సంతోషంగా వుండండి… ఉండనివ్వండి: RJ మురళీ 

అతడి స్వరం ఓ ఉషోదయం

అతడి మాటలు తేనేపలుకులు

రేడియో అతడి హృదయ స్పందన

శ్రోతల మనసుల్లో చెదరని ముద్ర వేసిన అతడే మురళీ మోహన్. ప్రేమగా అందరూ పిలిచే RJ మురళీ. ఇవాళ ఈక్షణం కోసం మురళీ గారి స్పెషల్ ఇంటర్వ్యూ.

 

నమస్తే మురళీమోహన్ గారు 

నమస్తే !

మీతో మాట్లాడడం ఎంతో హ్యాపీగా ఉంది.

రేడియోలో చాలా ఏళ్లుగా రేడియో జాకీగా చేస్తున్నారు, అసలు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? 

మా ఇంట్లో నాన్నకు, అక్కకు సాహిత్యం మీద మంచి అవగాహన ఉంది. వాళ్ళిద్దరూ పాటలు కూడా బాగా పాడుతారు. అక్క కథలు, కవితలు రాస్తుండేది. మా అందరితో పాటు మా ఇంట్లో మరొకరు ఉండేవారు… అదే ‘రేడియో’. మా అందరి జీవితంలో ఒక భాగం. అమ్మ ఎప్పుడూ రేడియోని ఆన్ చేసి పని చేసుకుంటూ ఉండేది. శనివారం – బాలానందం, ఆదివారం – బాలవినోదం, నాటకాలు, నాటికలు, పాటలు ఇలా ఒకటేమిటి ప్రతి ఒక్కటి వినే వాళ్ళం. అందుకేనేమో నేను రేడియోకి చాలా దగ్గరయ్యాను. రేడియోలో వివిధ భారతి, హైదరాబాద్ – ఎ వింటూ ఉండేవాడిని. అందులో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్స్ లో కాలర్ గా పార్టిసిపేట్ చేస్తుండేవాడిని, నాకు సీనియర్ అనౌన్సర్ ఇలియాస్ గారు, జ్యోత్స్న గారు అంటే ప్రాణం. రేడియో స్టేషన్ కి వాళ్లను కలవడానికి వెళ్తుండే వాడిని. పెద్దవాళ్లు అయినా చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. ఆ తర్వాత వాళ్ళు నిర్వహించిన JAPA-4 (అంటే జోత్స్న, అహ్మద్ ఇల్యాస్, పద్మ, అరుణ్) కార్యక్రమంలో నా చేత ప్రతి శనివారం మాట కచేరి అనే కాన్సెప్ట్ చేయించేవారు. అలా రేడియోలో నా వాయిస్ ని వినిపించే అవకాశం ఇచ్చిన జ్యోత్స్న ఇల్యాస్ గారు నాకు గురువులు. ఇల్యాస్ సర్, వాళ్ల అమ్మాయి స్వప్న గారు, నేను రికార్డింగ్ కోసం తరంగిణి స్టూడియోకి వెళ్ళేవాళ్లం. అదే ప్రోత్సాహంతో ఆల్ ఇండియా రేడియో లో హైదరాబాద్-ఏ లో క్యాజువల్ అనౌన్సర్ గా చేరాను. 2005 డిసెంబర్ 25న ఆలిండియా రేడియో హైదరాబాద్ కేంద్రం వారు రెయిన్బో ఎఫ్ ఎమ్ 101.9 మెగాహెడ్జ్ మీద ప్రారంభించారు. ఆ రోజు నుండి ఇప్పటిదాకా అదే ఛానల్ లో రేడియో జాకీగా పని చేస్తూనే ఉన్నాను.

 

మీ ఫ్యామిలీ, చదువు, ఊరు? 

మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వడం వల్ల ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. నాన్న తో పాటే మొత్తం ఫ్యామిలీ అంత షిఫ్ట్ అవుతుండే వాళ్ళం. చిన్నతనం అంతా పెద్దపల్లి (అప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఉండేది) గడిచింది. మాది పెద్ద ఫ్యామిలీ. అమ్మ నాన్నకి మేము ఐదుగురు పిల్లలం. అక్క , ఇద్దరు అన్నయ్యలు,ఒక తమ్ముడు. నేను ఉస్మానియా యూనివర్సిటీ లో ఎంఎస్సీ మ్యాథ్స్ చేశాను. సెంట్రల్ యూనివర్సిటీలో టెలి కమ్యూనికేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాను. ఇప్పుడైతే అందరం హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యాం. నా బెటర్ హాఫ్ సరిత, ఆమె హై స్కూల్ టీచర్. మాకు ఇద్దరు అబ్బాయిలు.

రేడియోకన్నా ముందు ఏమి చేసేవారు? 

రేడియోలోకి రాకముందు, నేను కాలేజెస్ లో ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ చెప్పడంతోపాటు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వారు కండక్ట్ చేసే , కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్స్ రాసే విద్యార్థులకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చెప్పేవాణ్ని. ఎన్.ఎస్ బి., విస్సు ఇంటర్నేషనల్, బ్రైన్ ట్రీ లాంటి మంచి ఇనిస్టిట్యూట్లో ఫ్యాకల్టీగా పనిచేసేవాణ్ణి. అదే ఎక్స్పీరియన్స్ తో …మ్యాథ్స్ అండ్ రీజనింగ్ బుక్స్ కూడా రాశాను. సాక్షి న్యూస్ పేపర్ కి, అప్పట్లో గురువారం వచ్చే స్పెషల్ ‘భవిత’లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ఆర్టికల్స్ రాసేవాణ్ణి.

 

టైం ఎలా మేనేజ్ చేస్తారు? 

టైం మేనేజ్మెంట్ మీద రేడియోలో షోస్ చేశాను. క్లాసుల్లో స్టూడెంట్స్ కి మోటివేషనల్ లెక్చర్స్ ఇచ్చాను. కానీ, నేను టైంని ఎలా మేనేజ్ చేస్తాను అన్నది ఎప్పుడూ ఆలోచించలేదు. చేసే పని మీద ఇష్టం ఉంటే చాలు. మైండ్.. దానంతట అదే అలారం సెట్ చేస్తుంది . దాన్ని బట్టి ఏ టైం కి ఏం చేయాలో ఆ పని చేసేస్తాం. నేను చేసే అన్ని జాబ్స్ నాకు ఇష్టమైనవే అందుకే, టైమ్ దానంతటదే సెట్ అవుతుంది.

 

టీవీ ఎక్స్పీరియన్స్ గురించి? 

టీవీలో అంటే ‘తెలుగు వన్’ ఛానల్ లో న్యూస్ రీడర్ గా కొన్ని నెలలు మాత్రమే పని చేశాను. అప్పట్లో రేడియో షోస్, పిల్లలకి చదువు చెప్పడం, సెమినార్లకి అటెండ్ అవటంలో బిజీగా ఉండేవాడిని. అందుకే టీవీలో కంటిన్యూ కాలేకపోయాను. డబ్బింగ్ అవకాశాలు వచ్చినా సమయం చాలక వెళ్ళలేకపోయేవాడిని.

 

మీరు ఎక్కువగా రేడియోలో మార్నింగ్ షోస్ చేస్తారు కదా?  

అవును. మార్నింగ్ రిఫ్రెష్ గా ఉంటుంది. అందుకే ఎక్కువగా ప్రిఫెర్ చేస్తాను. ప్రస్తుతం నేను రెయిన్బో ఎఫ్.ఎం 101.9 లో మార్నింగ్ షో వందనం (6 – 10am) చేస్తున్నాను. ఆ నాలుగు గంటల్లో గంట సేపు భక్తి /ఆధ్యాత్మిక విషయాలతో పాటు భక్తి పాటలు వినిపిస్తాను. తరువాత గంట థీమ్ బేస్డ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ఉంటుంది. మిగిలిన రెండు గంటలు ఇన్ఫోటైన్మెంట్ అండ్ లవ్లీ మ్యూజిక్. నాకైతే ఆ నాలుగు గంటలు నాలుగు క్షణాల్లా గడిచిపోయినట్టుగా అనిపిస్తాయి.

 

మీకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన టాపిక్? 

