సింగపూర్‌లో వైభవంగా వాసవి జయంతి వేడుకలు

సింగపూర్‌: వాసవి క్లబ్ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో నివసిస్తున్న ఆర్యవైశ్యులు వర్చువల్ పద్దతిలో జూమ్ కాల్ ద్వారా వాసవి జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. కామారెడ్డి జిల్లాలో సిద్ది వినాయక ఆలయ పురోహితులైన ఆంజనేయ శర్మ ప్రత్యేక అలంకరణతో అమ్మవారి మంటపాన్ని అలంకరించి భక్తులందరిచేత గణపతి పూజ, ఆదిత్య హృదయము, చంద్రశేఖరాష్టకం, వాసవి కుంకుమార్చన, అమ్మవారి జన్మవృత్తాంతముతో కూడిన చక్కని వర్ణనతో ఆహుతులను భక్తి శ్రద్దలతో వ్రతమాచరింపజేశారు. అదే సమయంలో సింగపూర్‌లోని శ్రీ మారియమ్మన్ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. భక్తులు వారి వారి ఇంటి నుంచే దేవాలయ దర్శనము, అమ్మవారి పూజ కార్యక్రమాలతో ఆనందంగా జరుపుకోవడం విశేషం. కార్యక్రమానికి హాజరైన మహిళలు మరియు పిల్లలు అమ్మవారి మణిదీప వర్ణన, అమ్మవారి భక్తిగీతాలాపనలతో కార్యక్రమాన్ని కొనసాగించారు.

కార్యక్రమానికి అతిధులుగా హాజరైన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు మరియు ప్రస్తుత పెనుగొండ వాసవి నిత్యాన్నదాన ట్రస్ట్ ప్రెసిడెంట్ నూలి వెంకట రమణ మూర్తి సభ్యులందరికి అమ్మవారు చెప్పిన ధర్మ సూత్రములను చక్కగా వివరించి అందరిలో గొప్ప స్ఫూర్తిని నింపారు. చివరిగా క్లబ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గొట్లూరు మాట్లాడుతూ కార్యక్రమాన్ని కోవిడ్ పరిస్థితుల్లో కూడా చక్కగా జరిగేందుకు సహకరించిన కమిటీ సభ్యులకు ధన్యవాదములు తెలియజేశారు. కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో పేద ఆర్యవైశ్యులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం సజావుగా సాగడంలో కీలక పాత్రపోషించిన కమిటీ సభ్యులైన కిషోర్ ముక్కా, ముకేశ్ భూపతి, మురళి కృష్ణ పబ్బతి, రాజా విశ్వనాథుల తదితరులు సమన్వయ పరిచారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*