VIHE 22వ వార్షికోత్సవాల సందర్భంగా జర్నలిస్టులతో స్వామి బోధమయానంద ఆత్మీయ సమావేశం

హైదరాబాద్: స్వామి వివేకానంద కేవలం ఒక వ్యక్తి కాదని, సంఘటిత శక్తి అని, ఏ ఒక్కరికో పరిమితమైన వ్యక్తి కాదని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద అన్నారు. వివేకానంద కోల్‌కతాకో, కేవలం భారతదేశానికో పరిమితమైన వ్యక్తి కాదని, విశ్వమానవ కల్యాణం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి, ఆధునిక యుగ ప్రవక్త అని అన్నారు. వివేకానంద ఆశయాలు నేటికీ అనుసరణీయమని చెప్పారు. ఆయన స్ఫూర్తితో ఉత్తమ పౌరులను సమాజానికి అందించేందుకు వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ విశేష కృషి చేస్తోందని స్వామి బోధమయానంద అన్నారు. ఇంతవరకూ 20 లక్షల మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సంస్థ శిక్షణ ఇవ్వడం ఒక రికార్డని చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 22వ వార్షికోత్సవాలను జరుపుకోనున్న తరుణంలో జర్మలిస్టులతో స్వామీజీ బుధవారంనాడు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

 

ఈ సందర్భంగా స్వామి బోధమయానంద మాట్లాడుతూ, పాత్రికేయ వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనదని, వివేకానందుని ఆశయాలను, స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకు వెళ్లడం ద్వారా ఉత్తమ సందేశాన్ని సమాజానికి అందించాలని పాత్రికేయులకు దిశానిర్దేశం చేశారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఈ 21 ఏళ్లలో 20 లక్షల మందికి వివిధ కోర్సులలో శిక్షణ ఇచ్చిందన్నారు. 25కు పైగా కోర్సులలో శిక్షణ ఇస్తోందని స్వామి బోధమయానంద చెప్పారు. ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ ఫర్ కాలేజీ స్టూటెండ్స్, ప్రాక్రిక్టల్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్టెప్స్‌ టు బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, శ్రద్ధ, లీడర్ షిప్ క్వాలిటీస్, మైండ్ మనేజిమెంట్ టెక్నిక్స్, హౌట్ ఓవర్‌కమ్ ఫియర్, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, పర్సనాలిటీ డవల్‌మెంట్, అడ్వాన్స్‌డ్ లెవెల్ ట్రైనింగ్ ఇన్ పర్సినాలిటీ డవలప్‌మెంట్, రిసెడెన్షియల్ యూత్ క్యాంప్/నాన్ రెసిడెన్సియల్ యూత్ క్యాంప్ (యూజీ, పీజీ విద్యార్థులకు), వివేకానంద యువ జాగృతి వేదిక, ప్రేరణ (నిపుణులతో సైకాలజీ కౌన్సిలింగ్), పిల్లల కోసం టోటల్ పెర్సనాలిటీ డవలప్‌మెంట్ వర్క్‌షాప్స్, డ్రాయింగ్, పెయింటింగ్, వివేకానంద బాల వికాస్ కేందర్, మ్యూజిక్ కోర్సులు, డివోషనల్ మ్యూజిక్: వోకల్, యోగాసనాలు, యోగా అధ్యన శిబిర్, జాయ్ ఆఫ్ మెడిటేషన్, స్ట్రెస్ మేనేజిమెంట్, పేరెంట్స్ మోటివేషన్ కోర్సులు నిర్వహిస్తోందన్నారు. అలాగే ఇంజనీర్లు, టీచర్లు, మేనేజర్లు, కార్పొరేట్ ఉద్యోగులు, అడ్వొకేట్లు వంటి ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని స్వామి బోధమయానంద చెప్పారు.

