వృషభోత్సవానికి నల్లమోతు మద్దతు

హైదరాబాద్: కృషి భారతం ఆధ్వర్యంలో నవంబర్ 5న తెలుగు రాష్ట్రాలతో పాటు వివిద దేశాల్లో నిర్వహించనున్న వృషభోత్సవానికి ఒంగోలు జాతి పశువుల అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లమోతు వేణుగోపాల్ రావు మద్దతు తెలిపారు. దేశీయ వృషభాలను కాపాడేందుకు కృషిభారతం చేస్తున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. వృషభోత్సవం విషయంలో కృషి భారతంతో కలిసి పనిచేస్తామన్నారు. రైతు సోదరులంతా ఉత్సాహంగా వృషభోత్సవంలో పాల్గొనాలని వేణుగోపాలరావు పిలుపునిచ్చారు. ఏటా వృషభోత్సవం నిర్వహిస్తున్న కృషిభారతం అధ్యక్షుడు కౌటిల్య కృష్ణన్‌ను ఆయన అభినందించారు.

ప్రతి ఏటా కార్తీక శుద్ధ పాడ్యమి నాడు వృషభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అని, వేద వ్యవసాయ పండుగల్లో వృషభోత్సవం అతి ముఖ్యమైనదని కౌటిల్య కృష్ణన్ తెలిపారు. దేశవాళీ వృషభాల ప్రాధాన్యతను ప్రస్తుత తరాలకు తెలియజేయడమే కాక గో సంతతిని కాపాడుకునే లక్ష్యంతో వృషభోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.

బసవ, పరాశర, పరశురామ, కశ్యప, వశిష్ట, బలరాముడు తదితరులు గతంలో వృషభాన్ని పూజించారని కౌటిల్య గుర్తు చేశారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా వృషభోత్సవాన్ని తమ మఠాలు, పీఠాలు, ఆశ్రమాల్లో నిర్వహించేందుకు అనేక మంది స్వాములు ముందుకొచ్చారు. అనేక దేవాలయాలు, గోశాలల్లో కూడా వృషభపూజ, వృషభయాత్ర నిర్వహించనున్నారు. రైతన్నలు కూడా వృషభోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమౌతున్నారు. రైతన్నలు వృషభాలతో ఫొటోలు దిగి 86867 43452 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని కౌటిల్య సూచించారు. రైతులు తమ పేరు, అడ్రస్ వివరాలు కూడా ఫొటోలతో పాటు పంపాలని చెప్పారు.

వృషభోత్సవానికి ఇప్పటికే కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మద్దతు తెలిపారు. వృషభోత్సవం పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*