తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి వాహనం కొన్న చోటే రిజిస్ట్రేషన్

తెలంగాణలోని వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ నుంచి రిజస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ, ఏజెంట్ల చుట్టూ తిరిగే బాధ తప్పనుంది. ఇక నుంచి వాహనం కొన్న చోటే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు లభించనుంది. వాహనాల రిజస్ట్రేషన్ ప్రక్రియను ఇక నుంచి డీలర్లకే ఇవ్వాలన్న ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ విధానం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతోంది. ఈ విధానం అమలల్లోకి వస్తే ఏజెంట్ల మోసాల నుంచి వినియోగదాలకు విముక్తి లభిస్తుంది. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే బాధ తప్పుతుంది. ఫలితంగా ఏజెంట్ల మోసాలకు ఫుల్‌స్టాప్ పడుతుంది. ద్విచక్ర వాహనాలకు, కార్లకు ఈ విధానాన్ని తొలుత అమలు చేయనున్నారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇక నుంచి షోరూం నిర్వాహకులే చేపట్టాల్సి ఉంటుంది. హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లను కూడా వారే బిగించాలి. అ‌లాగని అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తే డీలర్లకు భారీ జరిమానా తప్పదు. లేదంటే డీలర్‌షిప్‌ను కూడా రద్దు చేస్తారు. ఈ విధానం వల్ల ఏప్రిల్ నుంచి నంబరు ప్లేటు లేని వాహనం రోడ్డుపై కనిపించదు. ఒకవేళ ఏదైనా వాహనం నంబరు ప్లేటు లేకుండా కనిపిస్తే జరిమానా తప్పదు.

అయితే ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకుంటే మాత్రం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం అమలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా మార్చాల్సి ఉంటుందని తెలంగాణ ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అవసరమని, అందుకు రూ. 11 కోట్ల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఏప్రిల్ కల్లా అన్నీ సిద్ధం చేసి అమలు చేస్తామని వివరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*