మొట్టమొటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం 

‘మొట్టమొటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

సింగపూర్: పద్మభూషణ్, కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ పూరస్కార గ్రహీత దేవులపల్లి కృష్ణశాస్త్రి 123వ జయంతిని సందర్భంగా సద్గురు ఘంటసాల ఇంటర్నేషన్ ఫౌండేషన్ ట్రస్ట్, వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో ‘మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళన’ కార్యక్రమం ఆదివారం రోజు అంతర్జాలంలో 12 గంటలపాటు అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తానా, వంగూరి పౌండేషన్, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్, సీపీ బ్రౌన్ తెలుగు సమాఖ్య లండన్, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, తెలుగు మల్లి ఆస్ట్రేలియా,తెలుగు అసోసియేషన్ సిడ్నీ, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్, హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య వేగేశ్న ఫౌండేషన్‌లు తమ సహకారాన్ని అందించాయి.

 

కళాబ్రహ్మ వంశీ రామరాజు స్వాగత వచనాలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సభకు దేవులపల్లి మనవరాళ్లు, ప్రముఖ కార్టూనిస్ట్ బుజ్జాయి కుమార్తెలు అయిన రేవతి, రేఖ సుప్రియ హాజరై జ్యోతి ప్రకాశనం గావించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమ్మేళనం నిర్వహించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. కృష్ణశాస్త్రితో వారికున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సాహితీవేత్త కేవీ రమణ మాట్లాడుతూ.. దేవులపల్లి రచనా వైశిష్ట్యం గురించి ప్రారంభోసన్యానం చేశారు. దేలపల్లి రచించిన ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ ..పాటకు జాతీయగీతం కావలసిన స్థాయి ఉంది’ అన్నారు. దేవులపల్లి వంటి మహానుభావులకు నివాళిగా ఇటువంటి కార్యక్రమం చేయడం తమ సంస్థకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు కవుటూరు రత్న కుమార్ తెలిపారు.

ఇదిలా ఉంటే.. భారత్, అమెరికా, యూకే, సింగపూర్ తదితర తొమ్మిది దేశాల నుంచి 58 మంది గాయనీ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరంతా దేవులపల్లి రచించిన 100పాటలను పాడారు. ప్రముఖ గాయని సురేఖ మూర్తి ప్రార్థనాగీతం ఆలపించారు. దేవులపల్లిపై వీరుభొట్ల హరి శ్రీనివాస్ విరచిత గీతం ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆడియోను సభలో వినిపించడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. రాధిక మంగపూడి, సురేఖ మూర్తి, సీతారత్నాకర్, విజయలక్ష్మి, శశికళ మొదలైన వారు.. కృష్ణశాస్త్రి పాటలను ఎంతో శ్రావ్యంగా ఆలపించారు. సింగపూర్ నుంచి అక్షర అనే పిన్న వయస్కురాలు ఈ కార్యక్రమంలో పాల్గొని బృందగానం చేసింది.

 

 

 

అనంతరం సాహితీవేత్త, ప్రముఖ సినీ రచయిత భువన చంద్రకు ‘దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి జాతీయ సాహిత్య పురస్కారం’ను సగౌరవంగా అందజేశారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ, రేలంగి నరసింహారావు వెన్నెలకంటి, మహాభాష్యం చిత్తరంజన్, వంగూరి చిట్టెన్ రాజు, తోటకూర ప్రసాద్, జయశేఖర్, శారధ, దేవులపల్లి కుటుంబ సభ్యులు రత్నపాప, కొంచాడ రావు, మధు, శ్రీలత, జొన్నలగడ్డ మూర్తి, వీపీ కిల్లీ, సీతారామరాజు తదితరులు ప్రసగించారు. ఈ సందర్భంగా దేవులపల్లికి నివాళులర్పించి, భువనచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. రాధిక మంగిపూడి, విజయ గొల్లపూడి, జయ పీసపాటి, రాధిక నోరి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే.. దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటకు పట్టాభిషేకం చేసిన ‘మొట్టమొటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం’ కార్యమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కినట్లు నిర్వాహకులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*