భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించిన చాహల్, ధోనీ

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. తొలుత టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. అదే ఊపుతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 230 పరుగులు చేసి భారత్‌ ఎదుట స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. 231 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో ఏడు వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది.

రోహిత్ శర్మ (9), శిఖర్ ధవన్ (23) త్వరగా అవుటైనప్పటికీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీకి నాలుగు పరుగుల ముందు రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో కీపర్ అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ తన సీనియారిటీని రంగరించి ఆచితూచి ఆడాడు. సహచరుడు కేదార్ జాదవ్‌‌తో కలిసి జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించాడు. ఈ క్రమంలో కెరీర్‌లో 70వ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. మరోవైపు జాదవ్ అతడికి అండగా నిలిస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. మొత్తం 114 బంతుల్లో 6 ఫోర్లతో 87 పరుగులు చేసి మరోసారి మ్యాచ్‌ను ఫినిషర్ అయ్యాడు. మరోవైపు కేదార్ జాదవ్ వన్డేల్లో నాలుగో అర్ధ సెంచరీ (61) పూర్తి చేసుకున్నాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను టీమిండియా స్పిన్నర్ చాహల్ నిప్పులు చెరిగే బంతులతో కుప్పకూల్చాడు. అతడి దెబ్బకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (58), షాన్ మార్ష్ (39), ఉస్మాన్ ఖావాజా (34) మాత్రమే కాస్తా ఫరవాలేదనిపించారు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా రాణించలేదు. పది ఓవర్లు వేసిన చాహల్ 42 పరుగులిచ్చి 6 వికెట్లు నేలకూల్చి ఆసీస్ వెన్ను విరిచాడు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న కోహ్లీ సేన ఆసీస్ టూర్‌ను ఘనంగా ముగించడమే కాదు, అరుదైన రికార్డులు సైతం నెలకొల్పింది. చాహల్ తన కెరీర్‌లోనే అద్భుత గణాంకాలు నమోదు చేయగా, కోహ్లీ ఆస్ట్రేలియాపై వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసిన చాహల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోగా, సిరీస్‌లో తొలి నుంచీ రాణించిన ధోనీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అందుకున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*