ఫోర్బ్స్ జాబితాకెక్కిన పీవీ సింధు.. అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారిణులలో ఏడో స్థానం!

దేశంలో అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారిణుల జాబితాలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చోటు సంపాదించుకుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన తాజా జాబితాలో సింధు ఏడో స్థానంలో నిలిచింది. ఫలితంగా టాప్-10లో నిలిచిన ఏకైక భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. టోర్నీల ద్వారా అందుకుంటున్న ప్రైజ్ మనీతోపాటు వాణిజ్య ఒప్పందాల ద్వారా వీరు అందుకుంటున్న మొత్తాలను పరిగణనలోకి తీసుకుని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఆమె జాబితాకెక్కడం ఇది వరుసగా మూడోసారి.

ఫోర్బ్స్ జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకున్న సెరెనా ఆదాయం 18.1 మిలియన్ డాలర్లు కాగా, 13 మిలియన్ డాలర్లతో కరోలిన్ వొజ్నోకి (టెన్నిస్) రెండో స్థానంలో నిలిచింది. టెన్నిస్ క్రీడాకారిణే అయిన స్లోనే స్టీఫెన్స్ 11.2 మిలియన్ డాలర్లతో మూడోస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా గార్బిన్‌ ముగురుజ(టెన్నిస్‌), మరియా షరపోవా(టెన్నిస్‌), వీనస్‌ విలియమ్స్(టెన్నిస్‌), పీవీ సింధు(బ్యాడ్మింటన్‌ – 8.5 మిలియన్ డాలర్లు), సిమోనా హలెప్‌(టెన్నిస్‌), డానిక పాట్రిక్‌(రేస్‌ కార్‌ డ్రైవర్‌), కెర్బర్‌(టెన్నిస్‌) ఉన్నారు. టాప్-10లో మొత్తం 8 మంది టెన్నిస్ క్రీడాకారిణులు కాగా, ఇద్దరు మాత్రమే టెన్నిసేతరులు కావడం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*