మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

సత్యంబాబుకు ఇల్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం

Updated: 10-04-2017 01:55:31

అమరావతి: అయేషా మీరా అత్యాచారం, హత్య కేసులో చేయని నేరానికి 8 ఏళ్లపాటు జైలు జీవితం గడిపి ఇటీవలే విడుదలైన సత్యంబాబుకు ఏపీ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. మచిలీపట్నంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ను సత్యం బాబు కలిశారు. ఆ వెంటనే ఆయనకు కలెక్టర్ ఇల్లు మంజూరు చేశారు. అలాగే సత్యంబాబుకు, ఆయన సోదరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

 

విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఓ లేడీస్ హాస్టల్‌లో 2007 డిశంబర్ 27న అయేషా మీరా దారుణ హత్య జరిగింది. ఈ కేసులో తొలుత దొంగతనాలకు  పాల్పడే లడ్డూ అనే వ్యక్తిని నిందితుడిగా భావించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో అతన్ని వదిలేశారు. ఈ కేసులో 48 మందికి లై డిటెక్టర్ పరీక్షలు, వంద మందికి పాద ముద్ర పరీక్షలు, 800 మందికి  చేతిరాత పరీక్షలు, 57 మందికి డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత  నందిగామకు సమీపంలోని అనాసాగరం గ్రామానికి చెందిన సత్యంబాబును అరెస్టు చేశారు. అంతేకాక పోలీసుల విచారణలో సైతం సత్యంబాబు  నిందితుడని చెప్పేందుకు సాంకేతిక ఆధారాలను కూడా సంపాదించారు. సత్యంబాబుకు ఆగష్టు 4వ తేదిన లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. 9వ తేదిన ఫోరెన్సిక్ ల్యాబ్‌కు అతని నమూనాలు పంపారు. ఈ సమయంలో అప్పటి ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్నవాళ్ల కుటుంబ సభ్యులపైనా తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అయితే.. పోలీసులు ఆ కోణంలో ఆధారాలేమీ దొరకలేదని చెప్పారు. ఈ కేసులో విజయవాడలోని మహిళా సెషన్స్‌ కోర్టు మొత్తం  45 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేసింది. రెండేళ్ల తొమ్మిది నెలల తరువాత సత్యంబాబును దోషిగా నిర్థారిస్తూ జీవిత ఖైదు విధించింది. అయితే పోలీసులు  అన్యాయంగా సత్యంబాబును ఈ కేసులో ఇరికించారంటూ ప్రజా సంఘాల నేతలు  హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తమ గ్రామానికి చెందిన సత్యంబాబు నిర్దోషి అంటూ  ఆ గ్రాస్తులు సైతం చందాలు వేసుకుని హైకోర్టులో అయ్యే ఖర్చులను సైతం భరించడం విశేషం. ఈ కేసును విచారించిన హైకోర్టు ఎనిమిదేళ్ల తర్వాత.. సత్యంబాబు నిర్దోషి అని తేల్చడమే కాక, పోలీసుల వైఖరి, దర్యాప్తు కూడా సరిగా లేదంటూ తీర్పునిచ్చింది.

 

కోర్టు నుంచి బయటకు వచ్చిన సత్యం బాబు తనపై తల్లి సంరక్షణ , చెల్లి పెళ్లి బాధ్యత ఉన్నాయని, ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వెనువెంటనే ఏపీ ప్రభుత్వం సత్యంబాబుకు ఇల్లు మంజూరు చేసింది. సత్యంబాబుతో పాటు ఆయన సోదరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పించాలని అధికారులకు ఆదేశాలందాయి.

 

8 సంవత్సరాల పాటు చేయని నేరానికి జైలుశిక్ష అనుభవించిన సత్యంబాబుకు ఇకనైనా మెరుగైన జీవితం లభించాలని అంతా ఆశిస్తున్నారు. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.