ఏపీలోనూ అదే వ్యూహం… అవే ఫలితాలు!

హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ భేటీ అయ్యారు. తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశం మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డితో మధ్యాహ్నం పన్నెండున్నరకు లోటస్‌పాండ్‌లో భేటీ అయ్యారు. కేటీఆర్‌‌తో పాటు వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సంతోష్ కుమార్, శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులు లోటస్‌పాండ్ వచ్చి జగన్‌తో భేటీ అయ్యారు.

ఇటు వైసీపీ నుంచి జగన్, విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల, చెవిరెడ్డి, మిథున్, వేమిరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపీయేతర, ఎన్డీయేతర ఫ్రంట్ ఏర్పాటుపై టీఆర్ఎస్ ప్రతినిధి బృందం వైసీపీ బృందంతో చర్చించింది.

జగన్‌ను ఫెడరల్ ఫ్రంట్‌లో చేరాలని కేటీఆర్ సూచించారు. దీనికి జగన్ సమ్మతి కూడా తెలిపినట్లు సమాచారం. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాపై తాము కొనసాగిస్తున్న పోరాటానికి ఫెడరల్ ఫ్రంట్ మద్దతివ్వాలని జగన్ కోరినట్లు తెలిసింది.

యూపీయేతర, ఎన్డీయేతర ఫెడరల్ ఫ్రంట్‌లో చేరడం వల్ల జగన్‌కు మేలే జరుగుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్ అనే పేరుతో ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పెద్ద ఎత్తున ముస్లిం ఓట్లను రాబట్టుకోగలిగారు. తాను బీజేపీకి, కాంగ్రెస్‌కు ఇద్దరికీ వ్యతిరేకమని, తనది ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పడం ద్వారా ముస్లింలు టీఆర్ఎస్‌కు భారీగా ఓటేశారు. దీంతో టీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వచ్చింది.

ఇదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్ తాను ఫెడరల్ ఫ్రంట్ వాడినని, తాను బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకమని స్పష్టం చేయనున్నారు. తద్వారా ముస్లింల ఓట్లను పెద్ద సంఖ్యలో సంపాదించుకునే అవకాశం ఉంది. అటు ఎంఐఎం అధినేత ఒవైసీ కూడా కొద్ది సేపటి క్రితం వైసీపీ, టీఆర్ఎస్ కీలక భేటీని స్వాగతించారు. ఒవైసీ గతంలోనే తనకు జగన్ స్నేహితుడని, జగన్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తానని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల్లో కూడా తెలంగాణ తరహా ఫలితాలు రాబోతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ గెలవడం ద్వారా జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల నుంచే పెనుమార్పులకు నాంది పలకడం ఖాయమంటున్నారు. కేసీఆర్, జగన్, ఒవైసీ కాంబినేషన్ సూపర్ హిట్ కావడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. జాతీయ స్థాయిలోనూ మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు విశ్వాసంగా ఉన్నాయి.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తలమునకలు కానున్నారు. ఇందులో భాగంగా ఆయన అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అతి త్వరలో సీఎం కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ ఇప్పటికే దీనికి సంబంధించి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులతో చర్చించారు. మాజీ పీఎం దేవెగౌడ, ఆయన తనయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామితో కూడా చర్చలు జరిపారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏ మేరకు విజయం సాధిస్తుందనేది తేలడానికి మరికాస్త వేచిచూడక తప్పదు.

–పిక్కిలి దీప్తి, జర్నలిస్ట్, హైదరాబాద్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*