మోదీపై పాలుపోసిన రాహుల్.. ప్రియాంకకు కీలక పదవి

లక్నో: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకా వాద్రాకు పార్టీలో కీలక పదవి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను నియమిస్తూ రాహుల్ తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది.

నెహ్రూ, ఇందిర వారసురాలు, ఆకర్షణ, వాగ్ధాటి గల నాయకురాలు ప్రియాంక

ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను నియమిస్తూ రాహుల్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సీనియర్ నేతలు ప్రశంసలు కురిపించారు. భర్త రాబర్ట్ కూడా ప్రియాంకకు కీలక పదవి ఇవ్వడంపై సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి ఒకటిన ప్రియాంక పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉన్నారు. నెహ్రూ, ఇందిర వారసురాలిగా, ఆకర్షణ, వాగ్ధాటి గల నాయకురాలిగా ప్రియాంకకు పేరుంది. ఎస్పీ, బీఎస్పీ కూటమికి వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేస్తే ఓట్లు చీలి బీజేపీకి మేలు జరుగుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

అఖిలేష్, మాయావతి షాక్

కాంగ్రెస్ పార్టీని లెక్క చేయకుండా యూపీలో పొత్తులు పెట్టుకున్న ఎస్పీ అధినేత అఖిలేష్, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై గుర్రుగా ఉన్న రాహుల్ ప్రియాంకకు కీలక పదవి ఇవ్వడం ద్వారా వారిద్దరికీ షాకిచ్చారు. తమ పొత్తు ద్వారా మెజార్టీ సీట్లలో విజయం సాధించవచ్చని అఖిలేష్, మాయావతి వేసుకున్న అంచనాలు తలకిందులు కాబోతుండటంతో వారిప్పుడు కంగారుపడుతున్నారు. తమ ఓట్లను చీల్చగలిగే పరిస్థితి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి లేదని మాయ, అఖిలేష్ తొలుత అంచనా వేశారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తక్కువగా అంచనావేసి హస్తం పార్టీని పక్కన పెట్టేసి పొత్తులు కుదుర్చుకున్నారు. అయితే ప్రియాంకకు యూపీలో కీలక పదవి ఇవ్వడం ద్వారా తమ కూటమికి పడాల్సిన ఓట్లు చీలడం ఖాయమని ఎస్పీ, బీఎస్పీ నేతలు వాపోతున్నారు. ఇది పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కన్నా బీజేపీకే మేలు చేస్తుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఎస్పీ, బీఎస్పీ ఓట్లు చీలితే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదని, కేవలం బీజేపీయే లబ్ది పొందుతుందంటున్నారు.

కమలనాథులపై పాలుపోసిన రాహుల్

ఎస్పీ, బీఎస్పీ కూటమి కట్టడంతో బీజేపీ తొలుత కొంత అసహనానికి గురైంది. 2014లో మోదీ హవా కొనసాగినప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోలేదు. అయితే త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ ఉమ్మడిగా పోటీ చేయబోతున్నాయి. యాదవ్, దళిత ఓటు బ్యాంక్ కలిగి పటిష్టమైన స్థితిలో ఉన్న ఎస్పీ, బీఎస్పీ ఒక్కటైతే ప్రత్యర్థులు ఆత్మరక్షణలో పడాల్సిందే. అయితే ప్రియాంకకు కీలక పదవి అప్పగిస్తూ రాహుల్ తీసుకున్న నిర్ణయం బీజేపీకి మేలు చేయనుందని పరిశీలకులు చెబుతున్నారు. తమకు వ్యతిరేకంగా ప్రియాంక ప్రచారం చేస్తారని, తద్వారా తమ కూటమి ఓట్లను నిలువునా చీల్చేస్తారని ఎస్పీ, బీఎస్పీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి 2014లో రెండు సీట్లే వచ్చాయి. బీఎస్పీ ఖాతా కూడా తెరవలేదు. సమాజ్‌వాదీ పార్టీకి కూడా తక్కువ సీట్లే వచ్చాయి. 80 స్థానాలున్న యూపీలో బీజేపీ 72 స్థానాలు గెలుచుకుని ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. అయితే నాడు లేని పొత్తు తాజా పార్లమెంట్ ఎన్నికల్లో కుదరడంతో ఎస్పీ, బీఎస్పీ అంచనాలు పెరిగిపోయాయి. ఎంతగా అంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కకు నెట్టేశాయి. దీంతో అవమానంతో రగిలిపోయిన రాహుల్ ఎస్పీ, బీఎస్పీలకు తగిన గుణపాఠం చెప్పాలనే తన బ్రహ్మాస్త్రమైన సోదరి ప్రియాంకకు పార్టీలో కీలక బాధ్యతలప్పగించారు. వాస్తవానికి ప్రియాంకకు యూపీ తూర్పు ప్రాంత బాధ్యతలే అప్పగించినా ఆమె రాష్ట్రం మొత్తం మీద ప్రభావం చూపిస్తారని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రాహుల్ నిర్ణయంతో బీజేపీ ఖుష్

ప్రియాంకకు కీలక పదవి అప్పగిస్తూ రాహుల్ తీసుకున్న నిర్ణయం తమకూ మేలు చేస్తుందని కమలనాథులు అంచనావేస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీ కూటమికి పడే ఓట్లు చీలి తమకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

మళ్లీ మాకే ఎక్కువ సీట్లంటోన్న కమలనాథులు

1. ఈబీసీలకు రిజర్వేషన్లు
2. ఆయుష్మాన్ భారత్‌
3. గూండాలపై యోగి ఉక్కుపాదం
4. యూపీలో అభివృద్ధిపై ప్రజలు సంతృప్తి

మోదీ సర్కారు ఇటీవల ప్రకటించిన ఈబీసీలకు రిజర్వేషన్ల ద్వారా బీజేపీకి అగ్రవర్ణాల ఓట్లు గంపగుత్తగా పడతాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాక ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదల ఓట్లు కూడా భారీగా పడే అవకాశం ఉందని కమలనాధుల అంచనా. స్వచ్ఛ భారత్ పేరిట కోట్ల సంఖ్యలో మరుగుదొడ్లు కట్టించడం, ఉచిత గ్యాస్ కనెక్షన్లు కూడా తమకు మేలు చేస్తాయని బీజేపీ అంచనా వేస్తోంది.

దీనికి తోడు యూపీలో యోగి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. గూండాయిజంపై ఉక్కుపాదం మోపడం ద్వారా యోగి శాంతి భద్రతల పరిస్థితిని మెరుగుపరిచారని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

2019లో మళ్లీ అధికారంలోకి రావాలంటే మోదీకి యూపీ అత్యంత కీలకం. అందుకే మెజార్టీ సీట్లను మళ్లీ కైవసం చేసుకునేందుకు బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో బీజేపీని యూపీలో దెబ్బతీసేందుకు కాంగ్రెస్ అనుకూల పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎస్పీ బీఎస్పీ పొత్తులు పెట్టుకున్నాయి. అయితే తమ పార్టీని పక్కన పెట్టేసిన ఎస్పీ, బీఎస్పీ కూటమికి బుద్ధి చెప్పేందుకు ప్రియాంకకు కీలక పదవి ఇస్తూ రాహుల్ తీసుకున్న నిర్ణయం తమకు మేలు చేస్తుందని బీజేపీ శ్రేణులు వేస్తున్న అంచనా ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.

కొత్తూరు విజయ్ కుమార్, జర్నలిస్ట్, గుడివాడ

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*