సింగపూర్‌లో ఘనంగా వినాయక చతుర్ధి వేడుకలు

సింగపూర్:శ్రీ సాంస్కృతిక కళాసారథి” ఆధ్వర్యంలో సింగపూర్‌లో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆన్‌లైన్ ద్వారా జరిగిన కార్యక్రమంలో సహస్రావధాని, బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని గంటన్నర సేపు ప్రసంగించారు. ఆదిశంకర విరచితమైన “ముదాకరాత్తమోదకం” అనే గణేశ పంచరత్న స్తోత్రానికి ప్రత్యేక అర్థ విశ్లేషణ ఇచ్చారు. స్తోత్ర వివరణ ఆధారంగా మధ్యలో ఎన్నో జీవిత మర్మాలను వివరిస్తూ, నిత్య జీవితంలో ఎలా నడుచుకోవాలో, నైతిక విధానాలను కూడా చక్కటి ఛలోక్తులతో వివరించారు.

వినాయక చతుర్థి పర్వదిన సందర్భంగా భగవంతుని అనుగ్రహంతో పాటు గురువు ఆశీస్సులను కూడా పొందడం తమ అదృష్టంగా భావిస్తున్నామని శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు.

సింగపూర్‌లో వివిధ తెలుగు లోగిళ్ళలో కొలువై పూజలందుకున్న వినాయక విగ్రహాలను, అంతర్జాలం ద్వారా అందరూ వీక్షించగలిగే విధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అన్ని దేశాల వారు తమ ఇంటి నుంచే సింగపూర్ వినాయక ప్రతిమల దర్శనాన్ని చేసుకోగలిగారు.

ఈ కార్యక్రమంలో రాధిక మంగిపూడి, భాస్కర్ ఊలపల్లి, చామిరాజు రామాంజనేయులు, సాంకేతిక నిపుణులు గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, సంస్థ సభ్యులు అనంత్ బొమ్మకంటి, వేణు మల్లవరపు, రాజశేఖర్ తంగిరాల, సుబ్బు పాలకుర్తి, సురేష్ చివుకుల తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ముఖ్య స్పాన్సర్లుగా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సింగపూర్, ఈగ జూస్ మొదలైన సంస్థలు సహకారం అందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*