ముఖ్యంగా బర్నింగ్ ఇష్యూస్ బేస్డ్ టాపిక్స్ కి శ్రోతలు ఎక్కువగా స్పందిస్తారు. అది కూడా ఆ సబ్జెక్టు మీద అవగాహన ఉన్న అనుభవజ్ఞులు స్పందించి, ఇచ్చే ఎనాలసిస్, సలహాలు, సూచనలు చాలా ఆప్ట్ గా అనిపిస్తాయి. అలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన టాపిక్ “డిమానిటైజేషన్” బ్యాoకింగ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు మాట్లాడారు. అది నేను మర్చిపోలేనిది. అంతేకాకుండా…. క్రియేటివ్ థాట్స్ అండ్ ఐడియాస్ మీద థీమ్ ఇస్తే కూడా అన్ని రంగాలకు చెందినవారు ఎక్కువగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. దానివల్ల నాకు కూడా నేర్చుకునేందుకు ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది. అందుకే టాపిక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా సెలెక్టివ్ గా ఉంటాను.

 

శ్రోతలతో మాట్లాడ్డం ఎలా అనిపిస్తుంది?

పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నేను శ్రోతగా ఉండటానికి చాలా ఇష్టపడతాను. ఎందుకంటే.. మనం చెప్పే మాటల్లో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. కానీ, పబ్లిక్ దగ్గర అదే అంశం మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా విని, పరిశీలించి చివరిగా వాటిమీద ఫైనల్ ఒపీనియన్ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. నా ఒపీనియన్ అప్పటి దాక మాట్లాడుకున్న అంశానికి సరిపోయేట్టుగా, అందరినీ సంతృప్తి పరిచేదిగా ఉండాలి. అందుకే …పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, వాళ్లను పూర్తిగా వింటాను.

 

 

రేడియో జాకీ అనగానే ఫ్యాన్స్ ఉంటారు, ఇక మీకు చాలా ఫాలోయింగ్ ఉందని తెలుసు. దాని గురించి. 

ఫ్యాన్స్ అనేది చాలా పెద్ద మాట లాగా అనిపిస్తుంది. నేను చెప్పే మాటలు విని, నా వాయిస్ మాడ్యులేషన్ బట్టి నన్ను ఊహించుకొని, నేను మాట్లాడే విధానాన్ని బట్టి నన్ను అభిమానించే శ్రోతలు ఉన్నందుకు, నేను చాలా అదృష్టవంతుడిని. ఒక వారం వినిపించకపోతే నా బాగోగుల గురించి అడిగి తెలుసుకునే వారు ఖచ్చితంగా నా వాళ్లే అయి ఉంటారు. మీ వ్యాఖ్యానం అంటే ఇష్టం, మీ నవ్వు బాగుంటుంది, మీరు చెప్పే విషయాలు చాలా కరెక్ట్ గా నా గురించే చెబుతున్నట్టుగా ఉంటాయి, మీ మాటలు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంటాయి, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాము, మీ సాంగ్స్ సెలక్షన్ సూపర్….ఇలాంటి అప్రిసియేషన్ ని డైజెస్ట్ చేసుకోవడానికి నాకు అర్హత ఉందా అనిపిస్తుంది. నాకన్నా వేల రెట్లు అర్హతలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు…. కానీ ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో గాని, ఎందరో మహానుభావులు పని చేసిన, చేస్తున్న ఆల్ ఇండియా రేడియో లాంటి దేవాలయంలో పని చేసే అవకాశం దొరికింది….థాంక్స్ టు గాడ్.

https://www.instagram.com/tv/CGU_lvqCb06/?igshid=cf3me0gvx9qi

మీరు అటెండ్ చేసిన ఒక ఇంటర్వ్యూలో ఏదో గమ్మత్తు జరిగిందట? 

