హైదరాబాద్ వరదబాధితులకు పవన్ కోటి రూపాయల సాయం

హైదరాబాద్: వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాత్రి వీడియో సందేశం విడుదల చేశారు.

ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ

“కరోనా మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ వర్షాలు, వరదలు తోడయ్యాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల మూలంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఇబ్బందులు పాలవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా లేనంత వర్షపాతం దేశం మొత్తం చూసింది. తెలంగాణలో దీని తాకిడి మరింత ఎక్కువగా ఉంది. చాలామంది జీవన విధానం చిన్నాభిన్నం అయింది. హైదరాబాదులో ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేసి ఆస్తి నష్టం జరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సరిగా లేకపోవడం ఒక కారణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులను అర్థం చేసుకుని, ప్రజలు పడుతున్న కష్టాలు చూసి… ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి నా వంతుగా కోటి రూపాయలు ప్రకటిస్తున్నాను. జనసైనికులు, అభిమానులు, నాయకులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కలిసికట్టుగా ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన సమయం ఇది” అన్నారు.

 

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, మహేశ్ బాబు కోటి రూపాయలు, జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షల రూపాయలు, విజయ్ దేవరకొండ పది లక్షల రూపాయల విరాళం ఇప్పటికే ప్రకటించారు.

 

అటు తమిళనాడు ప్రభుత్వం 10 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం 15 కోట్లు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*