
మన తెలుగువారికీ, 18 సంఖ్యకీ ఉన్న అవినాభావ సంబంధం మనకి తెలిసిందే. మనకి 18 పురాణాలు, మహాభారతంలో 18 పర్వాలు, కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులు, అలాగే మన రాధిక మంగిపూడి ‘అలా.. సింగపురములో’ సంకలనంలో 18 కథానికలు. కాకపోతే పైవన్నీ మహా గంభీరమయినవి, ‘అలా..సింగపురములో’ మాత్రం తత్విరుద్ధంగా హాస్యస్ఫోరకమయినది. అయితే ఇందులో కొన్ని చాలా లోతయిన ఆలోచనలను కలిగిస్తాయి మరికొన్ని గిలిగింతలు పెట్టిస్తాయి. కొన్ని కల్పిత కథానికలు కాగా కొన్ని యదార్థ జీవిత సంఘటనలు,వాటికి రచయిత్రి తన ప్రతిభా పరిమళాలు అద్ది హాస్యాన్ని నింపి … చమత్కారభరితంగా మలచి … కొండకచో శృతిమించని వెటకారంతో అలంకరించి అందించినదే ఈ తాజా పుష్పగుచ్ఛం.
తెలుగు సాహిత్యంలో హాస్యకథలు, నవలలు తక్కువనే చెప్పాలి, ఆ లోటును భర్తీ చేసే విధంగా ఈ సంకలనం ఉంది అనడంలో సందేహమే లేదు. ఒకప్పుడు కాంతం కథలు, భారాగో 116, గణపతి(నవల), కంఠాభరణం(నాటకం), బారిష్టరు పార్వతీశం, అమెరికా ఇల్లాలి ముచ్చట్లు వంటివి ఎలా అయితే మనల్ని గిలిగింతలు పెట్టాయో, రాధిక ‘అలా..సింగపురములో’ కూడా ఆ స్థాయిలోనే ఆకట్టుకుంటుంది. సింగపూర్ కి కొత్తగా వెళ్లిన తెలుగువారు ఎలాంటి ఇబ్బందులు పడతారో? చిన్న చిన్న కథలతో చిన్న చిన్న ఉదాహరణలతో, మధ్యమధ్యన అమాయకత్వం, తింగరితనం వల్ల వచ్చిన చిక్కులతో కలగలిపి రచయిత్రి చెప్పిన శైలి నవ్వులపువ్వులు పూయిస్తుంది.
ఆ కోవకి చెందిన కథానికలే, “పనిమనిషోపాఖ్యానం1,2,” “సింగ్ పోస్ట్” “ గమ్మత్తు మరమ్మత్తు”, “కోవిడావకాయ”. ఇవి రచయిత్రి నిజ జీవిత ఘటనలు. ఇలాంటివి మనందరి జీవితాలలో కూడా నిత్యం జరుగుతాయి కానీ, వీటినింతటి చమత్కారాలతో, వెటకారాలతో, హాస్యభరితంగా చెప్పవచ్చని మనలో చాలామందికి తోచకపోవచ్చు. ప్రతీరోజూ మన జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలని మనం యధాలాపంగా మరచిపోతాం. కానీ వాటిని గుర్తుపెట్టుకొని మరీ ఆ సంఘటనలకు నవ్వులు జోడించి అందమైన కథల మాదిరి మలచిన ఘనత రాధికదే.
అంతేనా వాటిని ఏకబిగిన పాఠకుల చేత చదివించి వారి పెదవులపై నవ్వుల మతాబులు వెలిగించడం మాములు విషయం కాదు.
నిజానికి వర్ధమాన రచయిత/రచయిత్రులకు ఈ సంకలనం ఒక కరదీపిక వంటిది. మన చుట్టూ జరిగే సంఘటనలను, వార్తలను,సమాజాన్ని, మనుషులను, వారి మాటలను, హావభావాలను గమనిస్తే ఎన్నెన్నో కథలకు వస్తు సామగ్రి దొరికినట్టే అన్న కిటుకు ఒడిసిపట్టుకున్న రచయిత్రి రాధిక.
ఈ సంకలనానికి తొలిపలుకులుగా ప్రఖ్యాత గేయ రచయిత శ్రీ భువనచంద్ర గారు అందించిన ఆశీర్వ పూర్వక పలుకులు చూడగానే ఈ సంకలనం ఎంత ప్రామాణికమయినదో అర్థమైంది. ఆ తరువాత మన మ్యూజికాలజిస్ట్ రాజా గారి ఫోటోనీ, ఆయన స్వభావసిద్ధమయిన ఆత్మీయపు మాటలనీ చదవగానే అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక అరుదయిన సినీ సాహిత్యనిధిని కాలమిలా అకాలంగా నిర్దయగా మనకి దూరం చేయటం మనం జీర్ణించుకోలేని చేదు నిజం.
ఆయన రాసిన తొలిపలుకుల నీడలో ఆయన పాదాలు వెతుక్కుని అభివందనం చేయడం కన్నా మరేమీ చేయలేని స్థితి.
నిజానికి ‘అలా..సింగపురములో’ సంకలనాన్ని ఏరికోరి వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించి, ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఆవిష్కరించారంటేనే రచయిత్రి యొక్క రచనా కౌశలం ఎలా అంతర్జాతీయ స్థాయి తెలుగు పాఠకులని అలరిస్తుందో గ్రహించవచ్చు. దీనికి అదనపు సొబగు “తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్” లో చోటు దక్కడం.
