
బ్యాంకాక్: సైనిక పాలనలో ఉన్న మయన్మార్లో అమెరికా జర్నలిస్టుకు 11ఏళ్ళ జైలు శిక్ష విధించారు. డానీ ఫెన్స్టర్ అనే అమెరికా పాత్రికేయుడు ఫ్రాంటియర్ మయన్మార్ అనే ఆన్ లైన్ మాగజైన్ కు మేనేజింగ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈయన్ని మే నుంచి నిర్బంధంలో ఉంచిన మయన్మార్ సైన్యం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయించడానికి ప్రేరేపిస్తున్నడన్న ఆరోపణతో పాటు ఇతర ఆరోపణలు రుజువయ్యాయని 11 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఈయనపై ఇంకా రెండు ఆరోపణలపై వివిధ కోర్టుల్లో విచారణ జరగాల్సి ఉంది.
ఫెన్స్టర్ మే 24న యంగూన్ విమానాశ్రయంలో డెట్రాయిట్ విమానాన్ని ఎక్కబోతుంటే అదుపులోకి తీసుకున్నారు. సైన్యం అధికారాన్ని చేపట్టాక విదేశీ జర్నలిస్టుపై ఇంత తీవ్ర నేరారోపణ రావడం ఇదే మొదటిసారి. ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారాన్ని సొంతం చేసుకోవడం తెలిసిందే.
మయన్మార్లో అధికారాన్ని చేజికించుకున్న సైన్యం పత్రికా స్వేచ్ఛ ను హరిస్తోంది. జర్నలిస్టు లకు కనీస సదుపాయాలను కల్పించకపోగా దాదాపు 100 మంది జర్నలిస్టు లను అరెస్టు చేసింది, వారిలో 30 మంది ఇప్పటికీ జైలోనే ఉన్నారు. సైన్యం అధికారాన్ని చేపట్టడాన్ని వ్యతిరేకించిన ప్రజలు నిరసన తెలపగా వారికి ఆయుధాలతో సమాధానం చెబుతున్నారు. అసిస్టన్స్ అసోసియేషన్ ఆఫ్ పొలిటికల్ ప్రిసినర్స్ లెక్కల ప్రకారం ఇప్పటికీ దాదాపు 1,200 మంది ప్రాణాలు బలి కాగా ఇంచు మించు 10,000 మందిని అరెస్టు చేశారు.
Be the first to comment