నందిగ్రామ్‌లో మమత ఓటమి ఖాయం: ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి పాలుకానున్నారని ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడించింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి సుబేందు అధికారి గెలవబోతున్నారని తెలిపింది.

పశ్చిమబెంగాల్‌లో మమత నేతృత్వంలో పదేళ్ల పాటు సాగిన పాలనకు బెంగాలీలు చెక్ పెట్టనున్నారని వెల్లడించింది. మొత్తం 294 స్థానాలకు గాను 292 స్థానాలకు ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించింది. ఇందులో 183 స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతుంది. తృణమూల్ 76 స్థానాలకు పరిమితం కాబోతోంది. మమత పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోనుంది.

 

 

వాస్తవానికి 2016లో మమతకు అండగా నిలిచిన మహిళా ఓటర్లు ఈ సారి అండగా లేరని ఇండియా టీవీ తెలిపింది. 2016లో సీపీఎం, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు కనపడిన మమతకు ఓటర్లు 211 స్థానాల్లో గెలిపించి అండగా నిలిచారు. అయితే ప్రస్తుతం సీన్ దీదీ వర్సెస్ మోదీగా మారింది. నందిగ్రాం నియోజకవర్గంతో పాటు పశ్చిమబెంగాల్ అంతటా కాషాయజెండాకు అనుకూలంగా బలమైన పవనాలు వీస్తున్నాయి. మమతతో పాటు తృణమూల్ పార్టీకి చెందిన మంత్రులు కూడా చిత్తుగా ఓడిపోబోతున్నారని ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 2016లో 12.4 శాతం ఓట్లతో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించిన బీజేపీ ప్రస్తుతం 183 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టనుంది.

ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. అసలు ఫలితాలు మే రెండున మధ్యాహ్నానికల్లా వస్తాయి. రాజకీయ పండితులతో పాటు దేశమంతా పశ్చిమబెంగాల్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*