
‘‘మనసా – ఇది తెలుసా’’
హైదరాబాద్: మనిషి యొక్క ఎదుగుదల రెండు విధాలు. ఒకటి శారీరక ఎదుగుదల, రెండు మానసిక ఎదుగుదల. శారీరక ఎదుగుదల ఒక నిర్ణీత వయస్సు వరకే ఉంటుంది. ఆడవారికి, మగవారికి దాదాపు 20 సంవత్సరాలలోపు ఈ ఎదుగుదల పూర్తి అవుతుంది. మానసిక ఎదుగుదల నిరంతరం మానసికంగా పరిపూర్ణత్వం సంపాదించాలంటే చాలా ప్రక్రియలను చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా నిరంతర అభ్యసనం, పఠనం, శ్రవణం, మానసం, బోధన, విషయ సేకరణ నిక్షిప్తపరచటం, ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా ఆలోచించడం, ఆలోచన వైవిధ్యాలను గుర్తించి వాటిని సక్రమ మార్గంలో పెట్టుకోవాలి. అందుకు గాను మనకు ఒక గురువు కావాలి. అంటే వీరు ఖచ్చితంగా ఉపాధ్యాయులే కావాల్సిన అవసరం లేదు. మనకు, మన ప్రశ్నలకు సమాధానం చెప్పే వారై ఉండాలి. మానసికంగా మనం ఎదగడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మన పరిసరాలలో ఉండే నమ్మకమైన విజ్ఞులు వీరందరూ ఉండాలి. తోటివారి సాంగత్యం కూడా మనపై ప్రభావం చూపుతాయి.
మన వికాసానికి మనం బధ్ధులమై ఉండాలి. అందుకు ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్య సాధనా విధానాలను తెలుసుకొని నియమబద్ధమైన పరిశ్రమ చేయాలి. మానసిక వికాసం ఆ వ్యక్తి యొక్క వికాసానికి దోహదం చేస్తుంది. ‘‘మనసా – ఇది తెలుసా’’ వికాసం మొదలైనప్పటి నుంచి నీలో ఆనందం చోటు చేసుకుంటుంది. దానితో పాటు నీలోని తేజస్సు ఒక గుర్తింపును తెస్తుంది.
ఎదుగుదల దశలలో ‘యవ్వనం’ చాలా మార్పులను సంతరించుకొంటుంది. భౌతిక మార్పులు వయస్సుకు తగ్గట్టుగా ఎత్తు శరీర నిర్మాణం ఉంటుంది. అలాగే కనబడని శారీరక మార్పులు కలుగుతాయి. అయితే ఈ మార్పుల పట్ల పిల్లలలో ఆందోళన పెరుగుతుంది. అందువల్ల కొన్ని భయాలు ఏర్పడుతాయి. అందుకని ఈ దశకు చేరకముందు ఈ దశలో జరిగే మార్పులకు అనుగుణంగా ఉండే విధానాన్ని తెలియజెప్పాలి. సామాన్యంగా యుక్త వయసులో ఉండే పిల్లలకు సందేహాలు ఎక్కువగా వస్తాయి. వాళ్లు సంచరించే జట్టులో ఉండే వారి పట్ల పరిశీలన అందరిలో గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తారు. ఈ దశలో వారి వ్యక్తిత్వం వికసించటం మొదలవుతుంది. శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల కూడా ఉంటుంది. అందువల్ల వారిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరిసరాల ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, వ్యవహరించాలి. అంటే.. మన అలవాట్లు, భాష, వ్యవహారం, మనం వ్యక్తులతో ప్రవర్తించే విధానం అన్ని గమనించి గ్రహిస్తారు. ఇంట్లో గొడవలు లేకుండా, వాతావరణం సౌకర్యంగా ఉండే వారి స్వభావం కూడా సరళంగా ఉంటుంది. ఎక్కువగా పుస్తక పఠనం, గొప్పవ్యక్తుల జీవిత చరిత్రలు చదవటం, మంచి కథలు వినడం, న్యాయం, ధర్మం, నీతి, సమాజసేవల గురించిన విషయాలు వారికి పొందుపరచాలి. మంచి – చెడులను విశ్లేషించే విధానాన్ని తెలియజేయాలి.
-డాక్టర్ జమ్మలమడక నాగలక్ష్మి, హైదరాబాద్( 98484 80007 )
http://eekshanam.com/2020/10/08/rising-kids-psychology-article-by-jammalamadaka-nagalakshmi/?lang=te
Be the first to comment