
విఐహెచ్ఈ 22వ వార్షికోత్సవాలు.. ఈ నెల 11, 12 తేదీల్లో ఆర్.కె మఠ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు
హైదరాబాద్: చికాగో ప్రసంగానికి 128 ఏళ్లయిన సందర్భంగా భాగ్యనగరంలోని రామకృష్ణమఠం ఈ నెల 11, 12 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ నెల 11న మధ్యాహ్నం మూడున్నరకు ట్యాంక్‌బండ్‌పై ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అక్కడే చికాగో ప్రసంగాన్ని అందరిచేత చదివింపచేస్తారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠానికి చెందిన స్వాములు, బ్రహ్మచారులు పాల్గొంటారని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద తెలిపారు. అదే రోజు ఉదయం పదిన్నరకు జాతీయ స్థాయిలో ఆన్లైన్ యూత్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ వెబినార్‌లో స్వామి వివేకానంద యూత్ మూమెంట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్. బాలసుబ్రమణియం, టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ అన్షుల్ చతుర్వేది వక్తలుగా పాల్గొంటారని బోధమయానంద తెలిపారు.
వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 22వ వార్షికోత్సవాలు ఆన్లైన్ ద్వారా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 12న ఉదయం 11 గంటలకు జరిగే ఆన్లైన్ కార్యక్రమంలో సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. బేలూరు రామకృష్ణ మఠం, మిషన్ల జాతీయ ఉపాధ్యక్షుడు స్వామి గౌతమానంద మహరాజ్, బేలూర్ రామకృష్ణ మఠం, మిషన్ల జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి సువిరానంద మహరాజ్ పాల్గొంటారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి జ్ఞానదానంద ప్రసంగిస్తారని స్వామి బోధమయానంద తెలిపారు.
ఆన్లైన్ ద్వారా జరిగే కార్యక్రమాలను రామకృష్ణ మఠం యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా వీక్షించవచ్చన్నారు.
Be the first to comment