ఇక కథల్లోకి వెళితే …
“అలా సింగపురములో..” ని తొలి కథానిక
1. ప్యాకేజీ పెళ్లి:-
“మనం” అన్న భావన నించి “నేను” అనే స్వార్థంలోకి వచ్చిన మనం, మన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్లాస్టిక్ మయం చేసి కాంట్రాక్టులకి ఇచ్చేశాం. చివరికి మన జీవితాలలో అతిముఖ్యమైన మధురఘట్టం పెళ్లి! దాన్ని కూడా చుట్టాల బంధువుల సాయంతో సందడిగా సంతృప్తిగా చేసుకోకండా తయారయ్యాం! “నువ్వు నాకు నచ్చావ్” లో m.S. నారాయణ గారు ఇచ్చిన సలహా లాగా పెళ్లిని కాంట్రాక్టుకి ఇస్తే ఎలా ఏడుస్తుందో చెప్పే కథే ఈ “ప్యాకేజి పెళ్లి”.
2. నమ్మకం విలువ:-
ఇందులో…దేవుడు ఉన్నాడా లేడా అనే మానవ సహజమయిన అనుమానాన్ని ఒక ఊహించని సంఘటన ద్వారా తాత్వికంగా, ఆలోచింపజేసే విధంగా తెలియజేసారు రాధిక గారు. మనమంతా తప్పకండా చదవాల్సిన కథ ఇది.
3. పనిమనిషోపాఖ్యానం1:-
మొదటి రెండు కథానికలు కల్పితాలు కాగా, ఈ మూడో కథ రచయిత్రి స్వీయానుభవం. ఒకరోజు సింగపూర్ లో ఉంటున్న రచయిత్రి గారింటికి ఒక 70 ఏళ్ల చైనా పనిమనిషి టింగురంగా అంటూ వచ్చి ఎలా “ఆపరేషన్ కొంప క్లీనింగ్” చేసి పోయిందో చెప్తుంటే ఆ పదప్రయోగాలకి పొట్టచెక్కలయ్యేలా నవ్వుతాం. దీనికి పార్ట్ 2 కూడా ఉందండోయ్! అదే పనిమనిషోపాఖ్యానం 2.
ఆ తరువాతి కథలు కూడా ఇలాగే నవ్విస్తూ ఆలోచింపజేస్తూ౦టాయి.
“సంక్రాంతి”, “సింగ్ పోస్ట్”, “నిజాలెవరికి కావాలి?” “గమ్మత్తు మరమ్మత్తు” లాంటి కథానికలు హాస్యభరితంగా సాగుతాయి. “కోవిడావకాయ” మాత్రం తప్పకండా చదవాల్సిందే. అందులో మలేషియా వారి “బాబా చిల్లీ పౌడర్” నిజంగానే చిల్లీ పౌడరా పాండ్స్ పౌడరా అని అనుమానం రాక మానదు. కానీ చివరికది ఏమాత్రం కారం లేని కారం అని మాత్రం అర్థమవుతుంది. కానీ ఆవకాయ ప్రహసనం మహాద్భుతం.
పదిహేనవ కథ 15. బొమ్మలాట. :-
మనిషి యొక్క మంచితనం వల్ల ఆశించకుండానే కలిగే లాభాల గురించి చెప్తూ “నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది” అనే నానుడి గుర్తుచేసేలా గంభీరమయిన ముగింపుతో ఆలోచింపజేస్తుంది.
16వ కథ :- “కలకానిదీ విలువైనది” .
ఇలాంటి కాపురాలు నేటి కాలంలో ఎక్కువయిపోయాయి. కనీసం ఈ కథానిక, దీనితో పాటు “ పగటి వెన్నెల” చదువాకయినా ఇప్పటి యువతరం కళ్ళుతెరవాలి. “ చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు” అని తెలుసుకోవాలి.
17వ కథ “దబదబ”:-
ఈ కథానికలో గూగుల్ మాతని నమ్ముకుని ప్రయాణం కొనసాగిస్తే రచయిత్రి కీ తన కుటుంబానికీ ఎలా చావుతప్పి కన్నులోట్టబోయిందో హాస్యభరితంగా తన స్వీయానుభవాన్ని తెలియజేశారు రాధిక గారు. అంతేమరి, దారిపోయే దానయ్య చెప్పినంత యాప్ట్ గా యంత్రాలు, యాప్స్ ఎలా చెప్తాయి?
18వ కథానిక “అలా…సింగపురం లో…”
ఇది “సింగపూర్ తెలుగు టీవీ” వారు షార్ట్ ఫిల్మ్ గా కూడా తీశారు. ఇది నిక్ఖార్సయిన తెలుగు కథ. చదువుతున్నంత సేపూ దూరపు కొండలు నునుపు అనీ, నూడుల్స్ మొహాలకేం తెలుసు ఆవకాయ చేవ అనీ అనిపించక మానదు. ఈ కాలం పిల్లలకి కామక్షమ్మగార్లాంటి బామ్మగారు కావాలి. లేకపోతే భావితరాలు గొప్ప సంపదని కోల్పోయినట్టే.
https://www.youtube.com/watch?v=tiGU7-qQPvc
https://www.facebook.com/radhika.mangipudi.5/posts/10208427275115640
మొత్తం మీద రాధిక మంగిపూడి “అలా..సింగపురంలో..” లోని 18 కథానికలు అందరినీ ఆలోచింపజేస్తాయి, నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, ఓదారుస్తాయి, ధైర్యం చెప్తాయి. మా కుటుంబంతో కలిసి మేము కూడా ఒక నెలన్నాళ్లు సింగపూర్ లో ఉన్న కారణంగా ఈ కథానికలకీ, రచయిత్రి శైలికి త్వరగా కనెక్ట్ అయ్యాను అనుకుంటున్నాను. మరయితే మీరు కూడా చదివి ఆనందిస్తారు కదూ “అలా…సింగపురంలో…”
-మాధురి.ఇంగువ.
Be the first to comment