సైనికులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. పాక్, చైనాలకు చురకలు

జైసల్మేర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళిని సైనికులతో కలిసి జరుపుకున్నారు. లొంగేవాలా పోస్ట్ వద్ద సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. సైనికుల ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు. సైనికుల వల్లనే దేశం ప్రశాంతంగా దీపావళి జరుపుకుంటోందని చెప్పారు.

దేశ రక్షణకు, సైన్య అవసరాలకు కావాల్సిన ఆయుధాలను, ఇతర ఉత్పత్తులను దేశంలోనే తయారు చేయాలంటూ సైన్యం తీసుకున్న నిర్ణయం ఓకల్ ఫర్ లోకల్‌గా మరిందని చెప్పారు. సైన్యం తీసుకున్న నిర్ణయం ఆత్మనిర్భర్ భారత్ విజయాన్ని సూచిస్తుందన్నారు.

 

ఈ సందర్భంగా మోదీ లొంగేవాలా పోస్ట్ అమరవీరులను గుర్తు చేసుకున్నారు. మేజర్ కుల్దీప్ సింగ్ శౌర్య పరాక్రమాలను ప్రశంసిస్తూ ఆయన ఎప్పటికీ రాష్ట్ర్ దీప్‌గా నిలిచిపోతారని కీర్తించారు.

ఈ సందర్భంగా మోదీ పాకిస్థాన్ దుష్క్రృత్యాలను దుయ్యబట్టారు. పాక్ దుశ్చర్యలకు భారత సైనికులు గట్టిగా బుద్ధి చెబుతున్నారని మోదీ చెప్పారు. భారత్‌ను రెచ్చగొట్టాలని చూస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని హెచ్చరించారు.

పనిలో పనిగా లడక్ వద్ద దూకుడుగా ఉన్న చైనాకు కూడా మోదీ చురకలంటించారు. విస్తరణవాదంతో ప్రపంచమంతా ఇబ్బందులు పడుతోందని చెప్పారు. అంతేకాదు విస్తరణవాదం మానసిక వికృతి అని విమర్శించారు. విస్తరణవాదానికి భారత్ గట్టిగా జవాబుచెబుతోందన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని సైనికులకు మూడు సలహాలిచ్చారు. మాతృభాష, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు మరో భాష నేర్చుకుంటే కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలని మోదీ సైనికులకు సూచించారు.

అనంతరం మోదీ లొంగేవాలా పోస్ట్ వద్ద వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.

ఆ తర్వాత మోదీ యుద్ధ ట్యాంకుపై ఎక్కి అక్కడి ప్రాంతాలను కొద్దిసేపు పరిశీలించారు.

అక్కడి మ్యూజియంను కూడా మోదీ సందర్శించారు.

అనంతరం జైసల్మేర్‌లో ఎయిర్‌ఫోర్స్ వారియర్స్‌తో ముచ్చటించారు.

 

 

అంతకు ముందు ప్రధాని… దేశ రక్షణ కోసం సర్వస్వం త్యాగం చేస్తున్న సైనికులకు దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*