శేరిలింగంపల్లి బీజేపీలో లుకలుకలు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయావకాశాలపై ప్రభావం 

హైదరాబాద్: శేరిలింగంపల్లి బీజేపీలో లుకలుకలు మొదలయ్యాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల దృష్ట్యా బీజేపీలోకి ఇతర పార్టీలనుంచి వచ్చిన వారిని తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్, ఆయన తనయుడైన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ కూడా బీజేపీలో చేరారు. అయితే వీరు చేరడం ద్వారా పార్టీకి మేలు జరిగే సంగతి పక్కనపెడితే చాలాకాలంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జెండా మోసిన యువ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొదటినుంచీ పార్టీ పటిష్టత కోసం పనిచేసిన తమను కాదని కొత్తగా పార్టీలో చేరే వారికి జీహెచ్‌ఎంసీ అభ్యర్ధులుగా టికెట్లు ఇవ్వడాన్ని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఆరేళ్లుగా, పార్టీ తరపున పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిన తమను కాదని, కొత్తగా వచ్చేవారికి టికెట్లు ఇవ్వడం ఎంతవరకూ సబబని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో తాజా పరిణామాలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.

 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ తరపున కీలకంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలకు అన్ని విషయాలూ తెలిసినా మౌనంగా ఉండటంపై యువ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జెండా మోసినవారికే ప్రాధాన్యమిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయభేరీ సాధించడం పక్కా అని చెబుతున్నారు. మరి పార్టీ అధిష్టానం యువ నాయకుల గోడు వింటుందా? పరిస్థితిని చక్కదిద్దుకుని ఎన్నికల్లో విజయం సాధిస్తుందా అనేది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*