 

స్వామి వివేకానంద 1893లోనే హైదరాబాద్ వచ్చారని, ఏడు రోజులు ఉన్నారని, ఆయన హైదరాబాద్‌ను సందర్శించడం అంత ఎక్కువగా ప్రచారంలో లేకపోయినా, ఆ సందర్శన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని స్వామి బోధమయానంద వివరించారు. 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన సర్వమత మహాసభలో స్వామీజీ తన ప్రసంగం ద్వారా భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పారని అన్నారు. ఉక్కునరాలు, వజ్ర సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని వివేకానంద ఆచరణలో చూపించారని వివరించారు. వివేకానంద కాషాయధారణ చూసి ఏ ఒక్కరికో ఆయనను పరిమితం చేయడం ఆయనను సరిగా అర్థం చేసుకోకపోవడమేనని స్వామీజి కుండబద్ధలు కొట్టారు. స్వామీజీ అశయాల విస్తరణకు రామకృష్ణ మఠం, వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ బహుముఖమైన కృషి చేస్తోందన్నారు.

 

‘హ్యూమన్ ఎక్స్‌లెన్స్’లో పాత్రికేయుల కోసం వారానికి ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్వామి బోధమయానంద సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పాత్రికేయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వారందరికీ ఏడాది పాటు ‘రామకృష్ణ ప్రభ’ మాస పత్రిక ఉచితంగా ఇంటికి పంపిస్తామని మరో కానుక ప్రకటించారు. రామకృష్ణ మిషన్ ప్రచురించిన.. యువజాగృతి, జాగృత భారతం, భారతజాతికి నా హితవు, శ్రీరామకృష్ణ దర్శనం, మహనీయులు (స్వామీజీ ప్రత్యక్ష సన్యాస శిష్యుల జీవిత గాథలు), మానవ ప్రతిభ, మన మహోన్నత వారసత్వం వంటి పలు అమూల్య పుస్తకాలను, స్వామి వివేకానంద మెమెంటోను పాత్రికేయులందరికీ తమ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో తొలుత సమావేశానికి హాజరైన పాత్రికేయులు తమను తాము స్వామికి పరిచయం చేసుకున్నారు. అలాగే, మఠానికి అంకితమై పనిచేస్తున్న ఫ్యాకల్టీ సభ్యులు బాలాజీ సుందరం, మూర్తి, ఆదిరాజు, వాలంటీర్లు లక్ష్మీ అమ్మ, మాధవీ అమ్మ, ఉద్యోగులను కూడా స్వామీజీ సభకు పరిచయం చేశారు.

ఈ ఆత్మీయ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు వల్లీశ్వర్, కృష్ణ మోహన్, ఆదూరి వెంకటేశ్వరరావు, గుజ్జుల రమేశ్, క్రాంతి దేవ్ మిత్ర, జాగృతి ఎడిటర్ గోపరాజు నారాయణ రావు, నమస్తే తెలంగాణ ఆధ్యాత్మికం పేజీ ఇంఛార్జ్ జనార్ధన్ రావు, సాక్షి ఆధ్యాత్మికం పేజీ ఇంఛార్జ్ డీవీఆర్ భాస్కర్, వెలుగు ఎడిటర్ సత్యనారాయణ, ఆంధ్రజ్యోతి వెబ్ ఇంఛార్జ్ శ్రీనివాసకుమార్, ఈనాడు జర్నలిస్టులు మురళీకృష్ణ, గరిడేపల్లి ప్రసాద్, ఆల్ ఇండియా రేడియోకు చెందిన భిక్షా నాయక్, ఆకాశవాణి న్యూస్ రీడర్ శరత్ జ్యోత్స్న, అనౌన్సర్ ఆనంద్ రెడ్డి ఎఫ్ ఎం రెయిన్ బో 101.9 రేడియో జాకీలు దీనబాంధవా, రేణుక, రాజేశ్, ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు పెమ్మరాజు వెంకటేశ్వరరావు, రాజావలి, శ్రీనాథ్, ఉపేంద్ర, వేముల శ్రీను ప్రసాద్, ఏబీఎన్‌ రిపోర్టర్లు ప్రవీణ్, సాగర్, ఈనాడు నర్సింగ్‌రావ్, సాక్షి అఖిలేష్, ఆంధ్రజ్యోతి సతీశ్ ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.

 

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*