ల్యాండ్‌ డీటెయిల్స్‌ సెర్చ్‌

———————————————————

పౌరులు రాష్ట్రంలోని ఏ భూమి వివరాలైనా ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది. జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్‌ ఆధారంగా ఆ భూమి ఎవరి పేరుపై ఉందో తెలుసుకోవచ్చు.

 

ప్రొహిబిటెడ్‌ ల్యాండ్స్‌

———————————————————

రిజిస్ట్రేషన్లు నిషేధించిన భూములు అంటే.. దేవాదాయ, వక్ఫ్‌, అసైన్డ్‌, అటవీశాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భూముల వివరాలు ఇందులో ఉంటాయి.

ఎన్‌కంబరెన్స్‌ డీటెయిల్స్‌ ఆస్తులకు సంబంధించిన ఈసీ వివరాలు (భూమి లావా దేవీల చరిత్ర) ఉంటాయి.

 

మార్కెట్‌ వ్యాల్యూ

———————————————————

సర్వే నంబర్ల వారీగా నిర్దేశించిన మార్కెట్‌ వ్యాల్యూ, స్టాంప్‌డ్యూ టీ వివరాలు కనిపిస్తాయి.

 

స్లాట్‌ బుక్‌ కాగానే.. భూ యజమాని లేదా అమ్మకందారు ఫోన్‌నంబర్‌కు, కొనుగోలుదారు ఫోన్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో సమాచారం వెళ్తుంది. ఏ సమయంలో ఎక్కడికి రావాలో స్పష్టంగా ఉంటుంది. కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్‌ చేస్తే ఏయే డాక్యుమెంట్లు అవసరం అవుతాయో సమాచారం వస్తుంది. నిర్దేశిత తేదీన, ఆయా డాక్యుమెంట్లు, కొనుగోలుదారు, అమ్మకందారు, సాక్షులు కలిసి తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్తే వెంటనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతుంది. హక్కు పత్రాలు చేతికి వస్తాయి. అమ్మకందారు ఖాతా నుంచి ఆ మేరకు విస్తీర్ణం తగ్గిపోయి, కొనుగోలుదారు పేరుమీదికి బదిలీ అవుతుంది. బయ్యర్‌కు అప్పటికే పట్టాదార్‌ పాస్‌బుక్‌ ఉంటే తాజా కొనుగోలు భూమి వివరాలు అందులో నమోదవుతాయి. లేకుంటే కొత్త పాస్‌బుక్‌ వస్తుంది.

 

స్లాట్‌ బుక్‌ అయ్యాక ప్రక్రియ ఇలా..

———————————————————

స్లాట్‌ బుక్‌ చేసుకున్నాక ఆ దరఖాస్తు ధరణి డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌కు వెళ్తుంది. ఇక్కడ తాసిల్దార్‌ కమ్‌ జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌, డీఈవో (ధరణి ఆపరేటర్‌) వివిధ దశల్లో ప్రక్రియను పూర్తి చేస్తారు.

 

రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ ఇచ్చిన సమయానికి తొలుత ధరణి ఆపరేటర్‌ (డీఈవో) దగ్గరకు వెళ్లాలి. ఇక్కడ విట్‌నెస్‌ డీటెయిల్స్‌ (సాక్షి వివరాలు) నమోదు చేయడంతో పాటు విక్రయదారు, కొనుగోలుదారుల, సాక్షుల బయోమెట్రిక్‌ (వేలిముద్రలు), ఫొటోలు తీసుకుంటారు. దరఖాస్తు రిజిస్ట్రేషన్‌/సక్సెషన్‌/పార్టిషన్‌ దేనికి ఉద్దేశించినదో పోర్టల్‌లో ఆప్షన్‌ను ఎంపిక చేసి అందులో విట్‌నెస్‌ వివరాలు నమోదు చేస్తారు. అనంతరం విక్రయదారు, కొనుగోలుదారుల బయోమెట్రిక్‌, ఫొటోను తీసుకుంటారు. ఫొటోలను అక్కడే వెబ్‌క్యామ్‌ ద్వారా తీసుకుంటారు.

 

అనంతరం తాసిల్దార్‌ దగ్గరకు వెళ్లాలి. ఇక్కడ బయోమెట్రిక్‌, ప్రాపర్టీ, స్టాంపుడ్యూటీ వివరాలను తనిఖీ చేసి, ఓ డాక్యుమెంట్‌ నెంబరు కేటాయించి రిజిస్ట్రేషన్‌ను అప్రూవ్‌ చేస్తారు. అనంతరం మ్యుటేషన్‌ అండ్‌ సైనింగ్‌ ఆఫ్‌ రికార్డు ప్రక్రియను పూర్తి చేస్తారు.

 

కొనుగోలుదారు, విక్రయదారు అక్కడి నుంచి తిరిగి డీఈవో దగ్గరకు వెళ్లాలి. ఇక్కడే కొనుగోలుదారు, విక్రయదారు ఇద్దరికి పాస్‌బుక్‌లు ప్రింట్‌ చేసి ఇవ్వడంతో పాటు రిజిస్ట్రార్‌ డాక్యుమెంట్‌ను ఇస్తారు.

 

సక్సెషన్‌ ప్రక్రియ ఇలా..

———————————————————

సక్సెషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకునే సమయంలో సిటిజన్‌ డ్యాష్‌బోర్డులో ‘అప్లికేషన్‌ ఫర్‌ సక్సెషన్‌’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకొని కుటుంబసభ్యుల అందరి వివరాలు నమోదు చేయాలి. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి ఉమ్మడిగా రాసుకున్న షేర్‌ డాక్యుమెంట్‌ (ఒప్పంద పత్రం)ను అప్‌లోడ్‌ చేయాలి. మిగతా స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలి.

 

స్లాట్‌ ఇచ్చిన సమయానికి కుటంబసభ్యులందరూ కలిసి కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ధరణి ఆపరేటర్‌ సంబంధిత వివరాలను తనిఖీ చేసి తాసిల్దార్‌ దగ్గరకు పంపిస్తారు.

 

తాసిల్దార్‌ కుటుంబసభ్యుల బయోమెట్రిక్‌ (వేలిముద్రలు), ఫొటోలు తనిఖీ చేస్తారు.

 

ఒప్పందం ఆధారంగా కొత్త ఖాతాలు లేదా సర్వే నంబర్లను సృష్టిస్తారు. చివరగా మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి తాసిల్దార్‌ ఆ పత్రాలను డీఈవోకు పంపిస్తారు. అక్కడ మిగిలిన ప్రక్రియ పూర్తి చేసి హక్కు పత్రాలను చేతికి ఇస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*