
హైదరాబాద్: నారాయణగూడలోని డిగ్రీ కాలేజీలో సమాచార భారతి ఓ కార్యక్రమం నిర్వహించింది. కరోనా సమయంలో జర్నలిస్టుల సేవలపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్ ముఖ్య అతిథిగా, స్ఫూర్తి మేగజైన్ ప్రధాన సంపాదకులు అన్నదానం సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. వల్లీశ్వర్ మాట్లాడుతూ కరోనా అనేక పాఠాలు నేర్పిందని చెప్పారు. ఇంటి పట్టూనే ఉండటం, కుటుంబంతో ఎక్కువ సమయం కేటాయించడం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు నేర్పిందన్నారు. ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా కరోనా నేర్పించిందని చెప్పారు. డిజిటల్ మీడియావైపు ఎక్కువ మంది దృష్టి సారించారని చెప్పారు.
అన్నదానం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో జర్నలిస్టులు ఛాలెంజ్‌గా తీసుకుని సేవలందించారని చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు సమాజంలోని కొందరు వ్యక్తులు అందించిన సహాయ సహకారాలను కొనియాడారు. భారత కుటుంబ వ్యవస్థతో పాటు సామాజిక వ్యవస్థలో సాయం చేయడం, ఎదుటివారిని ఆదుకోవడం అనాదిగా వస్తుందని చెప్పారు.
కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులు కరోనా సమయంలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈనాడు జర్నలిస్ట్ నర్సింగ్ రావు, నమస్తే తెలంగాణ విలేకరి మల్లేశ్, మై ఇండ్ మీడియా చీఫ్ దేవిక, నేషనలిస్ట్ హబ్‌కు చెందిన బీరప్ప, యువ జర్నలిస్ట్ సిద్ధు తదితరులు ప్రసంగించారు. కరోనా వల్ల తామెలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామో వివరించారు. కరోనానుంచి బయటపడటం కోసం ఏమేం చేశారో వివరించారు.
కరోనా కారణంగా మరణించిన జర్నలిస్ట్ సోదరులకు నిమిషం పాటు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ శ్రీనాథ్ పాడిన జనజాగృత నవభారత మహోదయం దేశభక్తి పాట ఆకట్టుకుంది.
వివిధ పత్రికలు, ఛానెళ్లు, వెబ్సైట్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు.
Be the first to comment