ఈ ఏడాది కూడా మ‌న‌ ఆత్మ‌గౌర‌వానికి ద‌క్క‌ని పుర‌స్కారం

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ప‌లువురు ప్ర‌ముఖుల‌కు 2018- భార‌త‌ర‌త్న అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖర్జీ, దివంగత ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ జానపద గాయకుడు భూపెన్ హజారికాలకు వివిధ రంగాలలో వారు చేసిన ఎన‌లేని కృషికి దేశ అత్యున్న‌త పుర‌స్కారంతో స‌త్క‌రించింది. అయితే తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని న‌లు దిశ‌లా చాటిచెప్పిన విశ్వ విఖ్యాత, న‌ట సార్వ‌భౌమ స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావును మాత్రం కేంద్రం ఈసారి కూడా గుర్తించ‌లేక‌పోయింది. ఈ ఏడాదైనా ఆ మ‌హానుభావుడికి భార‌త‌ర‌త్న ద‌క్కుతుంద‌నే తెలుగువారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది.

ఎన్‌టిఆర్.. మ‌ర‌ణించి ద‌శాబ్దాలు గ‌డుస్తున్నా ఏ మాత్రం క్రేజ్ త‌గ్గ‌ని తెలుగుజాతి మేరున‌గం. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న్ను అభిమానించ‌ని ప్రేక్ష‌కుడు లేడు. ఆయ‌న రాజకీయ ప్ర‌స్థానంలో భాగంగా తెలుగుదేశం పార్టీని వ్య‌వ‌స్థాపించినా.. పార్టీల‌క‌తీతంగా ప‌లు రాజ‌కీయ నాయ‌కులు ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను కీర్తిస్తుంటారు. గత కొన్నేళ్లుగా ఎంతో మంది తెలుగువారు, సినీ పండితులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఎన్‌టిఆర్ కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈసారి కూడా కేంద్రం మొండి చెయ్యి చూప‌డంతో నిరాశే ఎదురైంది.

మొదట్నుంచి కూడా ఆయనకు వెన్నుపోటు పొడిచాడని, ఆయన మరణానికి పరోక్షంగా కారకుడయ్యాడని నిందలు మోస్తున్న చంద్రబాబునాయుడు సైతం ఈ విషయంపై స్పందించారు. ఎన్టీఆర్‌కు భార‌తర‌త్న ప్ర‌క‌టించడంలో కేంద్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని, కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని ఓ సందేశంలో తెలిపారు. ఎన్ని పర్యాయాలు, ఎన్ని అభ్యర్ధనలు చేసినా ఆ మ‌హానాయ‌కుడికి భార‌త‌ర‌త్న ఇవ్వ‌క‌పోవ‌టానికి కేంద్రానికి గ‌ల అభ్యంత‌ర‌మేంటో తెలియ‌ద‌న్నారు.

మ‌రోవైపు కొంత‌మంది పార్టీ నాయ‌కులు మాత్రం మ‌ర‌ణానంత‌రం ఎవ‌రికైనా భార‌త‌ర‌త్న ఇస్తే ఆ అవార్డును స్వీకరించాల్సింది ఆ వ్య‌క్తి స‌తీమ‌ణి అన్న‌ది కేంద్రం నియమం అని అంటున్నారు . ఆ ప్ర‌కారంగా ఆ పుర‌స్కారాన్ని అందుకొనేది లక్ష్మీ పార్వతియే అని, అది చంద్రబాబునాయుడికి ఇష్టంలేదని వారు చెబుతున్నారు. కానీ ఎవ‌రేం చెప్పినా.. మ‌న తెలుగువాడికి ఇప్ప‌టికీ భార‌త‌ర‌త్న ద‌క్క‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రమైన‌ విష‌య‌మే.

Veerendra prasad, journalist, Hyderabad..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*