దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన నేతాజీ

హైదరాబాద్: భారత దేశానికి స్వాతంత్య్రం ఎలా వచ్చింది?.. వెంటనే వచ్చే సమాధానం మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటం వలన.. మనం చరిత్రలో చదువుకున్నది, మన పిల్లల పాఠ్యపుస్తకాల్లో బోధిస్తున్నది ఇదే.. కానీ ఇది పాక్షిక సత్యం మాత్రమే.. అసలు నిజం ఏమిటో తెలుసా?..

నేతాజీ సుభాష్ చంద్రబోస్ కారణంగా మనకు స్వతంత్రం వచ్చింది.. ఆశ్చర్యంగా ఉందా?.. ఈ విషయాన్ని స్వయంగా నాటి బ్రిటన్ ప్రధానమంత్రి క్లైమెంట్ అట్లీ నిర్ధారించారు. ఇది నిజమా?.. అసలు చరిత్రలోకి పోదాం..

కాంగ్రెస్ పార్టీ 1942లో చేప్పట్టిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిష్ వారు దారుణంగా అణచేయడంతో, ఎక్కువ కాలం కొనసాగించలేక పోరాటాన్ని నిలిపేస్తున్నట్లు గాంధీజీ ప్రకటించారు. దీంతో ఇప్పట్లో స్వాతంత్య్రం వచ్చే అవకాశం లేదని నాటి నేతలు నిరాశ చెందారు.. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి స్వతంత్రం ఇస్తున్నామని బ్రిటిష్ వారు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1947లో భారతదేశ స్వతంత్ర ప్రకటనను బ్రిటన్ ప్రధాని క్లైమెంట్ అట్లీ ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించారు.. రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచినా, బ్రిటిష్ వారి ఆర్థిక స్థితి దెబ్బ తినడంతో వలసలను కాపాడుకోలేక స్వతంత్రం ఇచ్చారని నాటి నేతలు భావించారు..

స్వతంత్రం వచ్చిన తర్వాత 1956లో క్లైమెంట్ అట్లీ భారత్ పర్యటనకు వచ్చారు. అప్పుడు ఆయన కలకత్తాలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ జస్టిస్ పీబీ చక్రవర్తి వద్ద రెండు రోజులు అతిథిగా ఉన్నారు. ఆ సమయంలో అట్లీతో చక్రవర్తి జరిపిన సంభాషణలో ఆసక్తికరమైన అసలు వాస్తవాలు బయటకు వచ్చాయి..

కాంగ్రెస్ నేతలు బ్రిటిష్ వారిని ప్రాధేయపడి, మెప్పించి స్వాతంత్ర్యం తెచ్చుకోవాలని చేసిన ప్రయత్నాలు సుభాష్ చంద్రబోస్ కు నచ్చలేదు. వారితో సాయుధపోరాటమే సరైన మార్గం అని భవించారాయన.. గాంధీ, నెహ్రూలతో విభేదించిన బోసుబాబు, బ్రిటిష్ వారి నిఘా నుండి తప్పించుకొని దేశం వదిలిపోయారు..

1943లో నేతాజీ ప్రవాసం నుంచి ప్రారంభించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌ బ్రిటిష్ వారిని కలవర పెట్టింది. తొలి స్వతంత్ర భారత సైన్యంతో పాటు, ప్రభుత్వం, సొంత కరెన్సీ ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారిపై పోరాటం ప్రారంభించారు.. తదనంతర పరిణామాల్లో సుభాష్ చంద్రబోస్ అదృశ్యం అయ్యారు.. అది నేటికీ అది మిస్టరీగానే మిగలడం మనందరికీ తెలుసు..

రెండో ప్రపంచ యుద్ధ విజయం తర్వాత బ్రిటిష్ వారు నేతజీకి చెందిన ఆజాద్ హింద్ ఫౌజ్‌ అధికారులపై రాజద్రోహం మోపి చిత్ర హింసలు పెట్టి విచారణ చేపట్టారు. ఇది బ్రిటిష్ సైన్యంలోని భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. భారత సైన్యంలోని త్రివిధ దళాల్లో తిరుగుబాటు, అవిధేయత ఇంగ్లాండ్ లో గుబులు పుట్టించాయి.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 25 లక్షల మంది భారతీయ సైనికులను తొలగించారు. భారతీయ సైనికులు ఆగ్రహంగా ఉన్నారని, బ్రిటిష్ అధికారుల పట్ల విధేయత ప్రదర్శించడం లేదని నివేదికలు వెళ్లాయి.. ఈ పరిస్థితులలో భారత్ లో మనుగడ అసాధ్యమని గ్రహించిన బ్రిటిష్ వారు స్వాతంత్య్రం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు.

క్లైమెంట్ అట్లీతో చక్రవర్తి సంభాషణ చివరలో భారత్‌ను వదలాలన్న నిర్ణయంలో గాంధీజీ ప్రభావం ఏ మేరకు ఉన్నదని అడిగారు. అట్లీ వ్యంగ్యంగా నవ్వుతూ ‘చాలా తక్కువ’ అని చెప్పారు. దీన్ని బట్టి భారతదేశ స్వాతంత్య్రానికి ముఖ్య కారణం సుభాష్ చంద్రబోస్ అని స్పష్టంగా అర్థం అబుతోంది. నేతాజీ జీవించి ఉన్నారా? మరణించారా? అనే వాదనలు ఒక ప్రక్క కొనసాగుతున్నా, అయన పేరే బ్రిటిష్ వారిని భయ భ్రాంతులకు గురిచేసింది. ఈ సంభాషణ 1982లో ఇని స్టిట్యూట్ ఆఫ్ హిస్టారికల్ రివ్యూ’లో రంజన్ బొర్రా ప్రచురించారు.

భారత స్వతంత్రం కోసం బ్రిటిష్ వారి శత్రువులైన జర్మనీ, జపాన్ లతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యూహాత్మకంగా చేతులు కలిపారు. విదేశీ గడ్డ మీద నుండి ఒక సైన్యాన్ని సృష్టించడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన. నేతాజీ ప్రదర్శించిన నైపుణ్యం, ధైర్య సాహసాలు ప్రపంచ చరిత్రలో ఎవ్వరితో పోల్చలేనివి. .

భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ, నెహ్రూ చేసిన పోరాటాలను తక్కువ చేయలేం.. కానీ అసమాన ధైర్య సాహసాలతో భారత్ సహా ఆసియా, పసిఫిక్ లలో 60 దేశాలు స్వాతంత్య్రం పొందడానికి కారకులైన నేతాజీ పట్ల నాటి కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అవమానకరంగా వ్యవహరించారు. ఆయన విమాన ప్రమాదంపై, అదృశ్యంపై విచారణలో అంతులేని జాప్యం చేశారు. ఒక మహాయోధుడి పట్ల ప్రపంచంలో మరే దేశం ఇంత నిర్లక్ష్యంగా, అవమానకరంగా వ్యవహరించి ఉండదు.

జనవరి 23న మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి.. ఆ మహనీయుని మనసారా స్మరించుకుందాం.. స్ఫూర్తిని నింపుకుందాం..

© క్రాంతి దేవ్ మిత్ర, జర్నలిస్ట్, హైదరాబాద్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*