దుమ్మురేపిన ధోనీ.. కివీస్ ఎదుట భారీ విజయ లక్ష్యం

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌‌లోని మౌంట్ మాంగనూయిలో కివీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కోహ్లీ సేన భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 324 పరుగులు చేసి ఆతిథ్య జట్టు ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నభారత్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది.

ఓపెనర్లు రోహిత్ శర్మ , శిఖర్ ధవన్‌లు కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 154 పరుగులు జోడించారు. ఈ క్రమంలో బౌల్ట్ బౌలింగ్‌లో శిఖర్ ధవన్ (66) ఔటయ్యాడు. ధవన్ అవుటయ్యాక కూడా రోహిత్ బ్యాట్ వేడి తగ్గలేదు. కోహ్లీతో కలిసి స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. అయితే, సెంచరీకి చేరువవుతున్న సమయంలో లాకీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 96 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు.

కోహ్లీ (43), అంబటి రాయుడు (48) కూడా స్కోరు వేగం తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ధోనీ మరోమారు చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. మునుపటి ధోనీని తలపిస్తూ 33 బంతుల్లోనే 5 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 48 పరుగులు చేశాడు. చివర్లో కేదార్ జాదవ్ రెచ్చిపోయాడు. 10 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్సర్‌తో 22 పరుగులు చేశాడు. దీంతో భారత్ 324 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు పడగొట్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*