
రామకృష్ణమఠాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భాగ్యనగరంలోని రామకృష్ణమఠాన్ని సందర్శించారు. రామకృష్ణ మఠం మందిరంలో రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద చిత్రపటాలకు నమస్కరించుకున్నారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరక్టర్ స్వామి శితికంఠానంద తోడురాగా ఆమె మఠంలోని వివిధ విభాగాలను సందర్శించారు. ఆ తర్వాత మఠంలోని బుక్ స్టాల్కు వెళ్లి స్వామి వివేకానం సాహిత్యం కొనుగోలు చేశారు.
మరోవైపు తిథి ప్రకారం నేడు వివేకానంద జయంతి కావడంతో రామకృష్ణ మఠంలో రోజంతా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 5 గంటలా 30 నిమిషాలకు మంగళహారతి, భజనలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 7 గంటలకు విశేష పూజ, భజనలు, 10 గంటలా 15 నిమిషాలకు హోమం జరిగింది. 11 గంటలా 15 నిమిషాలకు గంటలకు హైదరాబాద్ రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద భక్తులకు సందేశమిచ్చారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద మధ్య జరిగిన అనేక కీలక ఘట్టాలను వివరించారు. శివజ్ఞానే జీవసేవ అనే సందేశం గురించి చెబుతూ ప్రతి జీవిలోనూ శివుడున్నాడని గ్రహించి సేవ చేయాలనే విషయాన్ని భక్తులకు అర్ధమయ్యేలా చెప్పారు. ఈ సందర్భంగా ఆలపించిన భజనలు భక్తులను భక్తిసాగరంలో ఓలలాడేలా చేశాయి. మధ్యాహ్నం 12 గంటలా 05 నిమిషాలకు విశేష ఆరతి, సాయంత్రం 6 గంటలా 45 నిమిషాలకు ఆరాత్రికం జరిగాయి. రాత్రి 7గంటలా 15 నిమిషాలకు ప్రత్యేక భజనలు చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో నేరుగా మఠానికి రాలేకపోయిన భక్తులు కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా వీక్షించారు.
Be the first to comment