మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

నిషిత్ చనిపోయిన కారు నాది కాదు: పవన్ కల్యాణ్

Updated: 11-05-2017 04:53:02

హైదరాబాద్: ఏపీ మంత్రి నారాయణ కుమారుడు చనిపోయే ముందు వాడిన బెంజ్ కారు తనది కాదని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పారు. నిషిత్ ఆయన స్నేహితుడు రాజా రవిచంద్ర ప్రయాణించిన మెర్సెడెజ్ బెంజ్ జి63 ఏఎంజీ ఎస్‌యూవీ తనది కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇదే కారులో ప్రయాణిస్తూ హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36 వద్ద మెట్రో పిల్లర్‌ను ఢీ కొని నిషిత్ అక్కడికక్కడే చనిపోయారు. రెండున్నర కోట్ల రూపాయల ఖరీదైన ఈ కారు అత్యంత సురక్షితమైనది. అత్యంత అధునాతనమైనది. అయినా కూడా ప్రమాదం జరిగిన సమయంలో బెలూన్లు ఓపెన్ కాలేదని తెలిసింది. ప్రమాదం జరిగాక వీరి మృతదేహాలను బయటకు తీయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. అతి వేగమే ప్రాణం తీసిందని తేలింది. నిషిత్ మరణించాక పవన్ కల్యాణ్ అపోలో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లి నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ తరుణంలో ఇవాళ విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ పవన్ కల్యాణ్ నిషిత్ వాడిన కారు తనది కాదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌కు కూడా మెర్సిడిజ్ బెంజ్ ఉండటం, నిషిత్ చనిపోయిన కారు పవన్ కల్యాణ్‌దేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో విలేకరులు ఈ ప్రశ్న వేసినట్లు తెలిసింది. అలాంటి మోడల్ కారు తనకు గతంలో ఉండేదని, అయితే వాయిదాలు కట్టుకోలేక వదిలేశానని చెప్పారు.   
 
 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.