
www.eekshanam.com
హైదరాబాద్: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ రచించిన ‘శ్రీ లలితావిద్య’ పుస్తకావిష్కరణ సందర్భంగా హైదరాబాద్ కింగ్ కోఠిలోని భారతీయ విద్యా భవన్లో తన విద్యార్ధులతో ‘వందే శ్రీ మాతరం’ నృత్య రూపకాన్ని ప్రదర్శించడం ద్వారా తన కల నెరవేరినట్లు నాట్యకల్ప కూచిపూడి నృత్య పాఠశాల ప్రిన్సిపాల్ నూతి లక్ష్మీప్రసూన తెలిపారు. షణ్ముఖ శర్మ రచించిన ‘వందే శ్రీ మాతరం’ పాటకు తన విద్యార్ధులతో నృత్య రూపకాన్ని ప్రదర్శించేందుకు అవకాశమిచ్చిన రుషిపీఠానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
తనకు సహకరించిన అమెరికాకు చెందిన ప్రఖ్యాత వీణ కళాకారిణి వాణికి లక్ష్మీప్రసూన ధన్యవాదాలు తెలిపారు.
కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులున్నా విద్యార్ధులంతా సహకరించి నృత్య రూపక ప్రదర్శనను విజయవంతం చేశారని లక్ష్మీప్రసూన తెలిపారు.
పద్మభూషణ్ వెంపటి చిన సత్యం, డాక్టర్ బాల కొండల్ రావు వద్ద కూచిపూడి నృత్యం అభ్యసించిన నూతి లక్ష్మీ ప్రసూన అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై స్వయంగా ప్రదర్శనలు ఇచ్చారు. అమెరికా, కెనడాల్లోని 52 నగరాల్లో ప్రదర్శనలిచ్చారు. తన విద్యార్థులతోనూ అనేక ప్రతిష్ఠాత్మక వేదికలపై ప్రదర్శనలు ఇప్పించారు.
తాజాగా ‘శ్రీ లలితావిద్య’ పుస్తకావిష్కరణ సందర్భంగా హైదరాబాద్ కింగ్ కోఠిలోని భారతీయ విద్యా భవన్లో తన విద్యార్ధులతో చేయించిన ‘వందే శ్రీ మాతరం’ నృత్య రూపకంపై ప్రశంసలు కురిశాయి. సభికులు మంత్రముగ్ధులై నృత్యరూపకాన్ని వీక్షించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు లక్ష్మీప్రసూన బృందంపై అభినందనల జల్లు కురిపించారు.
Be the first to comment