మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

ఇక సెలవ్.. వెళ్లొస్తా: ముగిసిన శ్రీదేవి అంత్యక్రియలు

Updated: 28-02-2018 07:35:42

ముంబై: దుబాయ్‌లో మృతి చెందిన దిగ్గజ నటి శ్రీదేవి అంత్యక్రియలు ముంబైలోని విల్లే పార్లే సమాజ్ సేవా హిందూ శ్మశాన వాటికలో కొద్దిసేపటి క్రితం ముగిశాయి. మధ్యాహ్నం అశేష అభిమానుల అశృనయనాల మధ్య ఆమె అంతిమ యాత్ర ప్రారంభమైంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, రాజకీయ, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. శ్రీదేవి మృతికి సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా ఆమెకు నివాళులర్పించారు. శ్రీదేవిని కడసారి చూసేందుకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్ మొత్తం తరలివచ్చింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, అజయ్‌దేవ్‌గణ్, కాజోల్, అక్షయ్ కుమార్, అక్షయ్ ఖన్నా, జయాబచ్చన్, జయప్రద, సుస్మితా సేన్, హేమమాలిని, టబు, సోనమ్ కపూర్, విద్యాబాలన్ తదితరులు శ్రీదేవి పార్థివ దేహానికి నివాళులర్పించారు. 
 
మంగళవారం రాత్రి దుబాయ్ అధికారులు శ్రీదేవి మతదేహాన్ని అప్పగించిన తర్వాత ప్రత్యేక విమానంలో ముంబై తీసుకొచ్చారు. బుధవారం ఉదయం లోఖండ్‌వాలాలోని ఆమె నివాసం నుంచి అభిమానుల సందర్శనార్థం సెలబ్రేషన్స్ క్లబ్‌కు తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం అంతిమయాత్ర ప్రారంభమైంది. వేలాదిమంది అభిమానులు ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు. శ్రీదేవి పార్థివ దేహాన్ని ఆమెకు ఇష్టమైన ఎరుపు రంగు కాంజీవరం చీర, ఎర్రని బొట్టు, తెల్లని పూలతో అలంకరించారు. అంతిమయాత్ర ఏడు కిలోమీటర్ల మేర సాగింది. మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గౌరవ సూచకంగా శ్రీదేవి పార్థివదేహంపై త్రివర్ణ పతాకం కప్పారు. పోలీసులు గౌరవ వందనం నిర్వహించారు. అశేష అభిమానులను దుఃఖ సాగరంలో ముంచి శ్రీదేవి కానరాని లోకాలకు తరలిపోయారు.

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.