వృత్తి నైపుణ్య కోర్సులకు ఏది భరోసా?

వృత్తినైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధి దిశగా యువత ముందడుగు వెయ్యగలదని, తద్వారా దేశ ఆర్ధిక పురోగాభివృద్దికి తోడ్పాటు కాగలదనే సదుద్దేశంతో ఏర్పాటు చేసినవే ఒకేషనల్ కోర్సులు. అటువంటి ఒకేషనల్ కోర్సులు చేసిన ఎంతోమంది యువత నేడు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతూంది.

ప్రభుత్వాలు అనుసరిస్తోన్న అసంబద్ధ, అస్పష్ట విధానాలను వ్యతిరేకిస్తూ దాదాపు ౩౦,౦౦౦ మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం తెలంగాణ ఒకేషనల్ స్టూడెంట్స్ మరియు ఆన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్అ సోసియేషన్ మరియు ఇతరులు కలిపి వేసిన ఒక వాజ్యం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది.

1980వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత సాంకేతికంగా, సహేతుకంగా పరిశోధనలు జరిపి ఇంటర్మీడియట్ స్థాయిలో సాంప్రదాయకమైన కోర్సులకు తోడు వృత్తి నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించటం జరిగింది. కాలక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1985లో GO MS 428 ను విడుదల చేసింది. విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రభుత్వ విభాగాలలో వారి సర్వీస్ రూల్స్‌ను మార్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

అదేవిధంగా వ్యవసాయరంగ విభాగంలో వృత్తి విద్య కోర్స్ చేసిన వారికి సబ్ అసిస్టెంట్ పోస్టుకు అర్హత కలదని స్పష్టంగా ప్రభుత్వ ఉత్తర్వులున్నప్పటికీ ఆయా విభాగాలవారు ఏమాత్రం పట్టించుకొనే పరిస్థితిలేదు. తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ వృత్తి విద్య అభ్యసించిన విద్యార్థులకు సైతం మొండి చెయ్యి ఎదురవ్వటంతో విధిలేని పరిస్థితులలో న్యాయస్థానాన్ని సంప్రదించారు.

విద్యార్ధుల తరఫున న్యాయవాది పీట రామన్ తమ వాదనలు వినిపించగా, తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ మరియు కో ఓపెరటివ్, కమీషనర్ అఫ్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ అఫ్ తెలంగాణ న్యాయవాదులు హాజరై తమ వాదనలు, ప్రతిపాదనలు కోర్టువారికి సమర్పించారు.

సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తులు సంజయ్ కుమార్ మరియు ఎం.గంగారావు లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనికి సంబంధించిన మిగిలిన పిటిషన్లను జతచేస్తూ గౌరవ ప్రధాన న్యాయమూర్తి సూచనలకై రిజిస్ట్రార్‌కు నోట్ పెట్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*