అన్నంత పనీ చేసిన కేసీఆర్… ఏపీ నుంచే మొదలెట్టిన టీఆర్ఎస్ అధినేత

విశాఖపట్టణం: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నంత పనీ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఆయన తాను ముందు చెప్పినట్లుగానే ఫెడరల్ ఫ్రంట్ దిశగా చర్యలు ముమ్మరం చేశారు. ఎన్డీయే, యూపీయేతర పార్టీలను ఒకేతాటిపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

ఇందులో భాగంగా తొలుత ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ శారద పీఠానికి చేరుకున్నారు. పీఠంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. పీఠంలోనే భోజనం చేశారు.

విశాఖ శారదా పీఠం నుంచి భువనేశ్వర్‌ చేరుకున్న కేసీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. అనంతరం కేసీఆర్ బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశం అయ్యారు.

పట్నాయక్‌తో కేసీఆర్ జరిపిన చర్చల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. రాత్రి నవీన్ పట్నాయక్ నివాసంలోనే కేసీఆర్ బస చేశారు. యూపీఏకు, ఎన్డీయేకు సమదూరం పాటిస్తూ కూటమిగా ఉండాలనే విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పారు.

కేసీఆర్ నేడు పూరీ జగన్నాధ్ మందిరాన్ని సందర్శించాక కోల్‌కతా వెళ్తారు.

అక్కడ సీఎం మమతతో సమావేశమౌతారు. ఆ తర్వాత కాళీ మందిరాన్ని సందర్శించి ఢిల్లీ బయలుదేరతారు.

2014లో బీజేపీ స్వతంత్రంగా కేంద్రంలో అధికారం చేపట్టేందుకు కావాల్సిన సంఖ్యా బలం సాధించింది. అయినా కూడా ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యతను ముందే ఊహించి ఎన్డీయే బలోపేతానికి కమలనాథులు కృషి చేశారు. అంతేకాదు తమ కూటమిలో లేని పార్టీలతోనూ బీజేపీ సత్సంబంధాలు నెరిపింది. టీఆర్ఎస్, వైసీపీ, అన్నాడిఎంకే, జేడీఎస్, బీజేడీ, ఎన్సీపీ నేతలతోనూ మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సత్సంబంధాలు కొనసాగించింది. అయినా కూడా ఈ పార్టీలేవీ ఎన్డీయేలో చేరలేదు. పైగా ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా టీడీపీ ఎన్డీయేకు గుడ్‌బై చెప్పింది. జనసేన కూడా దూరం జరిగింది. ఈ తరుణంలో 2019 ఎన్నికలు కీలకం కావడంతో ప్రతి ప్రాంతీయ పార్టీ తమదైన వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. టీడీపీ యూపిఏలో చేరిపోయి ప్రధాని అభ్యర్ధిగా రాహుల్‌ను బలపరిచింది.

ఎన్డీయేకు, యూపిఏకు సమదూరం పాటిస్తూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చి అందుకు యత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరిపిన కేసీఆర్ మరోసారి ఆమెతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం భువనేశ్వర్‌లో ఉన్న ఆయన నేరుగా కోల్‌కతా వెళ్లి మమతను కలుస్తారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చిస్తారు. ఆ తర్వాత లక్నో వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం, ఆయన తనయుడు అఖిలేష్‌తో కూడా కేసీఆర్ సమావేశం కానున్నారు. త్వరలో ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో సహా మిగతా పార్టీల నేతలనూ సంప్రదించనున్నారు.

ప్రధాని అభ్యర్ధి ఎవరనే తలనొప్పి లేకుండా ముందు సీట్లు పెంచుకునేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఫలితాలు వచ్చాకే ప్రధాని అభ్యర్ధిత్వం గురించి చర్చించాలని కూడా ఆయన ప్రతిపాదిస్తున్నారు.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ బీజేపీకి మేలు చేసేందుకేనని, మోదీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకేనని కాంగ్రెస్ సహా యూపిఏ పక్షాలు, వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను తేలిగ్గా కొట్టిపారేస్తున్న కేసీఆర్ తనదైన స్టైల్‌లో ఫెడరల్ ఫ్రంట్ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

2019 ఫలితాల తర్వాత అధికారం చేపట్టేందుకు బీజేపీకి, ఎన్డీయేకు పూర్తి సంఖ్యా బలం రాకపోతే ఫెడరల్ ఫ్రంట్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఎవరు ప్రధాని కావాలన్నా ఫెడరల్ ఫ్రంట్ మద్దతు తప్పనిసరి అనే పరిస్థితి తలెత్తుతుంది. ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన మోదీ, షా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తమ బలం పెంచుకుంటున్నారు. తమకు గతంలో ఎక్కువ సీట్లు రాని రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, దక్షిణ భారత్‌పై కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తమకు ఫెడరల్ ఫ్రంట్ అవసరం రాని పరిస్థితిలో ఉండాలని యోచిస్తున్నారు. అయితే తన అంచనాలు తనవంటూ కేసీఆర్ యూపిఏ, ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీల నేతలను ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఏకతాటిపైకి తెచ్చే యత్నాలు తీవ్రం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

—– కొత్తూరు విజయ్‌కుమార్, జర్నలిస్ట్, గుడివాడ

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*