మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

మంచి నిద్ర కోసం చంద్రబాబు ఇచ్చిన సలహా ఇది

Updated: 05-03-2018 05:49:44

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సుఖ నిద్ర కోసం చిట్కా చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో ‘పలకరింపు’ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉండకుండా రోజూ కాసేపైనా బయట తిరగాలని, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ‘హ్యాపీ సండే’ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు చెప్పారు. రోడ్లపై డ్యాన్స్‌లు చేస్తుంటే చూసి ఆనందించవచ్చన్నారు. ఇంట్లోకి బయటకు వచ్చాక కాసేపు గట్టిగా అరిచి ఆ తర్వాత ఇంటికి వెళ్తే ఉత్సాహంగా ఉంటుందని, రాత్రివేళ హాయిగా నిద్ర పడుతుందని వివరించారు. రోజురోజుకు వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆరోగ్యంలో ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్న మన దేశం మరింత పైకి రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.  
 
సెల్‌ఫోన్ ఒక్కటీ ఉంటే మరేమీ లేకున్నా పర్వాలేదన్న దృక్పథాన్ని ప్రతి ఒక్కరు విడిచిపెట్టాలని కోరారు. బంగారం, వజ్రాలు ధరించే ఆనందం రాదని, ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం వస్తుందని సీఎం పేర్కొన్నారు. ఇకపై ప్రతీనెల అనారోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపిస్తూ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. సోమవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకూ 'పలకరింపు' ద్వారా ఐదేళ్లలోపు పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. మొత్తం 57 వేల మంది వైద్య సిబ్బంది 1.22 కోట్ల గృహాలకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు.

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.