సేవే పరమార్థంగా పెట్టుకున్నా: గాయని విజయలక్ష్మి

సింగపూర్‌: వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌, శుభోదయం గ్రూప్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ గాయని, సింగింగ్‌ స్టార్‌ విజయలక్ష్మికి స్వర్ణ-వంశీ శుభోదయం మ్యూజికల్‌ అవార్డు-2021ని శుభోదయం గ్రూప్‌ ఛైర్మన్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌ లయన్‌ డా॥ లక్ష్మీప్రసాద్‌ కలపటపు బహూకరించారు.

ఈ సందర్భంగా నేషనల్‌ బ్యాంకార్డ్‌ అధ్యక్షులు చికాగో నివాసి, కళాప్రియులు ఇఫ్తెకార్‌ షరీఫ్‌ మాట్లాడుతూ ‘అమెరికా, యు.కె., గల్ఫ్‌, మలేషియా, రష్యా, ఆస్ట్రేలియా తదితర దేశాలు పర్యటించి తెలుగు, హిందీ, మళయాళం, కన్నడ, తమిళం, రాజస్థానీ, ఒరియా భాషలలో అనేకానేక పాటలు పాడి ప్రపంచదేశాలలోని సంగీత ప్రియులను ఓలలాడించి ఘనత చెందిన తెలుగు గాయనిగా’ ఆమెను ప్రశంసించారు.

అమెరికా నుంచి ప్రముఖ గాయని శారద ఆకునూరి, సింగపూర్‌నుంచి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్‌ కవుటూరు, రాధికా మంగిపూడి, తెలుగు కళాసమితి ఖతార్‌ నుంచి దాని అధ్యక్షులు తాతాజీ ఉసిరికల పాల్గొని విజయలక్ష్మి విజయపథంలో విహరిస్తున్న మధురగాయనిగా ప్రశంసించారు. వ్యాఖ్యాన శిరోమణి సుధామయి, ప్రముఖగాయని సురేఖామూర్తి దివాకర్ల, శశికళా స్వామి వేదాల, వినోద్‌బాబు, గురు రామాచారి, డా॥ బంటి, శ్రీకృష్ణ, వి.కె. దుర్గ, ప్రవీణ్‌ కొప్పుల, సుగుణ, శ్రీనివాస్‌, సుజారమణ, శారదా సాయి, కె.ఎస్‌.ఆర్‌. మూర్తి, లలిత చెరుకూరి, శివశంకర్‌, కమలాశాస్త్రి, రేవతి, మహాభాష్యం చిత్తరంజన్‌, వి. హరి శ్రీనివాస్‌, చింతలపాటి సురేష్‌, శైలజ సుంకరపల్లి విజయలక్ష్మి అభినందన సమావేశంలో పాల్గొని ‘అపూర్వ స్వరమధురిమతో జనహృదయాలను రంజింపచేసే ప్రతిభాసంపన్నురాలు విజయలక్ష్మి’ అని కొనియాడారు.

శుభోదయం ఛైర్మన్‌ & మేనేజింగ్‌ ట్రస్టీ లయన్‌ డా॥ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘శుభోదయం గ్రూప్‌ తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకు దోహదం చేసే కార్యక్రమాలకు అంతర్జాతీయంగా సహకరిస్తుందనీ, గత 50 సంవత్సరాలుగా సాంస్కృతిక సేవారంగాలకు ఎనలేని సేవ చేస్తున్న వంశీ సంస్థతో వారు చేస్తున్న ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాలకు వంశీ – శుభోదయం పేరుతో సహకరిస్తుందనీ, సింగింగ్‌ స్టార్‌గా గత 5 దశాబ్దాలుగా తన పాటల ద్వారా తెలుగు భాషకు ఎనలేని సేవ చేస్తున్న విజయలక్ష్మికి ‘స్వర్ణ వంశీ`శుభోదయం మ్యూజికల్‌ అవార్డు’ ప్రదానం చేసినందుకు తమ శుభోదయం గ్రూప్‌ గర్విస్తున్న’’దని అన్నారు.

వంశీ సంస్థ అధ్యక్షురాలు డా॥ తెన్నేటి సుధ తను రాసిన అభినందన పత్రం చదివి వినిపించారు.

వంశీ సంస్థల వ్యవస్థాపకులు కళాబ్రహ్మ, శిరోమణి డా॥ వంశీ రామరాజు మాట్లాడుతూ, ‘‘ఎందరో కళాకారుల చేయూతవల్ల వంశీసంస్థ స్వర్ణోత్సవాలు జరుపుకోబోతున్నదనీ, 5 ఖండాలలోని తెలుగువారి కళాకారులను ఈ సందర్భంగా అభినందిస్తుం’’దని అన్నారు. సింగింగ్‌ స్టార్‌ విజయలక్ష్మి తాము నడుపుతున్న దివ్యాంగుల సహాయార్థం ఘంటసాల ఆరాధనోత్సవాలు, ఎస్‌.పి. బాలు ఆరాధనోత్సవాల సభలలో పాల్గొని ఎంతో సహకరించారనీ, ఆమె చేస్తున్న సాంఘిక, సంక్షేమ కృషిని కొనియాడారు.

అవార్డు స్వీకరించిన విజయలక్ష్మి మాట్లాడుతూ, ‘మొదటి నుంచీ తన జీవితమంతా పాటలు పాడుతూ వ్యాపార పద్ధతిలో కాకుండా సంఘసేవా కార్యక్రమాలకు చేయూతనిస్తున్నాననీ, ఎప్పటికీ తన ధ్యేయం సేవే పరమార్థంగా పెట్టుకున్నాననీ’ అన్నారు.

ఈ అంతర్జాల కార్యక్రమాన్ని వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ అఫీషియల్‌, శుభోదయం, ‘ట్రైనెట్‌ లైవ్‌’ ప్రసారం చేశాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*