మరోమారు రికార్డులకెక్కిన కోహ్లీ

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరోమారు రికార్డులకెక్కాడు. ప్రపంచంలోని అత్యధిక పారితోషికం పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన తాజా జాబితాలో అమెరికా బాక్సర్ ప్లోయడ్ మేవెదర్ అగ్రస్థానంలో నిలవగా కోహ్లీ 24 మిలియన్ డాలర్ల సంపాదనతో 83 స్థానంలో నిలిచాడు. భారత్‌ నుంచి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్కడిగా కోహ్లీ నిలిచాడు. విచిత్రంగా, ఫోర్బ్స్ విడుదల చేసిన ‘వరల్డ్స్ హయ్యెస్ట్ పెయిడ్ అథ్లెట్స్ 2018’ జాబితాలో ఒక్క మహిళా అథ్లెట్‌కు కూడా చోటు దక్కకపోవడం గమనార్హం.

టీమిండియా రన్ మెషీన్‌గా పేరు గాంచిన కోహ్లీ ప్రపంచంలోనే మేటి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ట్విట్టర్‌లో కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య రెండున్నర కోట్లు దాటిపోయింది. ఇక ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న 41ఏళ్ల మేవెదర్ 285 మిలియన్ డాలర్ల సంపాదనతో అందరికంటే ముందున్నాడు.

మహిళా టెన్నిస్ స్టార్లు అయిన లినా, మారియా షరపోవా, సెరెనా విలియమ్స్‌లు గత జాబితాలో ఉండేవారని, అయితే, 2014లో లి నా రిటైర్ అయిందని, 15నెలల నిషేధం తర్వాత షరపోవా ఇప్పుడిప్పుడే సత్తా చాటుతోందని ఫోర్బ్స్ పేర్కొంది. గతేడాది జాబితాలో సెరెనా విలియమ్స్ టాప్-100 లిస్ట్‌లో చోటు సంపాదించుకుందని తెలిపింది. అయితే, ఈసారి ఆమె ప్రైజ్ మనీ 8 మిలియన్ డాలర్ల నుంచి 62వేల డాలర్లకు పడిపోయిందని తెలిపింది.

ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాళ్లలో మేవెదర్ టాప్ ప్లేస్‌లో నిలవడం గత ఏడేళ్లలో ఇది నాలుగోసారి. రెండోస్థానంలో అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ, సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*