ఎస్. ఒకసారి ఒక పేరున్న ఇనిస్టిట్యూట్లో సి.ఎ.టి ట్రైనర్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాను. అక్కడ ఒక టెస్ట్ కండక్ట్ చేసారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. నేను ఇంటర్వ్యూ కోసం లోపలికి వెళ్ళాను. ఎదురుగా ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఉన్నారు. ఆ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు నన్ను చూస్తూ పలకరింపుగా రండి మురళిగారు అని ఆహ్వానించారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న నా రెస్యూమే లో నా డీటెయిల్స్ లో నేను ఆర్.జె అని కూడా ఉంది, అందుకే అలా ఆహ్వానించారు అనుకున్నాను. కానీ, సీన్ ఏంటంటే…. ఆయన రెయిన్బో ఎఫ్ఎం లో నేను చేసే ప్రతి షో మిస్ కాకుండా వింటారట, నేనంటే చాలా అభిమానమట. ఇంకేముంది, వెళ్లిన పనికి సంబంధించిన ప్రశ్నలకు బదులు, “ఆర్జే మురళి గారంటే మీరా” అని ప్రారంభించారు. సర్, సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రశ్నలు అడగండి అంటే.. మా కంపెనీ ప్రొడక్ట్ మీద ఒక జింగిల్ రాసి, వాయిస్ ఇవ్వండి అన్నారు. స్పాంటేనియస్ గా చెప్పేసరికి, మెచ్చుకున్నారు. ఆ తర్వాత నా మెరిట్, టెస్ట్ అండ్ గ్రూప్ డిస్కషన్ బేస్ మీద నన్ను సెలెక్ట్ చేసారు. అది ఒక అందమైన అనుభవం.

 

మిమ్మల్ని కలవడానికి అభిమానులు రేడియో స్టేషన్ కి వస్తుంటారట? 

ఒకసారి నేను షో చేసి బయటికి వచ్చాక, రేడియో స్టేషన్ మెయిన్ గేట్ దగ్గర ఒకతను నన్ను ఆర్ జె మురళి గారు బయటకు ఎప్పుడు వస్తారు అని అడిగారు, నేనే అని చెప్పగానే అభిమాన పూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. తన పేరు ఘన శ్యామ్. అతనిది బీహార్, కానీ తెలుగు వచ్చు. రేడియో వింటూ వుంటాడట. మార్బుల్ షాప్ లో పని చేస్తాడట. నా కోసం తను స్వయంగా చేసిన పాల రాతి మందిరం బహుమతిగా ఇచ్చాడు. అతని ప్రేమకు నేను ఫిదా అయ్యాను. అతను ఎప్పుడూ నా మనసులో, ఆ మందిరం మా ఇంట్లో దేవుడి గదిలో భద్రంగా ఉండిపోయాయి.

 

రైల్వేస్టేషన్లో ఏదో జరిగిందని తెల్సింది? ఏమిటది?

ఒకసారి ముంబై వెళ్లేటప్పుడు, రైల్వే స్టేషన్లో కూర్చొని ఫోన్ లో ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. నా ఎదురుగా కూర్చున్న ఒకతను నన్నే వింటూ “మీరు రెయిన్బో ఆర్జె మురళి కదా” అన్నాడు. చాలా ఆనందంగా అనిపించింది, ఎలా గుర్తుపట్టారు అని అడిగితే … “మీరు చెప్పే విషయాలు అందరికీ కనెక్ట్ అవుతాయి కాకపోతే మీరు చెప్తే వినాలని అనిపించడమే కాదు ఫాలో అవ్వాలని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ కి చెప్తుంటే ఈ వాయిస్ ఆర్ జె మురళి స్టైల్ తో సింక్ అయింది” అన్నాడు. అది ఎంత పెద్ద కాంప్లిమెంటో నాకు. ఇంకా ఆ విషయం చుట్టుపక్కల ఉన్న మరో నలుగురు వినేటట్టు గా అన్నాడు అది ఇంకా ఆనందంగా అనిపించింది. అతని పేరు సతీష్, గవర్నమెంట్ హై స్కూల్లో సైన్స్ టీచర్. ఇవన్నీ నిజంగా మంచి అనుభవాలు .. తీపి జ్ఞాపకాలు.

