
అది ఎల్బీ నగర్..
ఎల్బీ నగర్ క్రాస్ రోడ్డు నుంచి సికింద్రాబాద్ సైడ్ పోతూంటే…
ఫ్లై ఓవర్ దిగాక కుడిపక్కన డీసీపీ కార్యాలయం.. ఆ ఆఫీసు వెనక .. రిలయన్సు పెట్రోలు పక్కసందులో ఉండే రాక్ హిల్స్ ప్రాంతంలో ఉండే రైస్ ఏటీఎమ్ అంటే ఎవరైనా చెబుతారు. బియ్యం ఎక్కడిస్తారు అంటే ఎవరైనా చెబుతారు. అక్కడికి తీసుకెళ్తారు మనల్ని. నేను అలానే రైస్ ఏటీఎమ్ కాడికి పోయినా.
హైదరాబాద్లో సాఫ్ట్ వేరు ఆఫీసులో హెచ్ఆర్గా పనిచేసే దోసపాటి రాము దగ్గరకు మొన్న పోయిన. సాటి మనుషులు ఏమైతే మాకేం అనుకునే రోజుల్లో మనుషులను, ఈ సమాజాన్ని ప్రేమిస్తోన్న రాము రియల్ హీరో. కరోనా సమయంలో ఓ సెక్యూరిటీ గార్డ్ చేసే సాయాన్ని చూసి రాము ఈ సమాజానికి సాయం చేయాలని ముందుకొచ్చాడు. తన పీఎఫ్ డబ్బులే పెట్టుబడిగా పెట్టి రోడ్ల వెంట రక్తపుపాదముద్రలను ఈ సిగ్గులేని ధనికసమాజానికి, ప్రభుత్వానికి వదిలేసి వెళ్తున్న అనాథలు,కూలీలు, అభాగ్యులపాలిట అండగా నిలిచాడు. బిచ్చాందేహీ అని అడుక్కోరాదంటూ… ఏకంగా భోజనాలు పెట్టాడు. బియ్యం, నిత్యావసర సరుకులను ఉచితంగా ఇచ్చాడు. ఎంతో మంది కూటికి లేనోళ్ల కడుపు నింపాడు. అతను నెలకొల్పిందే రైస్ ఏటీఎమ్!
రాము కూడా మనలాంటి మనిషే. అతనికి కుటుంబం ఉంది. అతడూ ఓ ఇల్లు కొనుక్కుని హాయిగా ఉండాలనుకున్నాడు. కరోనా దెబ్బకు విలవిలలాడే పేదపేగుల ఆకలిని చూసి కన్నీళ్లు కార్చాడు. సాయం చేశాడు. బట్టలు ఇచ్చాడు. బువ్వ పెట్టాడు. బువ్వ పెట్టేవాడు దేవుడే అయితే అది రామునే. ఒకరా ఇద్దరా వేల కుటుంబాలకు ఆసరాగా నిలిచాడు. వలస కూలీలతో పాటు ఆటో డ్రయివర్లు, మేస్త్రీ పనులు చేసేవాళ్లు, ముసలోళ్లు, అనాథలు, గర్భిణులు, వికలాంగులు.. తన ఇంటి దగ్గరకి వస్తే వాళ్లకు బియ్యం, సరుకులు ఇచ్చాడు. సాటి మనిషి కష్టాలు పడుతోంటే తన డబ్బులు పోతున్నాయని బాధపడకుండా కూడు పెట్టాడు. ఈ రోజు 262 వ రోజు.. ఇప్పటికి 32 వేల కుటుంబాలకు బువ్వ పెట్టాడు. ప్రయివేట్ టీచర్లతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్లకూ సాయం చేశాడు. చదువు చెప్పే టీచర్లు ముఖానికి మాస్కులు కట్టుకుని ఎవరూ చూడకూడదని చాటుగా వచ్చి బియ్యం తీసుకుని వెళ్లేవారు. ఈ ప్రభుత్వాలను, ఈ ధనికులను చూసి అసహ్యమేసిందని రాము అంటాడు.
అలాంటి రాము దగ్గరకు నేను పోయినా. దగ్గరగా చూసినా. పని చేసుకోగలిగే స్థోమత లేని వాళ్లకు బియ్యం ఇస్తాడు. అతడు చేసే స్క్రీనింగ్ టెస్ట్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. బువ్వ లేని వాళ్లను మాత్రం చచ్చినా పస్తు పెట్టడు. బట్టలు ఇస్తాడు. పండ్లు ఇస్తాడు. ఉద్యోగం లేనోళ్లకు ఉద్యోగాలు చూపిస్తాడు. అసలు ఓ మనిషి తల్చుకుంటే ఇంత సాయం చేయచ్చా… ఓ మనిషి అనుకుంటే వేల మందికి అండగా నిలవొచ్చా.. అంటే రామునే నిలువెత్తు సాక్ష్యం. ఏ ప్రభుత్వాలు చేయని పనులు ఒక్కడు చేశాడు. తనతో పాటు ఎంతో మంది అండగా నిలుస్తున్నారిప్పుడు. మొన్న హైదరాబాద్ వరదల్లో వేలమందికి సాయం చేశాడు. రాము ఓ మామూలు మనిషి. మనలోంచి వచ్చిన మనిషే. మానవత్వమే అతని మతం. మనిషే అతని అజెండా. అందుకే మనీ అనే పదం తన గుండెలోంచి తీసేశాడు. మన సమాజంలో వెధవలే కాదు.. ఇలాంటి మంచోళ్లుంటారు. అలాంటి వాళ్లకు మనం తోడుగా నిలవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు ఏమంటారు మిత్రులారా?
ఇలా సాటి మనిషికి సాయం చేయడమే మనిషికి కావాల్సింది. మానవ సేవే మాధవ సేవ!
ఈ పాడు సంవత్సరంలో నేను కళ్లారా చూసిన రియల్ హీరో,
గొప్ప huMANist
రాము దోసపాటి గారు.
ఆయనకు శిరసువంచి నమస్కరిస్తూ..
salute comrade
✍🏻✍🏻✍🏻
మీ
పులివెందుల పిల్లగాడు
రాళ్లపల్లి రాజావలి
31.12.2020
7989746115
Graphics : ali
Created by: RR
https://www.facebook.com/rallapalli.rajavali/posts/10218546368472195
Be the first to comment