హైదరాబాద్‌ పర్యటనతో స్వామి వివేకానందలో పెరిగిన ఆత్మవిశ్వాసం

హైదరాబాద్: చికాగో సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి కొద్దిరోజుల ముందు స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి పదో తేదీన హైదరాబాద్ వచ్చారు. నవాబ్ సికిందర్ జంగ్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతోద్యోగులు, ప్రముఖులు స్వామీజీకి ఘనంగా స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్‌కు సుమారు 500 మంది తరలివచ్చారు. వారం రోజుల పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్‌లోని పలు చారిత్రక ప్రదేశాలను, నిజాం రాజప్రసాదాలను, చార్మినార్, మక్కామసీదు సహా అనేక దేవాలయాలను సందర్శించారు. పర్యటనలో భాగంగా ఆయన నిజాం కొలువులో మత విధానాల గురించి చర్చించారు.

ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో మై మిషన్ టు ది వెస్ట్ పేరుతో జరిగిన సభలో స్వామి వివేకానంద ప్రసంగించారు. యూరోపియన్లతో పాటు సుమారు వెయ్యిమంది ఈ సభకు హాజరయ్యారు. పాశ్చాత్య దేశాలకు తాను వెళ్లడంలోని ఉద్దేశంపై స్వామీజీ ఆంగ్లంలో ప్రసంగించారు. భారత సంస్కృతీ, సంప్రదాయాలు, హైందవ ధర్మ గొప్పతనం, వేదాలు, ఉపనిషత్తుల ప్రాధాన్యత, నైతిక ఆదర్శాల గురించి ప్రసంగించిన ఆయన సభికులను మంత్రముగ్ధులను చేశారు. భారత్‌ను నూతన జవ సత్వాలతో పునరుజ్జీవింపచేయాలనే తన లక్ష్యాన్ని స్వామీజీ వెల్లడించారు. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం వివేకానందుడిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేసింది.

హైదరాబాద్ పర్యటన తర్వాత స్వామీజీ వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. చికాగోలోని విశ్వవేదికపై హైందవ ధర్మ గొప్పతనాన్ని, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ తర్వాత అమెరికా, యూరప్‌ సహా అనేక దేశాల్లో ఆయన పర్యటించి ప్రపంచానికి భారతీయ ఆధ్యాత్మిక ఆత్మను పరిచయం చేశారు. ముఖ్యంగా భారత యువతను తట్టిలేపారు. భారత్‌ను పరమవైభవస్థితికి తీసుకెళ్లేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

స్వామి వివేకానంద హైదరాబాద్‌లో పర్యటించి 128 ఏళ్లైన సందర్భంగా రామకృష్ణ మఠం అనేక కార్యక్రమాలు నిర్వహించనుంది. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద ప్రత్యేక వెబినార్ కూడా నిర్వహించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*