ప్రధాని మోదీ రాజ్యసభ ప్రసంగం హైలైట్స్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. దేశంలో నిరంతరం నిరసనలు కొనసాగాలనుకునే వారిని గుర్తించాలని, అలాంటివారి నుంచి దేశాన్ని కాపాడాలని మోదీ సూచించారు. ఆందోళన జీవులు పరాన్నజీవులని మోదీ ఎద్దేవా చేశారు. ఎక్కడ, ఎవరు, ఏ ఆందోళన చేసినా అక్కడ వారు వాలిపోతుంటారని, నిరసనలు, ఆందోళనలు జరపకుండా వారు జీవించలేని స్థితిలో ఉంటారని, అలాంటివారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫారెన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ కలిగి ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని సూచించారు.

 

సిక్కు సమాజంపై దేశం గర్వంగా ఉంటుందని, వారు త్యాగానికి మారుపేరని మోదీ కీర్తించారు. గొప్ప గురు పరంపరను సిక్కు సమాజం దేశానికిచ్చిందని చెప్పారు. కొందరు పనిగట్టుకుని సిక్కులను పక్కదోవ పట్టిస్తున్నారని మోదీ చెప్పారు.

 

కనీస మద్దతు ధర ఎప్పటికీ ఉంటుందని మోదీ మరోసారి రైతులకు భరోసా ఇచ్చారు. సాగు చట్టాలపై దుష్ప్రచారం ఆపాలని సూచించారు. వ్యవసాయరంగంలో సంస్కరణలు తప్పనిసరి అని చెప్పిన ఆయన సాగు చట్టాల్లో లోపాలుంటే సరిచేసుకుందామన్నారు. ఆందోళన విరమించి సమస్య పరిష్కారం కోసం చర్చలు జరపాలని ప్రధాని సూచించారు.

 

 

ప్రసంగంలో ప్రధాని సుభాష్ చంద్రబోస్‌ను గుర్తు చేసుకున్నారు. జాతీయవాదమనేది సత్యం, శివం, సుందరం అనే మూలాల నుంచి గ్రహించబడినదని చెప్పారు.

కొందరు తనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, తనను విమర్శించడం ద్వారా ఆనందం పొందుతున్నారని మోదీ చెప్పారు. వారి ఆనందానికి కారణమౌతున్నందుకు తనకు కూడా ఆనందంగానే ఉందంటూ విమర్శలకు మాత్రమే పరిమితమౌతున్న వారికి మోదీ చురకలంటించారు. మోదీ ఉన్నంతవరకూ విమర్శకులకు అవకాశం ఉంటుందంటూ తమ ప్రసంగాన్ని ముగించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*