
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాదీలు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలక ఆయుధమైనా జనం ఓటేయడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఓటు వేయడం తప్పనిసరి చేయాలని బీజేపీ అగ్రనేత అద్వానీ గతంలో సూచించిన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే దీనిపై గతంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 1952 నుంచి భారత్తో పాటు ఇతర దేశాల్లోనూ ఎన్నికల సరళిని గమనించిన ఆయన ఓటు వేయడం తప్పనిసరి చేయాలని గతంలో సూచించారు. అంతేకాదు ఓటు వేయనివారికి శిక్ష కూడా ఉండాలని సూచించారు. ఆ శిక్ష ఏంటంటే ఓటు వేయని వారికి భవిష్యత్తులోనూ ఓటేసే అవకాశం లేకుండా చేయడం. ఈ దిశగా ప్రభుత్వాలు సీరియస్గా చర్యలు తీసుకోవాలని 2014, 2016లోనూ సూచించారు.
ఓ పక్క సోషల్ మీడియాలో ఆయా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలపై దుమ్మెత్తిపోసేందుకు, తీవ్ర విమర్శలు చేసేందుకు తెగ ఉత్సాహం చూపించే యువత ఓటేసేందుకు ఆసక్తి చూపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటు హక్కును ప్రజలు ఉపయోగించుకోకపోవడంపై మేధావులు మండిపడుతున్నారు. పార్టీలను, ప్రజాప్రతినిధులను నిలదీయాలంటే ఓటును వినియోగించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు. ఓటర్లలో చైతన్యం లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని హెచ్చరిస్తున్నారు. ఓటర్లు బద్దకన్నా వీడి ఓటేసి బాధ్యతయుతమైన పౌరులుగా మెలగాలని సూచిస్తున్నారు.
Be the first to comment