34 దేశాల తెలుగు కళాకారులతో సంచలనం సృష్టించిన అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం-2021

సింగపూర్: “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ సంస్థ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 3, 4 వ తేదీలలో 24 గంటల పాటు అద్వితీయంగా జరిగిన “అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021” కార్యక్రమంలో ప్రపంచ నలుమూలల నుండి 35 దేశాల నుండి 45 తెలుగు సంస్థలు, ప్రతినిధులు పాల్గొని ఒకే ప్రపంచ తెలుగు సాంస్కృతిక కుటుంబంగా కలసి, తెలుగు సంస్కృతికి నీరాజనాలు పట్టారు.
కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు జ్యోతి ప్రకాశనం గావించి తమ అనుగ్రహభాషణాన్ని అందించగా, భారత ఉపరాష్ట్రపతివర్యులు వెంకయ్య నాయుడు కార్యక్రమంలో పాల్గొంటున్న 34 దేశాల సంస్థల ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రారంభోపన్యాసం గావించడం ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకతను సంతరింపజేసింది.

“ప్రపంచ నలుమూలల్లో వివిధ దేశాలలో తెలుగువారి ప్రతిభకు పట్టం కట్టే విధంగా, అన్ని దేశాల తెలుగు కళాకారులు ఒక కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయం అయ్యేవిధంగా, ఒక ప్రపంచ వేదికను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం రూపొందించామని, అనూహ్యమైన స్పందన తో 35 దేశాల ప్రతినిధులు పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా అనిపించిందని” శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు, కార్యక్రమం ముఖ్యానిర్వాహుకులు కవుటూరు రత్న కుమార్ తెలిపారు.

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు వంటి ప్రముఖ ఆధ్యాత్మిక మార్గదర్శకులు విచ్చేసి సదస్సులో వారందరికీ తమ ఆశీస్సులు అందించారు. రామ్ మాధవ్, మురళి మోహన్, మండలి బుద్ధ ప్రసాద్, వామరాజు సత్యమూర్తి వంటి రాజకీయ ప్రముఖులు, భువనచంద్ర, తనికెళ్ళ భరణి, సాయి కుమార్, హర్షవర్ధన్, వంటి సినీ దిగ్గజాలు, సురేఖ మూర్తి, పార్ధు నేమాని, విజయలక్ష్మి వంటి ప్రముఖ గాయనీ గాయకులు, శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు, మాండోలిన్ రాజేష్, తాళ్లూరి నాగరాజు వంటి ప్రముఖ వాద్య కళాకారులు సభను అలంకరించారు. అమెరికా నుండి ప్రముఖులు చిట్టెన్ రాజు, తోటకూర ప్రసాద్, జయశేఖర్ తాళ్లూరి, నిరంజన్, మధు ప్రఖ్యా , భారతదేశం నుండి ప్రముఖులు డా.వంశీ రామరాజు. డా. మీగడ రామలింగస్వామి, రుద్రాభట్ల రామ్ కుమార్ పాల్గొన్నారు. సుమారు 200 మందికిపైగా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, జానపదాలు, సినీ గీతాలు, వయోలిన్ వీణ వేణువు పియానో మొదలగు వాద్య గానాలు, అష్టావధానం, కవితలు, కథలు, వ్యాసాలు, లఘు నాటికలు మొదలైన ఎన్నో అద్భుత ప్రదర్శనలతో అందరిని అలరించారు. పోలెండ్ దేశస్థుడైన బాల గాయకుడు బుజ్జి చక్కటి తెలుగు పాటలతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

