వివేకానంద చికాగో సక్సెస్ వెనుక హైదరాబాద్: స్వామి బోధమయానంద

హైదరాబాద్: వివేకానంద ఇన్‌స్టిట్యూబ్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 22వ వార్షికోత్సవాలు, స్వామి వివేకానంద చికాగో ప్రసంగ 128వ వార్షికోత్సవం రామకృష్ణ మఠంలో ఘనంగా నిర్వహించారు. వివేకానంద ఇన్‌స్టిట్యూబ్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అనేక ఆన్‌లైన్ కార్యక్రమాలతో పాటు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి సెప్టెంబర్ 11న పూలమాలలు వేసి హారతినిచ్చారు. ఈ కార్యక్రమానికి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామకృష్ణ మఠంతో తనకున్న అనుబంధాన్ని గురించి చెప్పారు. స్వామి వివేకానందుడి బోధనలు సమాజానికి, యువతకు ఎంతో అవసరమన్నారు. రామకృష్ణ మఠానికి ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు స్వామి బోధమయానందకు ఎమ్మెల్యే సునీత ధన్యవాదాలు తెలిపారు.

స్వామి బోధమయానంద మాట్లాడుతూ చికాగో ప్రసంగం విజయవంతం కావడానికి స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో పర్యటించి ఫిబ్రవరి13న సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో ప్రసంగించడమేనని చెప్పారు. ఆ రోజున వెయ్యి మంది మేధావులను ఉద్దేశించి స్వామి వివేకానంద ఇంగ్లీష్‌లో ప్రసంగించారని బోధమయానంద చెప్పారు. స్వామి వివేకానంద ఇంగ్లీష్‌లో అంత పెద్ద సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం అదే తొలిసారని, వివేకానందుడికి చికాగో ప్రసంగానికి ముందు హైదరాబాద్ ప్రసంగం రిహార్సల్స్‌లా మారిందని స్వామి బోధమయానంద చెప్పారు. హైదరాబాదీలు ఆదరిస్తే ప్రపంచ ప్రజలంతా ఆశీర్వదిస్తారంటూ స్వామి బోధమయానంద చమత్కరించారు.

కార్యక్రమంలో భాగంగా చికాగో ప్రసంగాన్ని ఇంగ్లీష్‌లో వీఐహెచ్‌ఈ ఫ్యాకల్టీ మూర్తి చదవగా, తెలుగులో సీనియర్ వాలంటీర్ రవీంద్రనాథ్ చదివారు.

 

ట్యాంక్‌బండ్‌పై జరిగిన కార్యక్రమం తర్వాత అందరూ ర్యాలీగా రామకృష్ణ మఠానికి వెళ్లారు. వీఐహెచ్‌ఈ భవనం ఆవరణలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి స్వామి బోధమయానంద పూలమాల వేసి హారతి ఇచ్చారు. వివేకానందుడి బోధనలు జీవితాంతం పాటించాలని సూచించారు.

 

కార్యక్రమంలో రామకృష్ణ మఠానికి చెందిన సీనియర్ స్వాములు స్వామి భీతిహరానంద, రామకృష్ణ ప్రభ ఎడిటర్ స్వామి పరిజ్ఞేయానంద, బ్రహ్మచారులతో పాటు తెలంగాణ జాగృతి ఫౌండేషన్‌కు చెందిన రంజితా రెడ్డి, వీఐహెచ్‌ఈ ఫ్యాకల్టీ సభ్యులు అజిత్ సింగ్ తదితరులు, ఇతర ప్రముఖులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*