క్రియాయోగాన్ని ప్రపంచానికి అందించిన దూత

హైదరాబాద్: సమకాలీన యుగంలో యోగ విజ్ఞానశాస్త్రం వల్ల కలిగే ప్రయోజనాలను ఆధునిక ప్రపంచం మరింత ఎక్కువగా గుర్తిస్తోంది. అన్ని దేశాలలోనూ యోగం సార్వజనీన ఆదరణ పొందిందని, ఆచరణ యోగ్యమైనదిగా గుర్తించబడిందనే వాస్తవానికి జూన్ 21 వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడమే ఒక తార్కాణం.

ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక కళాఖండంగా కొనియాడబడిన ఒక యోగి ఆత్మకథ పుస్తక రచయిత అయిన పరమహంస యోగానంద, యోగంలోని నిగూఢమైన విషయాలను, దాని సాధనను తూర్పు దేశాలకు మాత్రమే పరిమితం చేయవలసిన అవసరం లేదనే యథార్థం గురించి పాశ్చాత్య దేశాలకు తెలియజేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆయన చేసిన యోగధ్యాన బోధనలు విస్తృతంగా గ్రహించబడి చివరికి మిగిలిన ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి. నేడు యోగానంద పడమటి దేశాలలో యోగ పితామహులుగా గుర్తింపు పొందారు.

యోగం అనే పదానికి అర్థం ‘ఐక్యత’ (భగవంతునితో). పరమాత్మతో అటువంటి కలయిక ప్రతి ఒక్క మానవుడిలో సహజసిద్ధమైనది, మరియు అది అతడి ఉన్నతమైన లక్ష్యం కూడా అనే వాస్తవాన్ని మహాత్ములందరూ స్వీకరించారు. యోగము మరియు సహజంగా ఆ లక్ష్యానికి దారితీసే దాని మార్గమైన ధ్యానాభ్యాసం, మానవుడు పరమాత్మునితో అటువంటి అనుసంధానం పొందగలిగే ఏకైక పద్ధతి.

నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు, యోగం కేవలం ఒక శారీరక వ్యాయామాల సమూహం మాత్రమే కాదని, వాస్తవమైన ఆంతరిక విజయాలకు దారితీసే మార్గాన్ని చూపిస్తుందని, ఆ మార్గం చివరికి ఆత్మసాక్షాత్కారమనే లక్ష్యానికి నడిపిస్తుందని కనుగొంటున్నారు.

సాటిలేని మహర్షి అయిన పతంజలి తన గ్రంథంలో తెలియజేసిన అష్టాంగయోగ మార్గాన్ని అనుసరించిన వ్యక్తి, గొప్ప మహాత్ములందరి ప్రకారం, అంతిమ లక్ష్యాన్ని తప్పక సాధిస్తా8డు. క్రియాయోగం గురించి భగవద్గీత ప్రత్యేకంగా పేర్కొంది; అంతేకాక యోగి అత్యున్నత ఆధ్యాత్మిక యోధుడని, అతడు కాని యోగ సాధనను కొనసాగిస్తూ ఉంటే, అంతిమంగా భగవంతుడిని కనుగొంటాడనే వాస్తవాన్ని నొక్కి చెప్పింది.

క్రియాయోగం యోగంలోని ఒక ప్రత్యేకమైన విభాగం; దీనిని యోగానందజీ ప్రముఖంగా చూపించి, తన బోధనల ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు. క్రియాయోగం ఒక సరళమైన మనో-భౌతిక విధానం, అది మానవ రక్తంలోని కర్బనాన్ని తొలగించి, దానిని ప్రాణవాయువుతో నింపుతుంది. కాని క్రియాయోగం యొక్క నిజమైన ప్రయోజనం దాని ఆధ్యాత్మిక విలువలో ఉంది; ఎందుకంటే అది క్రమబద్ధంగా సాధన చేసే సాధకుని శీఘ్రంగా ఆత్మసాక్షాత్కారం వైపు పురోగమించేందుకు సమర్థునిగా చేస్తుంది.

యోగానందగారి గొప్ప గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి తన యువ శిష్యుణ్ణి ‘జగద్గురువు’ పాత్ర పోషించేందుకు సిద్ధం చేయడానికి కారణభూతులయారు. యుక్తేశ్వర్ జీకి ఆయన గురువైన లాహిరీ మహాశయులు క్రియాయోగ దీక్షను ప్రదానం చేశారు; లాహిరీ మహాశయులు అమరులైన బాబాజీని కలిసిన అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన, నాటకీయమైన సంఘటన ఒక యోగి ఆత్మకథలో వివరంగా వర్ణించబడింది. ఆ చిరస్మరణీయ సమావేశ ఘట్టంలో బాబాజీ అంధయుగాలలో ప్రపంచం కోల్పోయిన సనాతన శాస్త్రమైన క్రియాయోగాన్ని పునరుద్ధరించడానికి తన ప్రధాన శిష్యుడిని సన్నద్ధం చేశారు. అంతేకాక, చిత్తశుద్ధి గల భక్తులందరికీ క్రియాయోగ దీక్షను ప్రదానం చేయడానికి లాహిరీ మహాశయులను అనుమతించారు. అప్పటినుండీ ఆ సాంప్రదాయం వందేళ్ళ క్రితం యోగానందజీ స్థాపించిన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతోంది.

యోగానంద ఆత్మకథలో ఆయన వ్రాసిన ఆఖరి పలుకులు క్రియాయోగ మార్గంలో చిత్తశుద్ధితో సాధన చేసేందుకు కావలసిన చిరస్మరణీయమైన ప్రేరణను మనకు అందిస్తున్నాయి. ధగధగ మెరిసే రత్నాల మాదిరిగా భూమి అంతటా వ్యాపించి ఉన్న వేలాదిమంది క్రియాయోగులకు ప్రేమపూర్వకమైన భావతరంగాల్ని ప్రసారంచేస్తూ, కృతజ్ఞతతో నేను తరచు అనుకుంటూ ఉంటాను: “ఈశ్వరా, ఈ సన్యాసికి పెద్ద సంసారమిచ్చావు కదయ్యా!”
మరింత సమాచారం కోసం: yssi.org

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*