రేడియోలో ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి వుంటారు. అందులో మీకు బాగా నచ్చింది 

ఈ 15 సంవత్సరాల అనుభవంలో ఎన్నో రంగాల్లో ఎందరో అనుభవజ్ఞుల్ని, మహానుభావుల్ని ఇంటర్వ్యూ చేశాను. అందులో ఒక్కొక్కరితో ఒక అనుభవం. పెద్ద పెద్ద వాళ్లతో గౌరవపూర్వకంగా మాట్లాడుతూ, వాళ్ళ నుండి చాలా విషయాన్ని రాబట్టాలనేదే ప్రయత్నం. అయితే, నాకు చాలా కనెక్ట్ అయిన ఇంటర్వ్యూ, బాగా గుర్తుండిపోయినదీ, సింగర్ హేమచంద్రతో, ఇంకొకటి సివిల్ సర్వీసెస్ ర్యాంకర్ ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న విశ్వజిత్ తో….. ఈ రెండూ చాలా ఫ్రెండ్లీ టచ్ తో సాగి పోయాయి.. కేటాయించిన సమయం కన్నా మరో అరగంట పొడిగించమని ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసి చెప్పారు. అంటే ఆ ఇంటర్వ్యూలు అంత ఇంటరెస్టింగ్గా సాగాయి అన్నమాట.

 

రేడియో అంటే ఒక్క మాటలో 

నా హృదయ స్పందన

మీ స్ఫూర్తిప్రదాత

డాక్టర్ అబ్దుల్ కలాం సర్ నా ఇన్స్పిరేషన్. ఆయన స్పీచ్, లైఫ్ స్టోరీ, down to earth nature, కలాం గారి నవ్వు, ఇలా చాలానే. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా పిచ్చి. ఎప్పుడైనా చిరాగ్గా ఉంటే చాలు కలాం సార్ చెప్పిన మాటలు, కలాం సార్ గురించి చదువుతూ ఉంటాను. అప్పుడు మళ్ళీ సెట్ అవుతాను.

 

మీరు చాలామందికి రోల్ మోడల్. మరి మీలో మీరు మార్చుకోవాలి అనుకుంటున్నది ఏది? 

నాలో మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా…. బద్ధకం, అంటే ఏ విషయాల్లో బద్దకంగా ఉండకూడదో అక్కడ బద్ధకంగా ఉంటాను. ఇంకొకటి.. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అంతే కాకుండా… నా అభిరుచులను ఈమధ్య నెగ్లెట్ చేస్తున్నాను, వాటిమీద ఇంతకు ముందుండే ఇంట్రెస్ట్ ను మళ్లీ సమకూర్చుకోవాలి.

 

మీలో మీకు నచ్చేది? 

నాలో నాకు నచ్చేది ఏంటంటే …. చాలామంది నాతో చాలా సీక్రెట్స్ షేర్ చేసుకుంటారు. ఆ సీక్రెట్ ని నేను ఎప్పుడూ వేరే వారికీ చెప్పను. అంటే నన్ను నమ్మిన వారి నమ్మకాన్ని వమ్ము చేయను. ఎవరైనా ఏ విషయంలోనైనా సలహా అడిగితే, చాలా ఆలోచించి ఉపయోగపడే సలహా ఇస్తాను.

 

ఫ్యూచర్ ప్లాన్స్? 

టీచింగ్ లైన్ లో చాలా ముందుకు వెళ్లాలి. మంచి విద్యను అందించాలి. అది విద్యార్థుల లైఫ్ సెటిల్ మెంట్ కోసం ఉపయోగపడాలి.

 

రేడియో జాకీలలో మీరు చాలా సీనియర్. కొత్తగా ఈ ఫీల్డ్ లోకి రావాలి అనుకుంటున్న వారికి మీరు ఇచ్చే సలహా?  

విషయ పరిజ్ఞానం, భాష మీద పట్టు, భావం పలికించగలిగే స్వరం ఉండాలి. ఇష్టంతో చేయగలగాలి. అన్నిటికన్నా ముందు మంచి శ్రోత అయ్యుండాలి.

 

చివరగా మీరు చెప్పాలని అనుకుంటున్నది? 

ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండనివ్వాలి. సంతోషం అనేది, మనల్ని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండనిస్తుంది. సమస్య ఎంతదైనా ఎదుర్కొని పరిష్కరించగలిగే శక్తినిస్తుంది. బీ హ్యాపీ, స్టే ఫిట్ అండ్ స్టే సేఫ్.

థాంక్ యూ మురళి గారు.

– Manjeetha, Eekshanam Journalist, Bangalore. 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*