ఈ బృహత్కార్యక్రమానికి రాధిక మంగిపూడి ముఖ్య సమన్వయకర్తగా, ఊలపల్లి భాస్కర్ ప్రధాన సాంకేతిక నిర్వాహకునిగా, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయిని ప్రత్యక్ష ప్రసార నిర్వాహకులుగా, చామిరాజు రామాంజనేయులు, జయ పీసపాటి, సుబ్బు పాలకుర్తి, సునీత, సీతారామరాజు ప్రధాన వ్యాఖ్యాతలుగా, గుంటూరు వెంకటేష్, సురేష్ చివుకుల, మౌక్తిక తదితరులు సాంకేతిక నిర్వాహక బృందంగా వ్యవహరించారు. “శుభోదయం” సంస్థ, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సింగపూర్, ఈ రెమిట్, EGA జూస్ ప్రధాన స్పాన్సర్స్ గా, సాక్షి టీవీ, టీవీ5, సింగపూర్ తెలుగు టీవీ, ఈ క్షణం, మా గల్ఫ్, మొదలైన వారు మీడియా పార్ట్నర్స్ గా నిర్వహింపబడిన ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులపాటు యూట్యూబ్ మరియు ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడి, సుమారు 20 వేల మంది ప్రేక్షకులను ప్రపంచ వ్యాప్తంగా అలరించింది.

అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021లో పాల్గొన్న వివిధ దేశాల సంస్థలు..

సింగపూర్ నుండి తెలుగు భాగవత ప్రచార సమితి, కాకతీయ కల్చరల్ సొసైటీ, మలేషియా తెలుగు సంఘం,
హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, ఇండోనేషియా తెలుగు అసోసియేషన్ , తెలుగు అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ బ్రూనై, ఆస్ట్రేలియా నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా, తెలుగుమల్లి , తెలుగు అసోసియేషన్ ఆఫ్ సిడ్నీ, న్యూజిలాండ్ నుండి తెలుగు అసోసియేషన్, సంగీత భారతి, భారతదేశం నుండి వంశీ ఇంటర్నేషనల్ , రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, నవసాహితి ఇంటర్నేషనల్ , జనరంజని ముంబై, విశ్వనాథ ఫౌండేషన్, సౌదీఅరేబియా నుండి సౌదీ తెలుగు అసోసియేషన్, ఖతార్ నుండి ఖతార్ తెలుగు సమితి, ఆంధ్ర కళా వేదిక , బహరే్ తెలుగు కళా సమితి , కువైట్ తెలుగు సంఘాల ఐక్యవేదిక , ఒమాన్ తెలుగు కళా సమితి , యుఏఈ నుండి తెలుగు తరంగిణి, మారిషస్ తెలుగు సాంస్కృతిక నిలయం , దక్షిణాఫ్రికా నుండి తెలుగు సాహిత్య వేదిక , సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అసోసియేషన్ , తెలంగాణ అసోసియేషన్,, తెలుగు అసోసియేషన్ ఆఫ్ బోత్సువానా , నార్వే నుండి వీధి అరుగు, నార్వే తెలుగు అసోసియేషన్, యునైటెడ్ కింగ్డమ్* నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ , స్వీడన్ తెలుగు కమ్యూనిటీ, ఫిన్లాండ్ తెలుగు అసోసియేషన్ , ఫ్రాన్స్ తెలుగు సంఘం, జర్మనీ కలోన్ తెలుగు వేదిక , నెదర్లాండ్స్ తెలుగు కమ్యూనిటీ , ఐర్లాండ్ తెలుగు సంఘం, డెన్మార్క్ తెలుగు సంఘం, కెనడా నుండి ఆంటోరియో తెలుగు అసోసియేషన్, అటావా తెలుగు అసోసియేషన్, తెలుగు తల్లి మాసపత్రిక,అమెరికా* నుండి తానా, వంగూరి ఫౌండేషన్ IBAM సంస్థలు … అలాగే పోలెండ్, స్విజర్లాండ్ , బెల్జియం, ఉగాండా, జపాన్ , శ్రీలంక దేశాలనుండి ప్రతినిధులు , కళాకారులు ఈ రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొన్నారు.

తొలిసారి ఒకే అంతర్జాల వేదికపై 35 దేశాల తెలుగు ప్రతినిధులు ఇలా కలుసుకుని సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రసంగాలతో వేడుకలు జరుపుకోవడం ఒక విశిష్ట రికార్డుగా పరిగణించి “తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్” అధ్యక్షులు చింతపట్ల వెంకటాచారి ఈ కార్యక్రమాన్ని నమోదు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ కార్యక్రమాన్ని క్రింది లింకు ద్వారా వీక్షించవచ్చను
Day 1:

Day 2:

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*