
ఆదిలాబాద్: బ్రిటీషువారు భారతదేశానికి వచ్చిన తర్వాతే రసాయన ఎరువుల వాడకం మొదలైందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. రసాయన ఎరువుల వాడకం వల్ల దేశవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన మందులను పిచికారీ చేయడంతో ఆహారం కలుషితం కావడంతో పాటు వాతావరణంలో పెనుమార్పులు వస్తున్నాయని చెప్పారు. గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సేంద్రియ రైతు కుటుంబాల సమ్మేళన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సేంద్రియ వ్యవసాయంతో పెట్టుబడి ఖర్చులు తగ్గితే రైతే యజమానిగా మారే అవకాశం ఉందని చెప్పారు.
ప్రకృతి పరమైన సేంద్రియ ఎరువులను తయారు చేసుకొని ఆరోగ్యవంతమైన పంటలు పండించడం వల్లే భావితరాలకు భవిష్యత్ ఉంటుందని భాగవత్ తెలిపారు. సంప్రదాయ వ్యవసాయం చేస్తూ రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. తక్కువ ఖర్చుతో వ్యవసాయం, రైతుకు యాజమాన్యపు హక్కులు, సంఘటితం కావడం సేంద్రియ సాగుతోనే సాధ్యపడుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్, నిజామాబాద్ ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
Be the first to comment